Share News

సీదిరి ఓటమికి కారణలెన్నో!

ABN , Publish Date - Jun 05 , 2024 | 11:49 PM

మంత్రి సీదిరి అప్పలరాజు ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన ప్రధాన అనుచరులు నియోజకవర్గంలోని పంచభూతాలను మింగేస్తుంటే చోద్యం చూడడంతో పాటు వారిని మంత్రి ప్రోత్సహించారు.

సీదిరి ఓటమికి కారణలెన్నో!

- భూకబ్జాలకు పాల్పడిన అనుచరులు

- దూరమైన ప్రధాన కేడర్‌

- మంత్రి పట్టించుకోకపోవడంతో ఓటుతో బుద్ధిచెప్పిన ప్రజలు

పలాస: మంత్రి సీదిరి అప్పలరాజు ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన ప్రధాన అనుచరులు నియోజకవర్గంలోని పంచభూతాలను మింగేస్తుంటే చోద్యం చూడడంతో పాటు వారిని మంత్రి ప్రోత్సహించారు. దీనిపై పత్రికలు, ప్రతిపక్షాలు ఘోషించినా ‘మావాళ్లు ఏ తప్పు చేయలేదు. నిరూపిస్తే ఎంతటి త్యాగానికైనా సిద్ధమని’ ఏకంగా భూకబ్జాలపై గ్రీవెన్స్‌ నిర్వహించి ఆ నెపాన్ని టీడీపీ నాయకులపై తోసేశారు. ఈ వ్యవహారం నియోజకవర్గంలో అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పలాసలో నెమలికొండ, సూదికొండ, పురుషోత్తపురం చెరువు కాలువ, నెమలినారాయణపురం వద్ద విలువైన ప్రభుత్వ భూములు, జగన్న లేఅవుట్‌లో విలువైన భూములు, కోసంగిపురం జగనన్న లేఅవుట్‌ వద్ద స్థలాలు, మందస మండలంలో కొండలు, గిరిజన భూములు, వజ్రపుకొత్తూరు మండలంలో బెండి కొండ, అనంతగిరిలో కొండలు మొత్తం దోచి సొమ్ము చేసుకున్నారు. ఈ వ్యవహారం ప్రజల్లోకి వెళ్లింది. దీంతో ఈ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పారు. అలాగే గత ఎన్నికల్లో అప్పలరాజు విజయం కోసం నియోజకవర్గంలో అనేక మంది నాయకులు పని చేశారు. వారిలో దువ్వాడ శ్రీకాంత్‌, దువ్వాడ హేమబాబుచౌదరి, తలగాన నర్సింహులు, కొర్ల కన్నారావు, తదితరులు ఉన్నారు. గెలిచిన తరువాత వీరందరినీ మంత్రి పట్టించుకోవడం మానేశారు. దీంతో పార్టీని వీడి టీడీపీకి మద్దతు తెలిపారు. పలాస-కాశీబుగ్గ మున్సిపల్‌ చైర్మన్‌ కోట్ని దుర్గాప్రసాద్‌ వంటి వారు కూడా మంత్రి ఇలాకా నుంచి బయటకు రావాల్సిన పరిస్థితిని కల్పించారు. అప్పట్లో మంత్రికి అనుకూలంగా పనిచేసిన వరిశ హరిప్రసాద్‌, మున్సిపల్‌ చైర్మన్‌ బళ్ల గిరిబాబు, సీనియర్‌ నాయకులు మడ్డు రాంప్రసాద్‌, మాజీ జడ్‌పీటీసీ సభ్యుడు దున్న వీరాస్వామి వంటి వారు కూడా మొహం చాటేశారు. దీనికితోడు మంత్రి అనుచరులుగా చెప్పుకునే ఓ నలుగురు నాయకులు కాంట్రాక్టుల నుంచి కబ్జాల వరకూ, ఉద్యోగాలు వేయడం నుంచి మంత్రి ఫేషీలో చక్రం తిప్పే వరకూ.. చివరకు ఎన్నికల నిర్వహణ కూడా ఆ నిర్వహించడంతో మొత్తం వ్యవహారం బెడిసికొట్టింది. క్యాడరంతా మంత్రికి దూరం కావడం, ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఇవన్నీ ఆయన ఓటమికి కారణమయ్యాయి.

Updated Date - Jun 05 , 2024 | 11:49 PM