ఎస్‌బీఐ ఆర్‌ఎం రాజుపై బదిలీ వేటు
ABN , Publish Date - Apr 03 , 2024 | 11:55 PM
జిల్లాలోని వివిధ ఎస్‌బీఐ బ్యాంకు కార్యాలయాల్లో కొంతకాలంగా వెలుగుచూస్తున్న కుంభకోణాల నేపథ్యంలో ఆర్‌ఎం టి.రాజుపై బదిలీ వేటు పడింది.

- నరసన్నపేట బ్రాంచ్‌లో రుణాల కుంభకోణమే కారణమా?
- కొత్త ఆర్‌ఎమ్‌గా అబ్దుల్ హసీబ్ అమీర్ బాధ్యతల స్వీకరణ
శ్రీకాకుళం క్రైం, ఏప్రిల్ 3: జిల్లాలోని వివిధ ఎస్‌బీఐ బ్యాంకు కార్యాలయాల్లో కొంతకాలంగా వెలుగుచూస్తున్న కుంభకోణాల నేపథ్యంలో ఆర్‌ఎం టి.రాజుపై బదిలీ వేటు పడింది. కొన్ని నెలల కిందట గార ఎస్‌బీఐ బ్రాంచ్‌లో తాకట్టుపెట్టిన బంగారు ఆభరణాలు మాయం కాగా, నిందితులను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే నరసన్నపేటలోని బజార్ బ్రాంచ్ కార్యాలయంలో బినామీల పేరుతో రుణాలు మంజూరు చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గార బ్యాంకులో జరిగిన ఘటన అనంతరం జిల్లాలోని ఎస్‌బీఐ అన్ని బ్రాంచ్‌ల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో నరసన్నపేట బజారు బ్రాంచ్‌లో లోపాలను గుర్తించినట్లు తెలుస్తోంది. గార బ్యాంకులో మాదిరిగానే ఇక్కడ కూడా ఉద్యోగులను బలిపశువులను చేయాలనుకున్నారు. ఎస్‌బీఐలో రీజనల్ స్థాయి అధికారి నిర్లక్ష్యంతోపాటు అతని పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. శ్రీకాకుళం రీజనల్ మేనేజర్ టి.రాజును మంగళవారం రాత్రి ఉన్నతాధికారులు బదిలీ చేశారు. ఆయన స్థానంలో బొబ్బిలిలో ఆర్‌ఎంగా విధులు నిర్వహిస్తున్న అబ్దుల్ హసీబ్ అమీర్‌ను శ్రీకాకుళంలో నియమించారు. తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించారు. బుధవారం ఉదయమే అబ్దుల్ హసీబ్ అమీర్ బాధ్యతలు చేపట్టారు. ఈ విషయమై బ్యాంకు సిబ్బందిని, యూనియన్ నాయకులను సంప్రదించగా అంతా తమ మంచికే జరిగిందని చెప్పడం కొసమెరుపు. ప్రస్తుతం బదిలీ అయిన ఆర్‌ఎం రాజు విశాఖపట్నంలోని ఎస్‌బీఐ జోనల్ కార్యాలయానికి రిపోర్ట్ చేయగా.. ఆయనకు ఇంకా పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది.