‘కోడ్’ ముగిసింది
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:09 AM
సార్వత్రిక ఎన్నికల కోడ్ గురువారం సాయంత్రం నుంచి ముగిసింది. ఇకపై ఎటువంటి ఆంక్షలు లేవు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18న గెజిట్ నోటిఫికేషన్ జారీచేశారు.

- సమష్టి కృషితోనే విజయవంతం
- కలెక్టర్ మన్‌జీర్ జిలానీ సమూన్
శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి/ కలెక్టరేట్ జూన్ 6 : సార్వత్రిక ఎన్నికల కోడ్ గురువారం సాయంత్రం నుంచి ముగిసింది. ఇకపై ఎటువంటి ఆంక్షలు లేవు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18న గెజిట్ నోటిఫికేషన్ జారీచేశారు. ఏప్రిల్ 25 వరకు నామినేషన్లను స్వీకరించారు. జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 83 మంది అభ్యర్థులు, శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికిగాను 13 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. మే 13న పోలింగ్ జరగ్గా.. ఈ నెల 4న ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఎన్డీయే కూటమి సునామీ మాదిరి వైసీపీని తుడిచిపెట్టేసింది. జిల్లాలో శ్రీకాకుళం లోక్‌సభతోపాటు ఎనిమిది అసెంబ్లీ స్థానాలనూ ఎన్డీయే కూటమి కైవసం చేసుకుంది. కాగా.. కోడ్ నేపథ్యంలో అధికారులు కఠిన ఆంక్షలు అమలు చేస్తూ.. ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా అమలు చేశారు. గురువారం సాయంత్రంతో ‘కోడ్’ ఎత్తివేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ నుంచి కలెక్టరేట్‌కు ఉత్తర్వలు అందాయి. ఈ మేరకు ఎన్నికల కోడ్ ముగిసిందని కలెక్టర్ మన్‌జీర్ జిలానీ వెల్లడించారు.
అందరికీ అభినందనలు
‘ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ముగిసే వరకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో, సమష్టిగా కృషి చేశారు’ అని కలెక్టర్ మన్‌జీర్ జిలానీ సమూన్ కొనియాడారు. విజయవంతంగా ఎన్నికల ప్రక్రియ పూర్తిచేసిన ప్రతిఒక్కరికీ అభినందనలు తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో ఆర్వోలు, నోడల్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా.. ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో కీలకపాత్ర పోషించిన జేసీ, డీఆర్వోను ప్రత్యేకంగా అభినందించారు. శాంతిభద్రతల విషయంలో ఎస్పీ రాధిక చర్యలను కొనియాడారు. జేసీ ఎం.నవీన్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు అంకితభావంతో విధులు నిర్వర్తించారని, విజయానికి అదే మూల కారణమని ప్రశంసించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు వారి వారి అనుభవాలను పంచుకున్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండి కలెక్టర్ వ్యవహరించిన తీరు, విజయంలో తమను భాగస్వాములను చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్‌కమర్, డీఆర్వో ఎం.గణపతిరావు, జడ్పీ సీఈవో వేంకటేశ్వరరావు, రిటర్నింగ్ అధికారులు సుదర్శనదొర, భరత్‌నాయక్, అప్పారావు, సీహెచ్ రంగయ్య, లక్ష్మణమూర్తి, రామ్మోహనరావు, నోడల్ అధికారులు వేంకటేశ్వరరావు, ఓబులేసు, బి.మీనాక్షి, సూర్యకిరణ్, చిట్టిరాజు, రాణీమోహన్, శాంతిశ్రీ, కె.చెన్నకేశవరావు, గణపతిరావు, కృష్ణమూర్తి, వెంకటరామన్, సుధ పాల్గొన్నారు.