సమస్యలు చెప్పేందుకు.. 80 కి.మీ. వెళ్లాల్సిందే!
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:27 PM
పరిపాలనా సౌలభ్యం కోసమే జిల్లాల పునర్విభజన చేశామని వైసీపీ సర్కారు గొప్పలు చెప్పింది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ప్రగల్భాలు పలికింది. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పునర్విభజనలో భాగంగా జిల్లాలోని ఐటీడీఏ పక్క జిల్లాకు తరలిపోయింది. ఇక్కడ కొత్త ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని వైసీపీ నేతలు హామీ ఇచ్చారు. రెండేళ్లవుతున్నా అతీగతి లేదు.

- పునర్విభజనలో జిల్లా నుంచి పోయిన ఐటీడీఏ
- కొత్తగా ఏర్పాటు చేస్తామని చెప్పిన వైసీపీ సర్కారు
- అతీగతిలేక ఇబ్బందులు పడుతున్న గిరిజనులు
(మెళియాపుట్టి)
పరిపాలనా సౌలభ్యం కోసమే జిల్లాల పునర్విభజన చేశామని వైసీపీ సర్కారు గొప్పలు చెప్పింది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ప్రగల్భాలు పలికింది. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పునర్విభజనలో భాగంగా జిల్లాలోని ఐటీడీఏ పక్క జిల్లాకు తరలిపోయింది. ఇక్కడ కొత్త ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని వైసీపీ నేతలు హామీ ఇచ్చారు. రెండేళ్లవుతున్నా అతీగతి లేదు. దీంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యలను విన్నవించేందుకు 80 కిలోమీటర్ల దూరంలోని పక్క జిల్లాకు వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. కొత్తగా కొలువుదీరనున్న కూటమి ప్రభుత్వం తమ సమస్యకు మోక్షం చూపాలని కోరుతున్నారు.
............................
జిల్లాకు ఐటీడీఏ లేకపోవడంతో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గం పార్వతీపురం మన్యం జిల్లాలో కలిసిపోయింది. ఈ నియోజకర్గంలోని సీతంపేట ఐటీడీఏ కూడా ఆ జిల్లాకే వెళ్లిపోయింది. ఫలితంగా ఏ సమస్య వచ్చినా జిల్లా గిరిజనులు సీతంపేటకే వెళ్లాల్సి వస్తోంది. కొత్త ఐటీడీఏ ఏర్పాటు చేయాలని గత రెండేళ్ల నుంచి గిరిజనులు ఆందోళనలు చేస్తున్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మెళియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రెడ్డిశాంతి, మందసలో పెట్టాలని మంత్రి సీదిరి అప్పలరాజు ప్రభుత్వం వద్ద పంచాయితీ నడిపినట్లు ప్రచారం జరిగింది. కానీ, చివరకు ఎక్కడా ఏర్పాటు చేయలేదు. వైసీపీ ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని గిరిజనులు మండిపడుతున్నారు.
ఇటు వైపు రాని అధికారులు
జిల్లాలో మెళియాపుట్టి, మందస, కొత్తూరు, పాతపట్నం మండలాల్లో గిరిజనులు అధికంగా ఉన్నారు. 16 గిరిజన ఉప ప్రణాళిక మండలాలు ఉన్నాయి. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 848 గిరిజన గ్రామాలు ఉండగా.. మన్యం జిల్లాకు 378, శ్రీకాకుళం జిల్లాకు 470 గ్రామాలు కేటాయించారు. విభజన జరిగిన నాటి నుంచి ఐటీడీఏ అధికారులు జిల్లాలోని సబ్‌ప్లాన్ మండలాల వైపు కన్నెత్తి చూడడం లేదు. ఈ గ్రామాల్లో ఏం జరుగుతుందో కూడా వారు పట్టించుకోవడం లేదు. పలు అశ్రమ పాఠశాలల్లో మెనూ సక్రమంగా అమలు చేయడం లేదని ఫిర్యాదులు అందుతున్నా తనిఖీలకు రావడం లేదు. ఐటీడీఏ నిధులతో పలు గిరిజన గ్రామాల్లో రహదారుల పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తికాకుండా అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు బిల్లులు చేయించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఐటీడీఏ గత పీవో కల్పనాకుమారి రెండుసార్లు మాత్రమే ఈ పనుల పరిశీలనకు వచ్చినట్లు గిరిజనులు చెబుతున్నారు.
హామీ ఏమైంది..
వైసీపీ నేతలు రెండేళ్ల నుంచి అదిగో.. ఇదిగో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామంటూ గిరిజనులను మోసం చేస్తున్నారు. జిల్లాకు కొత్త ఐటీడీఏ వచ్చాకే గిరిజనులకు ఓట్లు అడుగుతానని పలు సందర్భాల్లో ఎమ్మెల్యే రెడ్డిశాంతి హామీ ఇచ్చినా అది నెరవేరలేదు. దీంతో పలు గిరిజన సంఘాలు ఆమెను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకున్నాయి. కంటితుడుపు చర్యగా ఎమ్మెల్యే ఒకసారి అసెంబ్లీలో ఈ విషయాన్ని లేవనెత్తారు. ఐటీడీఏను కేటాయించటానికి ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పి ఆ తరువాత మరిచిపోయారు.
మూడు బస్సులు మారితేనే..
గిరిజనులు తమ సమస్యలను ఐటీడీఏ అధికారులకు చెప్పుకోవాలంటే 80 కిలోమీటర్ల దూరంలోని సీతంపేటకు వెళ్లాల్సిందే. మూడు బస్సులు మారితే కానీ అక్కడకు చేరుకోలేరు. బస్సు చార్జీలు చెల్లించేందుకు కూడా కొందరి గిరిజనుల వద్ద డబ్బులు లేని పరిస్థితి. దీంతో వారు తమ సమస్యలను చెప్పుకోవడానికి సీతంపేటకు వెళ్లలేకపోతున్నారు. అధికంగా మందస, మెళియాపుట్టి, నందిగాం, సారవకోట, పాతపట్నం, ఎల్‌ఎన్‌పేట మండలాల్లో ఉన్న గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా గిరిజన గ్రామాలకు తాగునీరు, రహదారుల సౌకర్యం లేదు. వైపీసీ ప్రభుత్వం వచ్చిన తరువాత సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లించి వివిధ కార్పొరేషన్లకు కేటాయించడంతో గిరిజన సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. కొండపైన ఉన్న గ్రామాలకు రహదారుల పేరుతో రూ.కోట్లు నిధులు ఖర్చు చేస్తున్నా నేటికీ అవి పూర్తికావడం లేదు. అధికంగా అధికారపార్టీకి కాంట్రాక్టర్లు ఈ పనులు చేస్తుండడంతో అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో.. కొత్త ప్రభుత్వమైనా జిల్లాలో ఐటీడీఏను ఏర్పాటు చేసి తమ సమస్యలను పరిష్కరించాలని గిరిజనులు కోరుతున్నారు.
ఇబ్బందులు పడుతున్నాం
మెళియాపుట్టి, మందస మండలాల నుంచి గిరిజనులు సీతంపేట వెళ్లాలంటే 80 నుంచి 90 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. డైరెక్టు బస్సులు లేకపోవడంతో మూడు బస్సులు మారి సీతంపేటకు చేరుకోవాలి. దీంతో ఇబ్బందులు పడుతున్నాం. దీనిపై గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని అమరావతిలో కలిసి ఐటీడీఏ ఏర్పాటు చేయాలని విన్నవించాం. కానీ, కేటాయించ లేదు.
-చల్లా శాంతారావు, గిరిజన సంఘం నాయకుడు
......................................
ఆశ పడ్డాం
మెళియాపుట్టి మండలానికి ఐటీడీఏ వస్తుందని ఆశ పడ్డాం. కానీ రెండేళ్లుగా నిరాశే మిగిలింది. దీంతో మా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు సీతంపేట వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మెళియాపుట్టిలో ఐటీడీఏను ఏర్పాటు చేయాలి.
- సవర రమేష్, కేరాశింగి, మెళియాపుట్టి
......................................
చార్జీలు భరించలేకపోతున్నాం
గిరిజన గ్రామాల్లో రైతులకు సాగు నీరు అందడం లేదు. దీనిపై ఐటీడీఏ అధికారులకు ఫిర్యాదు చేయాలనుకున్నా చేయలేకపోతున్నాం. మెళియాపుట్టి నుంచి సీతంపేటకు వెళ్లి వచ్చేందుకు రూ.250 బస్సు చార్జీ అవుతుంది. దీంతో చార్జీలు భరించలేక అంత దూరం వెళ్లలేకపోతున్నాం.
- బింజయ్య, గడిమెట్ట జగన్నాథపురం