Share News

విత్తన పాట్లు

ABN , Publish Date - May 23 , 2024 | 12:33 AM

ఏటా ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు వరి విత్తనపాట్లు తప్పడం లేదు. వ్యవసాయశాఖ రైతుభరోసా కేంద్రాల ద్వారా విత్తనాల పంపిణీ చేపడుతున్నా.. తమ సాగుకు అనుకూలమైనవి ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

విత్తన పాట్లు

- నోటిఫైడ్‌ రకాల పంపిణీకి సిద్ధం

- కిలోకు పది రూపాయలు సబ్సిడీ

- రీచెర్చ్‌ వెరైటీలపై రైతుల ఆసక్తి

(టెక్కలి)

ఏటా ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు వరి విత్తనపాట్లు తప్పడం లేదు. వ్యవసాయశాఖ రైతుభరోసా కేంద్రాల ద్వారా విత్తనాల పంపిణీ చేపడుతున్నా.. తమ సాగుకు అనుకూలమైనవి ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయశాఖ నోటిఫైడ్‌ రకాలకు చెందిన పలు రకాల విత్తనాలను మాత్రమే కిలోకు రూ.పది సబ్సిడీతో అందిస్తుంది. రైతులు కనక్‌ప్లస్‌, నూజివీడు సంపద, తరంగిణి, సుభద్ర, అమూల్య, రాణి, ధరణి తదితర రీచెర్చ్‌ రకాల విత్తనాల వైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో 4.37లక్షల ఎకరాల్లో వరిసాగు చేయనున్నట్టు అధికారుల అంచనా. ఈ మేరకు జిల్లాకు 1.21లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం. రైతులు 40వేల క్వింటాళ్ల వరకూ సొంతంగా విత్తనాలు తయారు చేసుకుంటారు. జిల్లాకు చెందిన ప్రైవేట్‌ డీలర్లు 40వేల క్వింటాళ్లకు పైగా కొనుగోలుచేసి రీచెర్చ్‌ వెరైటీ విత్తనాలు విక్రయిస్తున్నారు. ఇక వ్యవసాయశాఖ ద్వారా సుమారు 40వేల క్వింటాళ్లు వరి విత్తనాలు అవసరం. కాగా.. గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో విక్రయాల దృష్ట్యా ఈసారి 36వేల క్వింటాళ్ల విత్తనాలను వ్యవసాయశాఖ రైతుభరోసా కేంద్రాల ద్వారా పంపిణీకి సిద్ధం చేస్తోంది.

- ఏపీ సీడ్స్‌ ఆధ్వర్యంలో వ్యవసాయశాఖ ఈ ఏడాది ఎంటీయూ 7029(స్వర్ణ) రకం మూడువేల క్వింటాళ్లు, ఎంటీయూ1061 ఏడువేల క్వింటాళ్లు, ఎంటీయూ1064 రకం 2,500 క్వింటాళ్లు, బీపీటీ 5204 (సాంబమసూరి) ఐదువేల క్వింటాళ్ల విత్తనాలు కిలో రూ.10 సబ్సిడీపై అందజేయనుంది. అలాగే ఎంటీయూ1121(శ్రీధుతి) ఆరువేల క్వింటాళ్లు, బీపీటీ 3290 (సోనామసూరి) 600 క్వింటాళ్లు, ఆర్‌జేఎల్‌ 2537 (శ్రీకాకుళం సన్నాలు) రెండువేల క్వింటాళ్ల, ఎంటీయూ 1224 (మార్టేరుసాంబ) 1,500 క్వింటాళ్లు, ఎంటీయూ 1318 రకం 700 క్వింటాళ్లు వరకు తదితర నోటిఫైడ్‌ రకాల విత్తనాలను కూడా సబ్సిడీపై పంపిణీ చేయనుంది.

- ప్రైవేట్‌ డీలర్లు మాత్రం తెలంగాణలోని జగిత్యాల హుజరాబాద్‌, వరంగల్‌, సిద్ధిపేట, ఖరీంనగర్‌ ప్రాంతాల నుంచి ఓపీ రకం వెరైటీ విత్తనాలు తెచ్చారు. విజయవాడ సమీపాన విజయరాయి ప్రాంతం నుంచి నూజివీడు సంపద, కనక్‌ప్లస్‌, పూర్ణిమ, సుభద్ర విత్తనాలను అందుబాటులో ఉంచారు. విశాఖ సమీపాన వడ్డాది నుంచి తరంగిణి, ధరణి, అమూల్య రకాలతోపాటు తెలంగాణ ప్రాంతం నుంచి అమూల్యగోల్డ్‌, రాణి వంటి రకాల విత్తనాలు తెచ్చి రైతులకు విక్రయించేందుకు సిద్ధం చేశారు. గత ఏడాది వర్షాభావ పరిస్థితులు అనుకూలించకపోవడంతో సుమారు పదివేల హెక్టార్లు వరకు వరినాట్లు జరగని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది వర్షాలు అడపాదడపా కురుస్తుండడంతో రైతులు దుక్కిలు దున్ని.. ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధమవుతున్నారు. కానీ, విత్తనాలు ఎంతమేరకు సమకూరుతాయనేవి ప్రశ్నార్థకమవుతోంది.

36 వేల క్వింటాళ్లు సిద్ధం..

జిల్లాలో రైతులకు అవసరమయ్యే 36వేల క్వింటాళ్ల వరి విత్తనాలను ఇప్పటికే సిద్ధం చేశాం. రైతుభరోసా కేంద్రాల ద్వారా వీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటాం.

-శ్రీధర్‌, వ్యవసాయశాఖ జేడీ

Updated Date - May 23 , 2024 | 12:33 AM