Driving track: ఒక్కటీ లేదు
ABN , Publish Date - Dec 28 , 2024 | 11:47 PM
no driving track జిల్లాలో ఎంవీఐ కార్యాలయాల పరిధిలో ఒక్క డ్రైవింగ్ ట్రాక్ కూడా లేకపోవడం గమనార్హం. డ్రైవింగ్ ట్రాక్‌ల నిర్మాణం ఏళ్ల తరబడి ప్రతిపాదనలకే పరిమితమవుతోంది.

జిల్లాలో కానరాని డ్రైవింగ్ ట్రాక్‌లు
స్థలం కేటాయింపులో రెవెన్యూ శాఖ జాప్యం
నిలిచిన స్పీడ్‌గన్ సేవలు
మరోవైపు ఎంవీఐల కొరతతో ఇక్కట్లు
టెక్కలి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): ద్విచక్ర వాహనం, ఫోర్‌వీలర్, హెవీ వెహికిల్.. ఇలా ఏ వాహనం నడపాలన్నా డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఇందనశకట తనిఖీ అధికారి(ఎంవీఐ) కార్యాలయం వద్ద డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందాలి. దరఖాస్తుదారులకు ముందుగా ఎల్‌ఎల్‌ఆర్ సౌకర్యం కల్పిస్తారు. నెలరోజుల తర్వాత రవాణాశాఖ అధికారులు నిర్వహించిన డ్రెవింగ్ పరీక్షల్లో నెగ్గితే దరఖాస్తుదారుడు వయసు, ఆరోగ్య స్థితిని బట్టి పర్మినెంట్ కార్డులు జారీ చేస్తారు. కాగా.. దరఖాస్తుదారులకు పరీక్షలు నిర్వహించేందుకు జిల్లాలో ఎంవీఐ కార్యాలయాల పరిధిలో ఒక్క డ్రైవింగ్ ట్రాక్ కూడా లేకపోవడం గమనార్హం. డ్రైవింగ్ ట్రాక్‌ల నిర్మాణం ఏళ్ల తరబడి ప్రతిపాదనలకే పరిమితమవుతోంది. డ్రైవింగ్ ట్రాక్ ఏర్పాటుకు కనీసం ఐదారు ఎకరాల స్థలం అవసరం. ఆ స్థలాన్ని రవాణాశాఖకు కేటాయించే విషయంలో రెవెన్యూ అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. కొన్నిచోట్ల పట్టణాలకు దూరంగా కొంతమేర స్థలాలు కేటాయించడంతో.. అవి ప్రతిపాదనల్లోనే మగ్గిపోతున్నాయి.
జిల్లాలోని శ్రీకాకుళం, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో ఎంవీఐ కార్యాలయాలు ఉన్నాయి. ఈ నాలుగు చోట్ల ఎక్కడా డ్రైవింగ్ ట్రాక్‌లు లేవు. డ్రైవింగ్ ట్రాక్ ఉన్నచోట లైట్‌ట్రాక్, హెవీ ట్రాక్, టూవీలర్ ట్రాక్, హెవీట్రైలర్ నడిపే ట్రాక్‌ల సౌకర్యం ఉండాలి. అప్రోచ్‌రోడ్డు, టూవీలర్ పార్కింగ్, రెస్ట్‌రూమ్, మౌలిక సదుపాయాలు, కనీసం మూడువేల చదరపు అడుగుల ఎంవీఐ కార్యాలయాల నిర్మాణాలు ఉండాలి. ఈ మేరకు ట్రాక్ స్థలం ఏర్పాటుకు రవాణాశాఖ అధికారులు దరఖాస్తులు చేస్తూనే ఉన్నారు. రెవెన్యూ అధికారులు మాత్రం స్థలం కేటాయింపు విషయంలో కాలయాపన చేస్తున్నారు.
గతంలో టెక్కలి ఎంవీఐ కార్యాలయానికి సంబంధించి డ్రైవింగ్ ట్రాక్ కోసం.. మేఘవరం పంచాయతీ అడ్డుకొండ ప్రాంతంలో ఐదు ఎకరాల స్థలం చూపించారు. టెక్కలికి 8 కిలోమీటర్లు దూరంలో కేటాయించిన ఈ స్థలాన్ని అప్పటి రవాణాశాఖ అధికారులు పరిశీలించారు. డ్రైవింగ్ ట్రాక్ నిర్మాణానికి ఆమోదయోగ్యంగా లేదని తేల్చిచెప్పారు.
జిల్లా కేంద్రమైన శ్రీకాకుళానికి డ్రైవింగ్‌ట్రాక్ అత్యవసరమని రవాణాశాఖ అధికారులు ఒత్తిడి చేశారు. ప్రజాప్రతినిధులు సిఫారసుతో చివరికి ఎచ్చెర్ల మండలంలో ఐదు ఎకరాల స్థలాన్ని డ్రైవింగ్‌ట్రాక్‌కు రెవెన్యూ అధికారులు కేటాయించారు. అందులో మూడు ఎకరాల స్థలం అనుకూలంగా ఉండగా, రెండు ఎకరాల స్థలం గుట్టలుగా ఉండడంతో రవాణాశాఖ అధికారులు డ్రైవింగ్ ట్రాక్ ఏర్పాటుకు తలలు పట్టుకుంటున్నారు. దీంతో ఎచ్చెర్లలో డ్రైవింగ్ ట్రాక్ పనులు ముందుకు సాగడం లేదు.
నిలిచిన స్పీడ్‌గన్ సేవలు
రవాణా శాఖలో వాహనాల వేగాన్ని గుర్తించేందుకు అవసరమైన స్పీడ్‌గన్‌లు ఆయా ఇంధనశకట తనిఖీ అధికారుల కార్యాలయాలకు అవసరముంది. జిల్లాకు ఒకే ఒక్క స్పీడ్‌గన్‌కు పరిమితమైంది. ఈ ఒక్క స్పీడ్‌గన్ ద్వారా ఇచ్ఛాపురం నుంచి రణస్థలం వరకు సేవలు అందించడం కష్టతరంగా మారుతోంది. ఆయా ఎంవీఐ కార్యాలయాల పరిధిలో ఒక్కోసారి ఒక్కో ప్రాంతానికి స్పీడ్‌గన్‌లు పంపిస్తున్నారు. సాంకేతిక మరమ్మతుల నేపథ్యంలో ప్రస్తుతం ఈ స్పీడ్‌గన్ సేవలు నిలిచిపోయాయి.
ఎంవీఐల కొరత :
ఉమ్మడి జిల్లాలో 22 మంది వరకు ఎంవీఐలు అవసరం కాగా.. ప్రస్తుతం ఏడుగురే ఉన్నారు. వారితోనే రవాణాశాఖ కాలం నెట్టుకొస్తుంది. అపరాధ రుసుం లక్ష్యాలు వసూలు చేయడంలో ఎంవీఐలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో తరచూ ఎంవీఐలు ఆయా రకాల వాహన తనిఖీలు చేసేవారు. నేడు ఎంవీఐల కొరతతో ఆ పరిస్థితి కనిపించడం లేదు.
ప్రతిపాదించాం :
జిల్లాలో ఎంవీఐ కార్యాలయాలకు అవసరమయ్యే డ్రైవింగ్ ట్రాక్‌ల కోసం ప్రతిపాదనలు చేశాం. ప్రస్తుతం ఎచ్చెర్ల వద్ద ట్రాక్ నిర్మాణానికి రెవెన్యూ అధికారులు స్థలం కేటాయించారు. ఇక్కడ రెండు ఎకరాల స్థలం గుట్టలుగా ఉండడంతో చదును చేయాల్సి ఉంది. జిల్లాలో ఒకే ఒక్క స్పీడ్‌గన్ సౌకర్యం ఉన్నా.. సాంకేతిక సమస్య కారణంగా ఆ సేవలు నిలిచాయి. వారం, పది రోజుల్లో స్పీడ్‌గన్ సేవలు పునరుద్ధరిస్తాం. ఖాళీగా ఉన్న ఎంవీఐ పోస్టుల భర్తీ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
- విజయసారధి, డీటీసీ