Share News

గూనపాలెం హత్యకేసులో దొరకని నిందితుడు

ABN , Publish Date - May 29 , 2024 | 11:40 PM

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన మహిళ కేసులో ప్రధాన నిందితుడు ఇంకా దొరకలేదు. నగర పాలక సంస్థలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న సీర సురేష్‌బాబు (33)ను భార్య తిరుమల తన ప్రియుడు రియాజుద్ధీన్‌ ఖాన్‌, అతడి స్నేహితుడు నూరుద్దీన్‌ ఖాన్‌తో కలిసి ఈ నెల 16వ తేదీ అర్ధరాత్రి హత్య చేయించిన విషయం విదితమే.

గూనపాలెం హత్యకేసులో దొరకని నిందితుడు

- ప్రియుడితో భర్తను హత్య చేయించిన భార్య తిరుమల జైలు పాలు

- అనాథలైన పిల్లలు

శ్రీకాకుళం క్రైం: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన మహిళ కేసులో ప్రధాన నిందితుడు ఇంకా దొరకలేదు. నగర పాలక సంస్థలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న సీర సురేష్‌బాబు (33)ను భార్య తిరుమల తన ప్రియుడు రియాజుద్ధీన్‌ ఖాన్‌, అతడి స్నేహితుడు నూరుద్దీన్‌ ఖాన్‌తో కలిసి ఈ నెల 16వ తేదీ అర్ధరాత్రి హత్య చేయించిన విషయం విదితమే. ఈ కేసులో తొలుత అనుమానించిన హతుడి భార్య తిరుమలను పోలీసులు అరెస్టు చేసి ఈ నెల 21న రిమాండ్‌కు పంపించారు. అయితే ప్రధాన నిందితులు రియాజుద్దీన్‌ఖాన్‌, అతడి స్నేహితుడు నూరుద్దీన్‌ఖాన్‌ పరారు కావడంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వారి సొంతూరైన కటక్‌లో వెతుకులాట సాగించారు. వీరిలో నూరుద్దీన్‌ఖాన్‌ చిక్కాడు. అయితే హత్య జరిగి 14 రోజులు గడిచినా ప్రధాన నిందితుడు రియాజుద్దీన్‌ఖాన్‌ను మాత్రం పోలీసులు పట్టుకోలేకపోయారు. పోలీసుల అదుపులో ఉన్న నూరుద్దీన్‌ఖాన్‌ను శ్రీకాకుళం డీఎస్పీ వై.శృతి బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

అనాథలైన చిన్నారులు

హత్య కాబడిన సూరేష్‌బాబుకు భార్య తిరుమలతో పాటు రోహిత్‌, ఇంద్రజ అనే ఇద్దరు పిల్లలు, తండ్రి రామయ్య ఉన్నారు. సురేష్‌బాబు నగరపాలక సంస్థలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తుండగా, భార్య తిరుమల ఓ హోటల్‌లో పని చేస్తుండేది. తండ్రి రామయ్య వయసు రీత్యా వృద్ధుడు కావడంతో ఇంట్లోనే ఉంటాడు. అయితే సురేష్‌బాబు హత్య జరగడంతో భార్య తిరుమల జైలు పాలైంది. దీంతో సురేష్‌బాబు తండ్రి, పిల్లలు అనాథలుగా మిగిలారు. రామయ్య వృద్ధుడు కావటంతో పింఛన్‌ ఒక్కటే ఆధారం. కొడుకు మరణించిన నాటి నుంచి ఎవరు వారిని చేరదీయకపోవడంతో ఇబ్బందిపడుతున్నారు. రామయ్య తన బాధను ఎవరికీ చెప్పుకోలేక ఆ చిన్నారులను తన పింఛన్‌ డబ్బులతో పోషిస్తున్నారు. తన కొడుకును హత్య చేసిన వారిని శిక్షించి న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నారు.

Updated Date - May 29 , 2024 | 11:40 PM