Share News

కల్వర్టులు పాడై.. గోడలు కూలిపోయి

ABN , Publish Date - May 30 , 2024 | 11:27 PM

అలికాం-బత్తిలి రహదారిలో ప్రయాణమంటే వాహన చోదకులు హడలెల్తి పోతున్నారు. ప్రధానంగా ఈ మార్గంలో రక్షణ గోడలు కూలిపోవడంతోపాటు కల్వర్టులు శిథిలావస్థకు చేరాయి.

కల్వర్టులు పాడై.. గోడలు కూలిపోయి
బొప్పడాం వద్ద కూలిన కల్వర్టు రక్షణ గోడ

- ప్రమాదం అంచున ప్రయాణం

- ఇదీ అలికాం-బత్తిలి రహదారిలో పరిస్థితి

సరుబుజ్జిలి: అలికాం-బత్తిలి రహదారిలో ప్రయాణమంటే వాహన చోదకులు హడలెల్తి పోతున్నారు. ప్రధానంగా ఈ మార్గంలో రక్షణ గోడలు కూలిపోవడంతోపాటు కల్వర్టులు శిథిలావస్థకు చేరాయి. ఐదేళ్లుగా ఈ రహదారిలో ప్రమాదం అంచున ప్రయాణం సాగించాల్సి వస్తోందని వాహనచోదకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

ఆమదాలవలస నుంచి సరుబుజ్జిలి, ఎల్‌ఎన్‌పేట, హిరమండలం, కొత్తూరు, బత్తిలి, పాతపట్నంతోపాటు ఒడిశాలోని పలు ప్రాంతాలకు ప్రతిరోజూ వందల సంఖ్యలో వాహనాలు ఈ రహదారిలో రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే ఈ ప్రధానరహదారిలో ఉన్న కల్వర్టులు శిథిలావస్థకు చేరుకున్నాయి.షలంత్రి సమీపంలో ఉన్న ఓ కల్వర్టు రక్షణ గోడో కూలి ఐదేళ్లు కావస్తున్నా రోడ్లు భవనాలశాఖ అధికారులు హెచ్చరికబోర్డులు ఏర్పాటు చేయకపోవడంపై వాహన చోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరుబుజ్జిలి పెట్రోల్‌ బంకు వద్ద రోడ్డు మధ్యలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసి ఏడాది కావస్తున్నా రంధ్రాన్ని నేటికీ పూడ్చలేదు. షలంత్రి వద్ద తాత్కాలికంగా పైపు ఏర్పాటు చేసి ఇరువైపులా రక్షణ గోడలు నిర్మించలేదు. నక్కల పేట వద్ద ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టు రక్షణ గోడ కూలి ప్రమాదాలు జరుగుతున్నా రోడ్లు భవనాల శాఖ అధికారులు కనీస చర్యలు చేపట్టకపోవడంతో ఏపీ రోడ్డుపై నిత్యం రాకపోకలు సాగించే వాహనచోదకులు భయాందోళన చెందుతున్నారు.

రోడ్డుపై రంధ్రాలు.. రాకపోకలకు బేజారు

సరుబుజ్జిలి మండలంలోని అలికాం-బత్తిలి రహదారిపై అడుగడుగునా రంధ్రాలు వాహనచోదకులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి సరుబుజ్జిలి, హిరమండలం, కొత్తూరు, బత్తిలి, పాతపట్నం ప్రాంతాలకు నిత్యం వేలసంఖ్యలో బస్సులు లారీలు, ఇతర వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ రహదారిలో ఇప్పటికే పలు చోట్ల భారీ స్థాయిలో గుంతలు ఏర్పడడంతో అధ్వానంగా మారింది. అయితే వాహనచోదకులు గమ్యస్థానాలు చేరుకోవడానికి అగచాట్లకు గురవుతున్నారు. ప్రధానరహదారిపై కొన్నిచోట్ల ఉన్న కల్వర్టుల ప్రాంతంలో ఏర్పడిన భారీ రంధ్రాలను కూడా రోడ్లు భవనాల శాఖ అధికారులు పర్యవేక్షించకపోవడం లేదని వాహనచోదకులు ఆరోపిస్తున్నారు. సరుబుజ్జిలి నుంచి హిరమండలం వైపు వెళ్లే రహదారిలో పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ఏర్పడిన భారీ రంధ్రాన్ని తెలియజేస్తూ ఏర్పాటు చేసిన బోర్డు ఏడాదైనా అధికారులు రంధ్రాన్ని పూడ్చలేదు. ఇప్పటికైనా రోడ్లు భవనాల శాఖ అధికారులు స్పందించి రంధ్రాలు పూడ్చే విధంగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - May 30 , 2024 | 11:27 PM