Share News

అమ్మో.. కొండచిలువ!

ABN , Publish Date - Nov 28 , 2024 | 12:02 AM

పలాస కోసంగిపురం జాతీయ రహదారి వద్ద నిర్మాణంలో ఉన్న టిడ్కో గృహ సముదాయంలోకి 12 అడుగుల పొడవు గల భారీ కొండచిలువ చొరబడింది. మంగళవారం రాత్రి ఈ గృహాల వద్ద పనిచేస్తున్న కార్మికులకు ఈ పాము తారాసపడింది.

అమ్మో.. కొండచిలువ!
భారీ కొండచిలువను పట్టుకున్న స్నేక్‌క్యాచర్‌ ఓంకార్‌ త్యాడి

- టిడ్కో గృహాల్లోకి చొరబడిన 12 అడుగుల సర్పం

- చాకచక్యంగా పట్టుకొని అడవిలో విడిచిపెట్టిన స్నేక్‌క్యాచర్‌

పలాస, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): పలాస కోసంగిపురం జాతీయ రహదారి వద్ద నిర్మాణంలో ఉన్న టిడ్కో గృహ సముదాయంలోకి 12 అడుగుల పొడవు గల భారీ కొండచిలువ చొరబడింది. మంగళవారం రాత్రి ఈ గృహాల వద్ద పనిచేస్తున్న కార్మికులకు ఈ పాము తారాసపడింది. దీంతో వారంతా కేకలు వేస్తూ పరుగులు పెట్టారు. దీంతో కొండచిలువ వ్యర్థ నీరు వచ్చే సంప్‌లోకి వెళ్లి చిక్కుకుపోయింది. స్థానికుల సమాచారం మేరకు బుధవారం ఉదయం ఈస్ట్రన్‌గాడ్స్‌ వైల్డ్‌లైఫ్‌ సభ్యుడు ఓంకార్‌త్యాడి, అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అతికష్టంపై పామును బయటకు తీసి గోనె సంచిలో బంధించి సమీప అడవిలో విడిచిపెట్టారు. ఈ పాము పొడవు సుమారు 12 అడుగులు, బరువు 30 కిలోలకు పైగా ఉంది. దీన్ని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఇంత భారీ సర్పాన్ని తాము గతంలో ఎన్నడూ చూడలేదని వారు చెబుతున్నారు. ఇవి మనుషులకు ఏమీ చేయవని, ఇటువంటివి తారాసపడితే తమకు సమాచారం అందించాలని స్నేక్‌క్యాచర్‌ తెలిపారు.

జనావాసాల్లోకి విషసర్పాలు

ఇటీవల కోసంగిపురం ప్రాంతంలో ప్రభుత్వ లేఅవుట్లు వేసిన సమయంలో పుట్టలు, కొండలను యంత్రాలతో తొలగించారు. ఆ సమయంలో భారీ సంఖ్యలో వివిధ రకాల పాములు కనిపించాయి. అవి చెల్లాచెదురైన తరువాత కొండచిలువ ప్రత్యక్షమైనట్లు స్థాని కులు చెబుతున్నారు. టిడ్కో గృహసముదాయం పక్కనే అటవీప్రాంతం ఉండడంతో ఆ వైపు నుంచి కొండచిలువ వచ్చి ఉంటుందని అటవీ సిబ్బంది అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతంలో తరచూ విషసర్పాలు జనావాసాల్లోకి వస్తుండడంతో సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

Updated Date - Nov 28 , 2024 | 12:02 AM