Share News

వంతెనను ఢీకొన్న లారీ

ABN , Publish Date - Mar 14 , 2024 | 12:09 AM

ఒడిశా రాష్ట్రం మయూర్‌భంజ్‌ జిల్లా బైరపదా పట్టణం సమీపంలో వంతెనను ఢీకొని ఓ లారీ సువర్ణరేఖ కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో నరసన్నపేట మండలం జమ్ము, కిళ్లాం గ్రామాలకు చెందిన లారీడ్రైవర్‌, క్లీనర్‌ మృతిచెందారు.

వంతెనను ఢీకొన్న లారీ
కాలువలో పడిన లారీ.. ఇన్‌సెట్‌లో ఆదినారాయణ, చిన్నారావు(ఫైల్‌)

- కాలువలో పడి డ్రైవర్‌, క్లీనర్‌ మృతి

- ఒడిశాలో ప్రమాదం

- జమ్ము, కిళ్లాంలో విషాదఛాయలు

నరసన్నపేట, మార్చి 13: ఒడిశా రాష్ట్రం మయూర్‌భంజ్‌ జిల్లా బైరపదా పట్టణం సమీపంలో వంతెనను ఢీకొని ఓ లారీ సువర్ణరేఖ కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో నరసన్నపేట మండలం జమ్ము, కిళ్లాం గ్రామాలకు చెందిన లారీడ్రైవర్‌, క్లీనర్‌ మృతిచెందారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జమ్ము గ్రామానికి చెందిన రావాడ జనార్దనరావు లారీ.. ఈ నెల 11న ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలో నీలగిరి కర్ర దిమ్మల లోడుతో నేపాల్‌ పయనమైంది. మంగళవారం అర్ధరాత్రి ఒడిశా- జార్ఖండ్‌ సరిహద్దున బైరపదా పట్టణానికి సమీపంలో వంతెనను ఢీ కొని అక్కడ సువర్ణరేఖ కాలువలో లారీ పడిపోయింది. ఈ ప్రమాదంలో కిళ్లాం గ్రామానికి చెందిన లారీడ్రైవర్‌ గొలివి ఆదినారాయణ (44), జమ్ము గ్రామానికిచెందిన కొయ్యాన చిన్నారావు(38) అక్కడక్కడే మృతిచెందారు. లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన వారి మృతదేహాలను ఒడిశా పోలీసులు యంత్రాల సహాయంతో బయటకు తీశారు. డ్రైవర్‌ ఆదినారాయణకు భార్య రేవతి, తల్లిదండ్రులు తవిటిమ్మ, చిన్నవాడుతో పాటు ఇంటర్‌, ఎనిమిదో తరగతి చదువుతున్న కుమార్తె, కుమారుడు ఉన్నారు. క్లీనర్‌ చిన్నారావుకు భార్య శశికళ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇరు కుటుంబాల సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. జమ్ము, కిళ్లాం గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను స్వగ్రామాలకు తీసుకువచ్చేందుకు ఆయా కుటుంబ సభ్యులు ఒడిశా వెళ్లారు.

Updated Date - Mar 14 , 2024 | 12:09 AM