Share News

మహేంద్రగిరులకు ముప్పు!

ABN , Publish Date - Oct 21 , 2024 | 12:24 AM

కేరళ రాష్ట్రం వయనాడ్‌ ప్రాంతంలో ఇటీవల వరదల బీభత్సానికి కొండలు కరిగి ఊర్లకు ఊర్లే కనుమరుగయ్యాయి. వందలాది ప్రాణాలు మట్టిలో కలిసిపోయాయి. కాగా 2018 అక్టోబరు 11న జిల్లాలో తితలీ తుఫాన్‌ కూడా ఇటువంటి విలయాన్నే సృష్టించింది.

మహేంద్రగిరులకు ముప్పు!
మహేంద్రగిరులు.. ఇన్‌సెట్‌లో.. లొత్తూరులో కొండలు కరిగి మేటలు వేసిన వరి పంట(ఫైల్‌)

- తితలీ తుఫాన్‌ నుంచే ప్రకృతి విధ్వంసానికి నాంది

- మరో వయనాడ్‌ కానుందా? అనే సందేహాలు

- ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న గిరిజన పంచాయతీలు

పలాస, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి):

తూర్పు కనుమల్లో అందమైన ప్రాంతం మహేంద్రగిరులు. ఈ పర్వతాలకు ఆనుకొని ఉన్న లొత్తూరు పంచాయతీలో 2018 అక్టోబరు 11న సంభవించిన తితలీ తుఫాన్‌ ధాటికి కొండలు సైతం కరిగి గ్రామాల మీదకు రాళ్లు రావడంతో గిరిజనులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. తుఫాన్‌ ప్రభావంతో సర్వం కోల్పోయి రోడ్డున పడగా, పంట పొలాల్లో కొండల నుంచి వచ్చిన జలపాతాల ధాటికి ఇసుక మేట వేయడంతో భారీగా ఆస్తినష్టం జరిగింది. సంప్రదాయ పంటలు సైతం కనుమరుగు కాగా పచ్చనిచెట్లు కూడా నాశనమయ్యాయి. దీంతో లొత్తూరు పంచాయతీ మొత్తం తితలీ దెబ్బకు అతలాకుతలమైంది. ఇప్పటికైనా మేల్కోకపోతే మహేంద్రగిరులకు తుఫాన్ల సమయంలో ముప్పు తప్పదని.. ఇటీవల కేరళలో వయనాడు మాదిరి.. పరిస్థితి ఎదురుకానుందని పర్యావేరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.

.................................

కేరళ రాష్ట్రం వయనాడ్‌ ప్రాంతంలో ఇటీవల వరదల బీభత్సానికి కొండలు కరిగి ఊర్లకు ఊర్లే కనుమరుగయ్యాయి. వందలాది ప్రాణాలు మట్టిలో కలిసిపోయాయి. కాగా 2018 అక్టోబరు 11న జిల్లాలో తితలీ తుఫాన్‌ కూడా ఇటువంటి విలయాన్నే సృష్టించింది. 200 కిలోమీటర్లకు పైగా వాయువేగంతో గాలులు వీచాయి. కళ్లముందే కూలిపోతున్న జీడి, కొబ్బరి, భారీ వృక్షాలను చూసి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. మహేంద్రగిరులకు ఆనుకుని ఉన్న పలాస మండలం లొత్తూరు పంచాయతీలో కొండచరియలు విరిగి గ్రామాల్లోకి వచ్చేశాయి. పెదపలియా, చినగంతారులో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో గిరిజనులు భయాందోళన చెందారు. ప్రస్తుతం వయనాడ్‌ దుస్థితి చూస్తే అంకన్నా ఘోరంగా లొత్తూరు ప్రాంతాలు మారనున్నాయా అన్న అనుమానాలు కలుగకమానదు.

- తూర్పుకనుముల్లో మహేంద్రగిరి పర్వతాలు 1501 మీటర్ల ఎత్తులో ఉంటాయి. వాటి కింద భాగంలో లొత్తూరు పంచాయతీ గ్రామాలు ఉన్నాయి. గత తితలీ తుఫాను సమయంలో మహేంద్రగిరుల్లో ఉన్న ప్రాంతం భారీగాలులు, వారం రోజులుగా కురిసిన తుఫాను ధాటికి కొండ కరిగి లొత్తూరు గిరిజన పంచాయతీలపై పడింది. మహేంద్రగిరుల గుండా వరహాలుగెడ్డ నీరు ప్రవహిస్తుంటుంది. 100 అడుగులు ఉన్న ఈ గెడ్డ తుఫాను ప్రభావంతో 500 అడుగుల వరకూ పెరిగి భారీ ప్రవాహంతోపాటు కొండపై ఉన్న బండలు, మట్టి తరలివచ్చి కిలోమీటరు మేర మేటలు వేసింది. మరో అర కిలోమీటరు ఈ ప్రవాహం వెళ్లి ఉంటే లొత్తూరు గ్రామానికి తీవ్ర నష్టం కలిగి ఉండేది. ప్రకృతి కరుణించి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అప్పటికే జరగని నష్టం జరిగిపోయింది. 20 ఎకరాలకు పైగా మట్లి, రాళ్లు మేటలు వేయగా కల్వర్లులు సైతం కొట్టుకుపోయాయి. తుఫాను వెళ్లిన వారం తరువాత కానీ అక్కడి నష్టం గురించి బాహ్య ప్రపంచానికి తెలియరాలేదు. అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’ అతి కష్టంపై అక్కడకు వెళ్లి పరిస్థితిని అధికారులకు చేరవేసింది. ప్రస్తుతం లొత్తూరు గిరిజన పంచాయతీ గ్రామాల్లో సాధారణ పరిస్థితి నెలకొంది. ఇసుక మేటలు, రాళ్లు దిబ్బలుగా మారిన ప్రాంతాల్లో చదునుచేసి పంటలు పండిస్తున్నారు. అయితే తుఫాన్‌ నీడలు మాత్రం గిరిజనులను వెంటాడుతూనే ఉన్నాయి. కొండలు కరిగిపోతుండడం వల్ల వయనాడ్‌ వలె ఇక్కడ కూడా ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- భారీ కొండల మధ్యలో చిన్న రహదారి, దాని పక్కన వరహాలుగెడ్డ సెలయేరు ప్రవహిస్తోంది. ప్రకృతి వైప్యరీత్యాల సమయాల్లో ఆయా గ్రామాల ప్రజలకు ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేయాల్సి ఉంది. గిరిజనులకు కొండల సమూహంపై అవగాహన లేకపోవడం వల్ల ఇళ్ల నిర్మాణానికి రాళ్లు తీయడం, చెట్లు నరికి పోడు వ్యవసాయం చేయడం వల్ల భారీ ముంపు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. మరో వయనాడ్‌ కాకుండా గిరిజనులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కొండలు మనకు అండ

మొక్కల వేర్లు, దాని నుంచి పెరిగే మూలకేశాలు మట్టిరేణువులను బంధించి కొండలపై మృత్తిక క్షమక్షయం జరగకుండా ఆపుతాయి. అందుకే అడవుల్లో చెట్లు నరికివేయడం, పోడు వ్యవసాయం వంటి పనులు చేయకూడదు. అలా చేయడం వల్లే ఇటువంటి విలయాలు జరుగుతుంటాయి. వర్షాలకు మట్టి, కొండచరియలు విరిగిపడి భారీ నష్టాన్ని కలుగజేస్తాయి. కొండ దిగువ ఉన్న ప్రాంతాల్లో కంకర, రాళ్లు తవ్వి తీయడం వల్ల ఎత్తయిన కొండలకు పునాదులు లాంటివి లేకపోతే ఇళ్లు లాంటి కొండ ఎక్కడ నిలుస్తుంది. తుఫానుల నుంచి సహజసిద్ధంగా ప్రహరీలుగా నిలిచే కొండలు లేకపోతే విపత్తులు సహజమే. దీన్ని అరికట్టడానికి ప్రభుత్వాలు మందుస్తుగా చొరవ తీసుకొని విలయాలు ఆపాల్సి ఉంది.

- కొయ్యిల శ్రీనివాసరావు, పర్యావరణమిత్ర పురస్కార గ్రహీత, సైన్స్‌ ఉపాధ్యాయుడు, బ్రాహ్మణతర్లా

............................

రక్షణ చర్యలు చేపట్టాలి

లొత్తూరు పంచాయతీ హొల్ధిగామ్‌, పెద్దగంతారు, చింతువీధి, డెర్లి వంటి గ్రామాలు మహేంద్రగిరి పర్వతాల దిగువన ఉన్నాయి. తుఫానుల కారణంగా కొండచరియలు, రాళ్లు, బురదతో ఉన్న వరదనీరు గ్రామాల్లోకి వస్తున్నాయి. వర్షం పడితే.. బిక్కుబిక్కుమంటు గడపాల్సిన పరిస్థితి నెలకొంది. పంటలు సైతం మేటలు వేసి నాశనం అవుతున్నాయి. ముందుగా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి అటువంటి గ్రామాలను గుర్తించి చుట్టు రక్షణ గోడలు నిర్మించాలి. కొన్ని చోట్ల కందకాలు తవ్వి రక్షణ క ల్పించాలి.

- వంకల మాధవరావు, పర్యావరణ ఉద్యమకారుడు, అఖిలభారత రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

.........................

ముందుచూపు ఉండాలి

వయనాడ్‌తో పాటు ఒడిశాలో గుమ్మ బ్లాక్‌లో కొండలు కరిగి గ్రామాల్లోకి నీరు రావడం వల్ల అనేక గ్రామాలు ఇప్పటికీ కనిపించడం లేదు. వందలాది ప్రాణాలు పోయాయి. దీని నుంచి ఇప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాఠాలు నేర్వలేకపోవడం దురదృష్టకరం. గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీలకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలి. ముందుచూపుతో ప్రకృతి వైప్యరీత్యాల నుంచి రక్షణ కల్పించాలి.

వాబ యోగి, ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

Updated Date - Oct 21 , 2024 | 12:24 AM