Share News

నామినేషన్‌కు ఇవి పాటించాల్సిందే

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:10 AM

జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు, లోక్‌సభ సెగ్మెంట్‌కు గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు.

నామినేషన్‌కు ఇవి పాటించాల్సిందే
నరసన్నపేటలో నామినేషన్‌ దాఖలు చేసే కేంద్రం వద్ద పరిశరాలను పరిశీలిస్తున్న ఎస్‌బీ డీఎస్పీ త్రినాఽథరావు, ఆర్వో రామ్మోహాన్‌రావు, సీఐప్రసాదరావు

నరసన్నపేట, ఏప్రిల్‌ 17: జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు, లోక్‌సభ సెగ్మెంట్‌కు గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. ఈ నేపథ్యంలో నామినేషన్‌ దాఖలు చేయడానికి వచ్చే అభ్యర్థులకు ఎన్నికల సంఘం పలు నిబంధనలను అమలు చేస్తోంది. నామినేషన్‌ దాఖలుచేసే కేంద్రంలోకి అభ్యర్థితో సహా ఐదుగురిని మాత్రమే అనుమతించనున్నారు. అఫడవిట్‌లో అభ్యర్థులు క్రిమినల్‌ కేసుల వివరాలు తెలియజేయాలని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. నిబంధనలను అతిక్రమిస్తే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడిగా ఈసీ ప్రకటించే కూడా అవకాశముంటుంది.

నిబంధనలు ఇవీ

- నామినేషన్‌ సమయంలో అభ్యర్థితోపాటు మరో నలుగురిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు

- నామినేషన్‌ కేంద్రానికి 100 మీటర్లు వరకు ఎవ్వరిని అనుమతించారు.

- మూడు వాహనాల వరకు మాత్రమే లోపలికి అనుమతిస్తారు

- నియోజకవర్గం కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి (పనిదినాల్లో) ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు గంటలు వరకే నామినేషన్లను స్వీకరించనున్నారు.

-అభ్యర్థిని బలపరిచే వ్యక్తి అదే నియోజవర్గానికి చెందిన వారై ఉండాలి.

- గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థికి ఒకరు, అదే గుర్తింపు లేని పార్టీతో సహా స్వతంత్ర అభ్యర్థికి పది మంది బలపరచాలి.

- ఒక్కో అభ్యర్థి కనీసం మూడు నామినేషన్లను అందచేయవచ్చు.

-నామినేషన్‌ సమర్పించే అభ్యర్థి సెక్యూరిటీ డిపాజిట్‌ కింద జనరల్‌ అభ్యర్థి రూ.10వేలు, ఎస్పీ, ఎస్టీ అభ్యర్థి రూ.ఐదు వేలు చెల్లించాల్సి ఉంటుంది.

నేరచరిత్ర అఫడవిట్‌లో పొందుపరచాలి

- అభ్యర్థి నేర చరిత్ర ఉంటే కనీసం (ఫారం-26లో అఫిడవిట్‌ను విధిగా జతపరచాలి) మూడు సార్లు ప్రముఖ దినపత్రికలు, చానళ్లకు సుప్రీంతీర్పు ఆదేశాల మేరకు ప్రకటనలు ఇవ్వాలి.

- నామినేషన్ల దాఖలు మొదలు, పోలింగ్‌ తేదీ నాటికి కనీసం మూడు సార్లు తమ చరిత్రను ప్రజలకు వెల్లడించాలి.

- అభ్యర్థులు ఎన్నికల నియమావళిని తుచాతప్పకుండా పాటించాలి.

- నామినేషన్‌ అందజేయడానికి వచ్చిన నాటి నుంచి అభ్యర్థి ఎన్నికల ప్రచారు ఖర్చును లెక్కించునున్నారు.

- అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహించరాదు. ఎక్కడైనా అనుమతిని సువిధ యాప్‌ ద్వారా రిటర్నింగ్‌ అధికారికి దరఖాస్తు చేసుంటే వారు అనుమతులను మంజూరు చేస్తారు.

- ఏవైనా ఫిర్యాదులు ఉంటే రిటర్నింగ్‌ అధికారుల దృష్టికి తీసుకురావాలి.

Updated Date - Apr 18 , 2024 | 12:10 AM