పారదర్శకంగా దేహదారుఢ్య పరీక్షలు
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:08 AM
Constable Exams సివిల్ ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ప్రిలిమినరీలో ఎంపికైన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు పారదర్శకంగా నిర్వహించనున్నామని ఎస్పీ కేవీ మహేశ్వరెడ్డి తెలిపారు.

దళారులను నమ్మి మోసపోవద్దు
ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి
శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): సివిల్ ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ప్రిలిమినరీలో ఎంపికైన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు పారదర్శకంగా నిర్వహించనున్నామని ఎస్పీ కేవీ మహేశ్వరెడ్డి తెలిపారు. గురువారం శ్రీకాకుళంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి విధి విధానాలు, బందోబస్తుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ‘ఎచ్చెర్లలోని ఏఆర్ ఫరేడ్ మైదానంలో ఈ నెల 30 నుంచి వచ్చే నెల 18 వరకూ కానిస్టేబుళ్ల ఎంపికకు సంబంధించి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నాం. జిల్లావ్యాప్తంగా ఈ పరీక్షలకు 6215 మంది పురుషులు, 1175 మంది మహిళలు మొత్తం 7,390 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఫిజికల్ మెజర్‌మెంట్(పిఎంటి), ఫిజికల్ ఎఫిషియన్సీ(పీఈటీ)పరీక్షలు నిర్వహిస్తాం. మైదానంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిష్పక్షపాతంగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపడుతున్నాం. అభ్యర్థులు నిర్ణీత సమయానికి హాజరు కావాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లు, గెజిటెడ్ అధికారితో అటెస్ట్ట్ట్ చేయించిన జిరాక్స్ పత్రాలు ఒక సెట్ తీసుకురావాలి. కాల్ లెటర్‌లో తెలిపిన స్కోర్ కార్డ్(ఒరిజినల్ రిజల్ట్), స్టేజ్-1, స్టేజ్-2 అప్లికేషన్లు తప్పనిసరిగా ఉండాలి’ అని తెలిపారు. ఉద్యోగాలు కల్పిస్తామనే దళారులు, మధ్యవర్తులను నమ్మొద్దని సూచించారు. అటువంటి వారు ఎదురైతే.. 6300 9990 800, 630 9990 911 ఫోన్ నెంబర్లకు తెలియజేయాలని తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ రమణ, డీఏస్పీలు ఎం.అప్పారావు, డీఎస్‌ఆర్‌వీఎస్‌ఎన్ మూర్తి, ఏవో సీహెచ్ గోపినాధ్, సీఐ ఎం.అవతారం, ఆర్‌ఐ నర్శింగరావు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.