కూటమి గెలుపు ఖాయం!
ABN , Publish Date - Jun 02 , 2024 | 11:47 PM
ఎన్నికల ఫలితాల వెల్లడికి ఒక్కరోజే సమయం ఉంది. మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి.. ఫలితాలు వెల్లడించనున్నారు. ఇప్పటికే ఎగ్జిట్‌పోల్స్ విడుదలయ్యాయి. మెజార్టీ సర్వే సంస్థలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌పోల్స్ ద్వారా వెల్లడించాయి.
- 2019 ఎన్నికల్లో వైసీపీకి 67,489 ఓట్లు మాత్రమే అధికం
- ఐదేళ్లలో ప్రభుత్వ పాలనపై తీవ్ర వ్యతిరేకత
- జనసేన, బీజేపీ మద్దతుతో టీడీపీకి మరింత పెరిగిన ఆదరణ
- మెజార్టీ సంస్థల ఎగ్జిట్‌పోల్స్ ద్వారా సుస్పష్టం
(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)
ఎన్నికల ఫలితాల వెల్లడికి ఒక్కరోజే సమయం ఉంది. మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి.. ఫలితాలు వెల్లడించనున్నారు. ఇప్పటికే ఎగ్జిట్‌పోల్స్ విడుదలయ్యాయి. మెజార్టీ సర్వే సంస్థలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌పోల్స్ ద్వారా వెల్లడించాయి. మరోవైపు 2019 ఎన్నికల్లో వైసీపీకి పోలైన ఓట్లతో పోల్చినా.. ఈసారి కూటమి గెలుపు ఖాయమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ‘ఒక్కచాన్స్’ ఇచ్చేలా ప్రజలు వైసీపీపై సానుభూతి చూపగా.. ప్రస్తుతం సీన్ మారింది. ఐదేళ్లలో వైసీపీ పాలనపై అన్నివర్గాల ప్రజలు విసిగిపోయారు. ప్రస్తుతం టీడీపీకి జనసేన, బీజేపీ కూడా మద్దతు తెలిపి కూటమిగా బరిలోకి దిగడంతో వైసీపీ ఓటమి ఖాయమని తెగేసి చెబుతున్నారు.
- 2019లో పోలైన ఓట్లు పరిశీలిస్తే...
2014లో వైసీపీ ఓటమి తర్వాత జగన్ పాదయాత్ర చేశారు. 2019 ఎన్నికల ముందు బాబాయి హత్యను అప్పట్లో టీడీపీకి ఆపాదించడం... ఎయిర్‌పోర్టులో కోడికత్తి ఘటన వంటివి జగన్‌కు ప్రజల్లో సింపతీ పెరిగాయి. ఒక్కచాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని జగన్ అభ్యర్థించడంతో.. ప్రజలు నమ్మి వైసీపీని గెలిపించారు.
- జిల్లాలో శ్రీకాకుళం పార్లమెంట్‌తోపాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్‌కు వైసీపీకి 5,27,891 ఓట్లు పోలయ్యాయి. ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీకి 6,53,954 ఓట్లు పడ్డాయి. మొత్తంగా వైసీపీకి 11,81,845 ఓట్లు పోల్ అయ్యాయి.
- గత ఎన్నికల్లో పొత్తు లేకుండా టీడీపీ, జనసేన, బీజేపీ వేర్వేరుగా ఒంటరిగానే పోటీ చేశాయి. టీడీపీకి సంబంధించి శ్రీకాకుళం లోక్‌సభకు ఓట్లు 5,34,544 ఓట్లు పోలయ్యాయి. ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5,79,812 ఓట్లు లభించాయి. మొత్తంగా 11,14,356 ఓట్లు పడ్డాయి. వైసీపీకి పోలైన ఓట్లుతో పోల్చితే కేవలం 67,489 ఓట్లు టీడీపీకి తగ్గాయి.
- జనసేనకు ఎనిమిది నియోజకవర్గాల్లో 43,937 ఓట్లు, పార్లమెంట్ స్థానానికి 31,956 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 75,893 ఓట్లు లభించాయి.
- బీజేపీకి పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో 18,368 ఓట్లు పోలయ్యాయి. జనసేన, బీజేపీకి పోలైన ఓట్లు 94,261. ఇందులో వైసీపీకి వచ్చిన ఆధిక్యం 67,489 ఓట్లు పోను.. 26772 ఓట్లు టీడీపీ, జనసేన, బీజేపీకి వర్తిస్తాయి.
- ఈసారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోటీచేశాయి. ఓట్లు చీలే అవకాశం లేదు. అలాగే 2019లో జగన్‌పై ఉన్న అభిమానం కూడా ఇప్పుడు ప్రజలకు లేదు. అన్ని వర్గాల ప్రజల్లో జగన్‌పై వ్యతిరేకత పెరిగింది. అర్బన్ ప్రాంతాల్లో వైసీపీకి 20శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయని.. సర్వేలు చెబుతున్నాయి. పట్టణాలు, నగరంలో 80శాతం ప్రజలు కూటమికే జై అన్న సంకేతాలు వెలువడ్డాయి. చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్‌తోపాటు.. ఇటు జనసేనాని పవన్‌కల్యాణ్‌పై ఆదరణ కూడా ప్రజల్లో పెరిగింది. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందన్న సంకేతాలు ఉన్నాయి. దీంతో ఈసారి ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మెజార్టీ సంస్థలు ఎగ్జిట్‌పోల్స్ ద్వారా ఇదే విషయాన్ని స్పష్టం చేయడంతో కూటమి నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- ఎగ్జిట్ పోల్స్‌పై టీడీపీలో జోష్..
దేశవ్యాప్తంగా అన్ని మీడియా సంస్థలు.. నేషనల్ సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్‌పోల్స్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికే పగ్గాలని స్పష్టమైంది. విశ్వసనీయత కలిగిన ఇండియాటుడే సంస్థ కూడా ఎగ్జిట్‌పోల్స్‌లో టీడీపీ కూటమికే ప్రజలు తీర్పు లభిస్తుందని స్పష్టం చేసింది. ఇక శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్‌నాయుడు మెజార్టీ విషయమై 1,60,000 ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తల్లో జోష్ నెలకొంది. ఇక వైసీపీ నాయకులు.. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రముఖులైన వైసీపీ మంత్రులు, స్పీకర్.. వంటివారు ఓటమి పాలవుతున్నారంటూ మెజార్టీ సర్వే సంస్థలు వెల్లడించాయి. అయినప్పటికీ.. తాము అధికారంలోకి వచ్చితీరుతామంటూ కొంతమంది వైసీపీ నేతలు ఆశతో ఉన్నారు.