Share News

బడి గంట మోగింది

ABN , Publish Date - Jun 12 , 2024 | 11:37 PM

బడి గంట మోగింది. 50 రోజుల అనంతరం గురువారం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠ శాలలు తెరచుకోనున్నాయి.

 బడి గంట మోగింది
నరసన్నపేట మండల కేంద్రానికి చేరిన పాఠ్యపుస్తకాలు

- నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

- పంపిణీకి సిద్ధం చేసిన స్టూడెంట్‌ కిట్లు

నరసన్నపేట, జూన్‌ 12: బడి గంట మోగింది. 50 రోజుల అనంతరం గురువారం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠ శాలలు తెరచుకోనున్నాయి. జిల్లాలో ఉన్నత, ప్రాథమికోన్నత, సెకంటరీ పాఠశాలలు 3,035 ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ పాఠశాలలు 2,655 కాగా, ప్రైవేటు పాఠశాలలు 397 ఉన్నాయి. వీటిలో సుమారు 2,83,786 మంది విద్యార్థులు ఈ ఏడాది చదువుకోనున్నారు. వీరంతా పాఠశాలలకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల తరగతి గదులను శుభ్రం చేశారు. జిల్లాలోని 1,73,743 మంది ప్రభుత్వ విద్యార్థులకు గురువారం నుంచి స్టూడెంట్‌ కిట్లను పంపిణీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మండల స్టాక్‌ కేంద్రాల నుంచి పాఠశాలలకు కిట్లను చేరవేశారు. మధ్యాహ్న భోజన పథకం కూడా పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. విద్యార్థులకు 14,56,326 పాఠ్యపుస్తకాలు అవసరమని ఇండింట్‌ పెట్టారు. ఇప్పటికే 52 శాతం అంటే 7,51,415 పాఠ్య పుస్తకాలు జిల్లాకు చేరాయి. మిగతా పుస్తకాలు కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఏడో తరగతి సంబంధించి రెండు సబ్జెక్టుల పుస్తకాలు రాగా, 8,9,10 తరగతులకు అన్ని పాఠ్యపుస్తకాలు వచ్చాయి. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విద్యాశాఖ అధికారులు జగనన్న విద్యా కిట్ల పేరును తొలగించారు. వాటిని స్టూడెంట్‌ కిట్లగా మార్పుచేశారు. ఈ కిట్లలో బ్యాగ్‌, బూట్లు, నోట్‌ పుస్తకాలు, డిక్షనరీలు, బెల్టులు ఉన్నాయి. ప్రస్తుతానికి జిల్లాకు 1,73,723 బ్యాగులు, 11,01,578 నోట్‌పుస్తకాలు పూర్తిస్థాయిలో చేరాయి. ఇంకా యూనిఫాం, బెల్టులు, బూట్లు, డిక్షనరీలు రావల్సి ఉంది. గత వైసీపీ ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యంతో ఈ ఏడాది పాఠశాలల ప్రారంభం నాటికి విద్యార్థులకు బూట్లు, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అరకొరగా చేరాయి. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు, ఇతర ఉపకరణాలను పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

వారంలోగా పంపిణీ చేస్తాం

పాఠ్య పుస్తకాలను పాఠశాలలు ప్రారంభమైన వారం రోజుల్లోనే విద్యార్థులకు పంపిణీ చేస్తాం. ఇప్పటికే వచ్చిన పాఠ్య పుస్తకాలను గురువారం నుంచి పంపిణీ చేయాలని ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశాం. ఎండీఎం సక్రమంగా నిర్వహించాలని సూచించాం. యూనిఫాం, బూట్లు వచ్చిన వెంటనే మండల కేంద్రాలకు పంపిణీ చేస్తాం.

-కె.వెంకటేశ్వరరావు, డీఈవో, శ్రీకాకుళం

Updated Date - Jun 12 , 2024 | 11:37 PM