Share News

ప్రయాణికుల ముసుగులో గంజాయి రవాణా

ABN , Publish Date - Feb 06 , 2024 | 11:02 PM

ఓ గంజాయి ముఠా సాధారణ ప్రయాణికులుగా అవతారం ఎత్తారు. రెండు బ్యాగుల్లో గంజాయిని సర్దేసి ఎంచక్కా రైలు ఎక్కేందుకు స్టేషన్‌కు వచ్చారు.

   ప్రయాణికుల ముసుగులో గంజాయి రవాణా
పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి బ్యాగులు

- పలాస రైల్వే స్టేషన్‌లో పోలీసులకు చిక్కిన ముఠా

- 10 కిలోల సరుకు స్వాధీనం

పలాస, ఫిబ్రవరి 6: ఓ గంజాయి ముఠా సాధారణ ప్రయాణికులుగా అవతారం ఎత్తారు. రెండు బ్యాగుల్లో గంజాయిని సర్దేసి ఎంచక్కా రైలు ఎక్కేందుకు స్టేషన్‌కు వచ్చారు. అక్కడ మఫ్టీలో ఉన్న పోలీసులను చూసి నడక వేగాన్ని పెంచారు. పోలీసులు వారిని పట్టుకొని బ్యాగులను తనిఖీ చేయగా బండారం బయట పడింది. 10 కిలోల గంజాయిని స్వాఽధీనం చేసుకొని నలుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. పలాస ఎస్‌ఐ పారినాయుడు వివరాల మేరకు.. తమిళనాడుకు చెందిన తల్లీకుమారుడు లతాపాలరాజు, రాజారామ్‌తో పాటు ఎం.రాధ మంగళవారం మెళియాపుట్టి మండలం గొప్పిలి గ్రామం వద్దకు వచ్చారు. ఇక్కడ వీరికి ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడికి చెందిన ఎన్‌.అప్పారావు అనే వ్యక్తి 10 కిలోల గంజాయి (రెండు ప్యాకెట్లు) అందించాడు. ఈ ప్యాకెట్లను రెండు బ్యాగుల్లో సర్దేసి వాటిని పట్టుకొని తిరిగి తమిళనాడు వెళ్లేందుకు లతా పాలరాజు, రాజారామ్‌, రాధ పలాస రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందడంతో వారిని అదుపులోకి తీసుకొని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురితో పాటు పర్లాకిమిడికి చెందిన అప్పారావును అరెస్టు చేసి పలాస కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా నిందితుడు అప్పారావు మాట్లాడుతూ.. ‘నాకు తమిళనాడుకు చెందిన కొందరితో ఫోన్‌లో పరిచయం ఏర్పడింది. మరో వ్యక్తి ద్వారా మెళియాపుట్టి మండలం గొప్పిలి వద్దకు గంజాయిని తీసుకువచ్చాను. ఇక్కడ తమిళనాడు నుంచి వచ్చిన ముగ్గురు కూలీలకు అందించాను. దీనికిగాను నాకు పది కిలోలకు రూ.5వేలు ఇస్తారు. తమిళనాడు కూలీలకు కిలోకు రూ.5వేల చొప్పున అక్కడున్న ముఠా అందిస్తుంది. అంతవరకే నాకు తెలుసు’నని చెప్పాడు. అయితే, ఈ ప్రాంతంలో కిలో రూ.3వేలకు కొనుగోలు చేసి అక్కడ రూ.30నుంచి రూ.50వేలు వరకూ అమ్ముతారని పోలీసులు చెబుతున్నారు. ఒడిశాలోని మల్కన్‌గిరి, గజపతి, మోహన బ్లాక్‌ల్లో ఉన్న గిరిజన ప్రాంతాల్లో వీటిని అధికంగా పండిస్తూ మన ప్రాంతం మీదుగా చెన్నై, బెంగళూరు ప్రాంతాలకు తరలిస్తుంటారని తెలిపారు. గంజాయి రవాణాదారులను పట్టుకున్న పోలీసు సిబ్బందిని ఎస్‌ఐ అభినందించారు.

Updated Date - Feb 06 , 2024 | 11:02 PM