Share News

ఐదేళ్లలో రెండుసార్లే..

ABN , Publish Date - May 26 , 2024 | 11:14 PM

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణపై శీతకన్ను వేసింది.

ఐదేళ్లలో రెండుసార్లే..
సురంగి రాజా మైదానంలో ప్రాక్టీస్‌ చేస్తున్న క్రీడాకారులు

- వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణపై సర్కారు నిర్లక్ష్యం

- నిధులు లేవంటున్న అధికారులు

- ఆటలకు దూరమవుతున్న పిల్లలు

(ఇచ్ఛాపురం)

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణపై శీతకన్ను వేసింది. ఐదేళ్ల పాలనలో రెండు సార్లు మాత్రమే ఈ శిబిరాలు నిర్వహించింది. వీటిని కూడా క్రీడాకారులకు ఎటువంటి కిట్లు ఇవ్వకుండా, కోచ్‌లకు గౌరవ వేతనం చెల్లించకుండా మమా అనిపించేసింది. ఈ ఏడాది మే ఒకటో తేదీ నుంచి సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపులు నిర్వహిస్తామని కోచ్‌ల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. తరువాత సార్వత్రిక ఎన్నికలు అంటూ మే 15కి వాయిదా వేశారు. తిరిగి ఈ ఏడాది రెగ్యులర్‌గా శాప్‌ కోచ్‌లు నిర్వహించే శిక్షణ కేంద్రాలనే సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపులుగా నిర్వహించాలని సంబంధిత ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వంలో ఐదేళ్లలో వందలాది మంది క్రీడాకారులు వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకొని మెరుగైన స్థానాలను సంపాదించుకున్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రెండేళ్లే ఈ శిబిరాలు నిర్వహించారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. ఆ ఏడాది సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపులు నిర్వహించలేదు. 2020, 2021లో కరోనా షాక్‌తో నిర్వహించకుండా వదిలేశారు. 2022, 2023లో నామమాత్రంగా నిర్వహించారు. జిల్లాలో 46 చోట్ల వేసవి శిబిరాలు ఏర్పాటు చేస్తామని హడావిడి చేసి చివరికి 30 చోట్ల మాత్రమే పెట్టారు. ఈ శిబిరాల్లో క్రీడాకారులకు సామ గ్రి లేదు. కోచ్‌లకు గౌరవ వేతనం ఇవ్వలేదు. అదే అదునుగా రాష్ట్ర ప్రభుత్వం సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌లను ఎత్తివేసింది. క్రీడలు, వ్యాయామం ప్రతీ ఒక్కరి జీవితంలో భాగం కావాలని ప్రగల్బాలు పలికిన సీఎం జగన్‌ ఆచరణలో మాత్రం నిర్వీర్యం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను గాలికి వదిలేసింది. దీంతో వేసవి సెలవుల్లో బాగా ఆడాలని ఎదురు చూసిన పిల్లలు శిబిరాలు లేక పోవడంతో నిరాశ చెందుతున్నారు. ఇదంతా పిల్లలను క్రీడలకు దూరం చేయడంలో భాగమేనని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

బడ్జెట్‌ లేదు

జిల్లాలో 8 స్టేడియాల పరిధిలో 20మంది కోచ్‌ల ద్వారా వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నాం. శాప్‌కు బడ్జెట్‌ లేక పోవడంతో మండలాల పరిధిలోని మైదానాల్లో శిక్షణ తరగతులు నిర్వహించడం లేదు. కోచ్‌లకు గౌరవ వేతనాలు ఇవ్వాలన్నా.. ఆట సామగ్రి కొనుగోలు చేయాలన్నా బడ్జెట్‌ కావాలి. కానీ, శాప్‌కు బడ్జెట్‌ కేటాయించడం లేదు. అన్ని చోట్ల వేసవి శిక్షణ శిబిరాలు జరగడం లేదు.

-శ్రీధర్‌, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి

Updated Date - May 26 , 2024 | 11:14 PM