Share News

వైసీపీ వీరవిధేయుల్లో వణుకు

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:44 PM

వైసీపీ పాలనలో రాజకీయ నాయకుల మాదిరిగా అత్యధిక మంది అధికారులు పోటీపడి అధికార పార్టీనేతలతో అంటకాగారు. ప్రజలకు జవాబుదారీగా లేకుండా.. చాలామంది స్వామిభక్తిని చాటుతూ.. వైసీపీ నేతలకు వీరవిధేయులుగా సేవలందించారు. వారి అక్రమాలకు సహకరించారు. ప్రధానంగా ప్రతిపక్షమైన టీడీపీ నేతలను, ప్రభుత్వ తీరును ప్రశ్నించేవారిని వేధించడమే లక్ష్యంగా విధులు నిర్వర్తించారు. తాజాగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో.. ఇటువంటి అధికారులందరిలో ఇప్పుడు వణుకు మొదలైంది.

వైసీపీ వీరవిధేయుల్లో వణుకు

- ఐదేళ్లూ అధికారపార్టీ నాయకులతో అంటకాగారు

- ప్రతిపక్ష నేతలను వేధించడంలో పోలీసులు ముందంజ

- ఓ పోలీసు అధికారిణి భర్త అక్రమాలకు అదుపే లేదు

- జిల్లా శాఖ అధికారులు సైతం వత్తాసు

- విచ్చలవిడిగా సహజవనరుల దోపిడీ

- ప్రభుత్వ మార్పుతో అక్రమార్కులపై చర్యలకు సన్నద్ధం

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

వైసీపీ పాలనలో రాజకీయ నాయకుల మాదిరిగా అత్యధిక మంది అధికారులు పోటీపడి అధికార పార్టీనేతలతో అంటకాగారు. ప్రజలకు జవాబుదారీగా లేకుండా.. చాలామంది స్వామిభక్తిని చాటుతూ.. వైసీపీ నేతలకు వీరవిధేయులుగా సేవలందించారు. వారి అక్రమాలకు సహకరించారు. ప్రధానంగా ప్రతిపక్షమైన టీడీపీ నేతలను, ప్రభుత్వ తీరును ప్రశ్నించేవారిని వేధించడమే లక్ష్యంగా విధులు నిర్వర్తించారు. తాజాగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో.. ఇటువంటి అధికారులందరిలో ఇప్పుడు వణుకు మొదలైంది. అప్పుడు వీరవిధేయత్వం చూపి టీడీపీని.. సామాన్యప్రజలను ఇబ్బంది పెట్టేందుకు సహకరించిన అధికారుల జాబితా సిద్ధమైంది. త్వరలో ప్రక్షాళన జరిగే అవకాశముండడంతో ఎవరిపై వేటు పడుతుందోనన్న గుబులు అధికారులను వెంటాడుతోంది.

- ముందువరుసలో... పోలీసులు

ఐదేళ్లకోసారి కొత్త ప్రభుత్వం కొలువుతీరుతుంది. ప్రజలకు మంచి సేవలందిస్తారన్న నమ్మకమున్న అధికారులను రాష్ట్రంలో ఎక్కడున్నా తమ ప్రాంతానికి తెప్పించుకుని.. వారికి ప్రాధాన్య పోస్టులను కట్టబెట్టేవారు. ఏ ప్రభుత్వమైనా ఇదే పద్ధతిని అనుసరిస్తుంది. అయితే వైసీపీ ఐదేళ్ల పాలనలో మాత్రం ఉద్యోగుల నియామకాలు.. వారిని ఉపయోగించుకున్న తీరు పలు విమర్శలకు దారితీస్తోంది. శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా పర్యవేక్షించాల్సిన బాధ్యత పోలీసు శాఖదే. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడును అరెస్ట్‌ చేసేందుకు.. అప్పట్లో కొద్దిరోజుల ముందు శ్రీకాకుళం ఎస్పీగా ఓ ‘రెడ్డి’ని వైసీపీ ప్రభుత్వం నియమించింది. పోలీసులు మూకుమ్మడిగా ప్రత్యేక బలగాలతో గోడలు దూకి అచ్చెన్నాయుడును అరెస్ట్‌ చేశారు. అతనికి శస్త్రచికిత్స జరిగి రెండురోజులు కూడా గడవకున్నా అరెస్ట్‌చేసి రాష్ట్రమంతా తిప్పారు. అచ్చెన్న అరెస్ట్‌ తర్వాత ఆ ఎస్పీకి పదోన్నతి లభించింది. ఇక టెక్కలి నియోజకవర్గ వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌.. అచ్చెన్నపై పెట్టించిన అక్రమ కేసులు అనేకం. మైకులో కూడా అభ్యంతరకర పదాలను ఉపయోగిస్తూ ప్రతిపక్ష నాయకుల్ని ఇబ్బందులకు గురిచేసినా ఆయనపై తీసుకున్న చర్యలు శూన్యం. టెక్కలిలో జనసేన కార్యాలయంపై దాడి చేసి నిప్పుపెట్టినవారిపైనా పోలీసులు చర్యలు తీసుకోలేదు. టెక్కలి, పలాస డివిజన్‌లకు నియమించిన డీఎస్పీలు కూడా జగన్‌కు అత్యంత వీరవిధేయులుగానే చలామణిఅయ్యారు. టీడీపీ కార్యకర్తలు.. టీడీపీ సానుభూతిపరులు గ్రామానికి దూరంగా ఉన్నా సరే అధికమందిని వేధించే విషయంలో అప్పటి పలాస సీఐ శంకరరావు ఏకపక్షంగా వ్యవహరించేవారు. మహిళా టీడీపీ నేత గౌతు శిరీషను దూషించి.. సోషల్‌మీడియాలో పోస్టింగ్‌లు పెట్టినాసరే వైసీపీవారిపై చర్యలు తీసుకోలేదు. టీడీపీ శ్రేణులను భయబ్రాంతులకు గురిచేసేలా డీఎస్పీ కూడా వ్యవహరించారు. ఇవన్నీ నారా లోకేష్‌ రెడ్‌డైరీలో నమోదయ్యాయి.

- ఓ పోలీసు అధికారిణి భర్త.. ఓ ఏఎస్‌ఐ అక్రమాలు కోకొల్లలు...

జిల్లాలో ఓ పోలీసు అధికారిణి టీడీపీ వారిని పరోక్షంగా ఇబ్బందులకు గురిచేశారు. రెండేళ్ల నుంచి జిల్లాలో మకాం వేసిన ఓ పోలీసు అధికారిణి భర్త.. ఓ ఏఎస్‌ఐతో కలిసి చేస్తున్న అక్రమాలపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఎచ్చెర్లకు చెందిన సామాజిక కార్యకర్తగా చెలామణి అవుతున్న వ్యక్తితో కలిసి భారీ సెటిల్‌మెంట్లకు తెరతీశారు. సామాజిక వర్గం కలిసిరావడంతో అసలు విధులు నిర్వహించకుండా ఏఎస్‌ఐ, అలాగే పోలీసుల అధికారిణి భర్తకు అడుగులకు మడుగులు వత్తుతూ అందినకాడికి దోచుకుంటున్నారు. పశువుల రవాణాకు సంబంధించి వాహనదారులు.. అలాగే జిల్లాలో ఇసుక.. ఇతరత్రా వాటికి సంబంధించి ముడుపులను నేరుగా వీరిద్దరితోనే మాట్లాడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇంతవరకు మౌనంగా ఉన్న వారందరూ ఇప్పుడు గళం విప్పుతున్నారు. మొన్నటివరకు సామాజికవర్గం పేరు చూపి.. ఆమదాలవలస నియోజకవర్గంలో ముందుగా విధులు నిర్వహించిన కొంతమంది పోలీసులు.. ఇప్పుడు శ్రీకాకుళం నియోజకవర్గంలోనూ.. అలాగే ఎస్పీఎఫ్‌ విభాగానికి చెందినవారు కూడా పోలీసు కమ్యూనికేషన్‌ విభాగంలో వైసీపీ నాయకుల సిఫారసుతో విధులు నిర్వహిస్తున్నారు. వీళ్లందరికీ వణుకు ఆరంభమైంది. ఇందులో కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలను కలుస్తూ.. తమ పోస్టింగ్‌లను కాపాడుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. కానీ అన్నీ తెలిసిన జనం మాత్రం.. ప్రక్షాళన చేపడితేనే అవినీతి రహిత పాలన సాధ్యమవుతుందని భావిస్తున్నారు.

- అక్రమాలపై నోరుమెదపని అధికారులు

సమగ్రశిక్ష అధికారి నియామకం నుంచి.. ఆ కార్యాలయంలో కొంతమంది సిబ్బందిని నియమించుకోవడంలో మొన్నటివరకు రాజ్యాంగ బద్ధమైన పదవిలో వ్యవహరించిన వైసీపీ నాయకుడు పరోక్షంగా భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. అధికారి కూడా సహకరించడంతో ఇరువురికి లాభదాయకంగా సమగ్ర శిక్ష కార్యాలయం అనువుగా మారింది. ఇక శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస రోడ్డులో ఆదివారంపేట ఆవల నాగావళి గట్టుకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఓ తహసీల్దార్‌ దర్జాగా రికార్డులను మార్పించి వైసీపీకి చెందినవారి నుంచి రూ.కోట్లలో ముడుపులు తీసుకుని వారికి భారీ లబ్ధి చేకూర్చారు. ఆ స్థలం విలువ ఎన్నికోట్లు చేస్తున్నదీ అంచనా కూడా వేయలేని పరిస్థితి ఇప్పుడుంది. తహసీల్దార్‌కే అంతటి ముడుపులు అందితే.. ఆపై ఉన్న అధికారుల సంగతి చెప్పనక్కర్లేదు. డీఎంహెచ్‌వో నుంచి డీఈవో వరకు విధుల నిర్వహణలో అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది.

- జిల్లాలో చాలామంది అధికారులు వైసీపీ నాయకులకు తొత్తుల్లాగానే పనిచేశారు. జిల్లాలో మైనింగ్‌, ఫుడ్‌సేఫ్టీ అధికారులు ఉన్నారన్న విషయం ప్రజలు మరిచిపోయారు. టెక్కలిలో ప్రాంతంలో గ్రానైట్‌ క్వారీ ఒకటి చూపించి మరోచోట తవ్వకాలు జరుగుతున్నా వైసీపీ ఎమ్మెల్సీకి చెందినవికావడంతో కనీస తనిఖీలు కూడా చేయలేక పోయారు. ఆమదాలవలస, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నా.. వాటాల కోసం చూపిన శ్రద్ధ.. చర్యల విషయంలో ముందడుగు వేయలేక పోయారు. ఇందులో రెవెన్యూ అధికారుల నుంచి ఎస్‌ఐల వరకు ఉన్నారు. హోటళ్లలో తనిఖీలు మరిచి కేవలం నెలవారీ మామూళ్ల మత్తులో అధికారులు ఉన్నారు. ఇటువంటి అధికారులంతా ప్రభుత్వ మార్పుతో దుకాణం సర్దుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఐదేళ్లలో అక్రమాలకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకునే విషయంలో టీడీపీ నాయకులు పట్టుపడుతున్నట్లు సమాచారం. ఏడాదిన్నర కిందట కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్లిన టీడీపీ బృందంపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. పూర్వపు కలెక్టర్‌ ఆదేశాలతో జిల్లాలో పాలన జరిగిందని.. ఇటువంటి అక్రమాలకు పాల్పడిన కిందిస్థాయి నుంచి పైస్థాయి అధికారులను సైతం మార్పిడి చేయాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. అతిత్వరలో ప్రక్షాళన ఖాయమని తెలుస్తోంది.

Updated Date - Jun 08 , 2024 | 11:44 PM