Share News

విద్యార్థుల ప్రాణాలు.. గాలిలో దీపాలు

ABN , Publish Date - Feb 25 , 2024 | 12:36 AM

ఆశ్రమ వసతిగృహాల్లో విద్యార్థులు మృత్యువాత పడుతుండడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో విద్యార్థులకు అనారోగ్య సమస్యలు తప్పడం లేదు. వైద్య, గిరిజన సంక్షేమ శాఖల మధ్య సమన్వయలోపంతో విద్యార్థులకు వైద్య పరీక్షలు సక్రమంగా నిర్వహించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

విద్యార్థుల ప్రాణాలు.. గాలిలో దీపాలు
భరణికోట ఆశ్రమ పాఠశాల

- ఆశ్రమ వసతిగృహాల్లో పర్యవేక్షణ కరువు

- సక్రమంగా అందని వైద్యసేవలు

- ఆందోళనలో తల్లిదండ్రులు

(మెళియాపుట్టి)

- ఈ నెల 21న భరణికోట గిరిజన బాలికల వసతిగృహంలో ఆరో తరగతి విద్యార్థిని ఎస్‌.నందిని అనారోగ్యానికి గురై మృతి చెందింది. ఈ నెల 10న పాఠశాల నుంచి అనారోగ్యంతో ఇంటికి వెళ్లిన ఆ విద్యార్థిని తిరిగి పాఠశాలకు వెళ్లలేదు. కానీ ఆన్‌లైన్‌లో వసతిగృహంలో ఉంటున్నట్టు హాజరు వేసినట్టు తెలుస్తోంది. వసతిగృహ సిబ్బంది విద్యార్థిని ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోకపోవడంతో ఆమె మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణ చేసి నివేదిక అందజేయాలని ఐటీడీఏ పీవో కల్పనకుమారి ఆదేశించారు.

............................

- గతేడాది సెప్టెంబరు 30న మెళియాపుట్టి కేజీబీవీలో చదువుతున్న దోర వర్షిణి మృతి చెందింది. పాతపట్నం మండలం లాడర గ్రామానికి చెందిన వర్షిణికి చక్కెరస్థాయి పెరగడంతో శ్రీకాకుళంలోని జీజీహెచ్‌(రిమ్స్‌)లో చేర్చగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

............................

- గతేడాది ఏప్రిల్‌ 17న పెద్దమడి గురుకుల పాఠశాలలో పలాస మండలం సవరగోవింద్‌పురానికి చెందిన 8వ తరగతి విద్యార్థి సవర సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.

.................................

- గతేడాది మార్చి 21న పెద్దమడి గిరిజన బాలికల పాఠశాలకు చెందిన ఒక విద్యార్థి అదికంగా మాత్రలు మింగి ప్రాణాపాయస్థితికి చేరుకుంది. ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రాణాలతో బయటపడింది.

.............................

ఆశ్రమ వసతిగృహాల్లో విద్యార్థులు మృత్యువాత పడుతుండడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో విద్యార్థులకు అనారోగ్య సమస్యలు తప్పడం లేదు. వైద్య, గిరిజన సంక్షేమ శాఖల మధ్య సమన్వయలోపంతో విద్యార్థులకు వైద్య పరీక్షలు సక్రమంగా నిర్వహించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 29ఆశ్రమ పాఠశాలల్లో 4,278 మంది విద్యార్థులు చదువుతున్నారు. వసతిగృహాలను అధికారులు పర్యవేక్షించడం లేదనే విమర్శలు ఉన్నాయి. వైద్యసేవలతో పాటు మెనూ కూడా సక్రమంగా అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పర్యవేక్షణ లేకపోవడంతో వార్డెన్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో మండలస్థాయిలో తహసీల్దార్‌, ఎంపీడీవో, ఎంఈవోలు ప్రతినెలా వసతిగృహాలు తనిఖీ చేసి నివేదిక అందజేయాలని ఐటీడీఏ అధికారులు ఆదేశించేవారు. గత ఆరు నెలలుగా అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. గత తహసీల్దార్‌ పి.సరోజిని వసతిగృహాల్లో పరిస్థితులు బాగోలేవని నివేదిక ఇచ్చినా.. చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

పట్టించుకోని ప్రభుత్వం

టీడీపీ ప్రభుత్వ హయాంలో సర్వశిక్షా అభియాన్‌ నిధులతో ప్రతి విద్యార్థికి సంబంధించి ఆరోగ్యస్థితిగతులను వైద్యులు రికార్డుల్లో నమోదు చేసేవారు. రుగ్మతలు ఉంటే వాటి నివారణకు చర్యలు చేపట్టేవారు. గిరిబాల రక్ష కార్యక్రమంలో భాగంగా వైద్యసేవలు అందజేసేవారు. వసతిగృహాల్లో విద్యార్థుల సంఖ్య బట్టి.. ఆరోగ్య కార్యకర్తలను నియమించేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సేవలేవీ కొనసాగడం లేదు. ఫ్యామిలీ వైద్యం పేరుతో అధికంగా నిధులు ఖర్చు చేస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదు. గతేడాది ఆరోగ్య సురక్ష శిబిరాలకు శ్రీకారం చుట్టినా.. విద్యార్థులకు సక్రమంగా వైద్యసేవలు అందడం లేదు. ప్రతినెలా విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తే.. అంతర్గత వ్యాధులు ఉంటే బయటపడే అవకాశం ఉంది. సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత వసతిగృహ విద్యార్థులను పరీక్షించే బాధ్యతలను సీహెచ్‌వోలే చూస్తున్నారు. పాఠశాల సిబ్బంది సైతం అంతా బాగుందనే చెబుతుండడంతో వైద్యాధికారులు తనిఖీలు చేయడం లేదు. ఏఎన్‌ఎంలకు అధికంగా ఆన్‌లైన్‌ పనులు, సర్వేలకు కేటాయించడంతో.. వారు కూడా వసతిగృహాలకు వెళ్లి పర్యవేక్షించడం లేదు. అలాగే నిధుల కొరత కారణంగా చాలా వసతిగృహాల్లో కిటికీలకు కనీసం దోమతెరలు కూడా ఏర్పాటు చేయడం లేదు. ఈ క్రమంలో చాలామంది విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థుల సంక్షేమంపై దృష్టి సారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటాం

వసతిగృహల్లో విద్యార్థులు మృతి సంఘటనలపై విచారణ జరుగుతోంది. పీవోకు నివేదిక అందజేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తాం.

- రుగ్మతరావు, డీడీ గిరిజన సంక్షేమ శాఖ, సీతంపేట

Updated Date - Feb 25 , 2024 | 12:36 AM