Share News

కాలువపై వంతెన.. అక్రమ నిర్మాణమే

ABN , Publish Date - Aug 24 , 2024 | 11:59 PM

సంతబొమ్మాళిలో ఓ రియల్‌ఎస్టేట్‌ లే-అవుట్‌ రహదారి కోసం వంశధార కాలువపై కట్టిన వంతెన అక్రమమేనని రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. సంతబొమ్మాళి పంచాయతీ రెయ్యపేట వద్ద సాగునీటి కాలువపై అనధికార వంతెన నిర్మాణంపై ఈ నెల 6న ‘రియల్‌ దందా’ పేరిట ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురించిన కథనంపై అధికారులు స్పందించారు.

కాలువపై వంతెన.. అక్రమ నిర్మాణమే
సర్వే చేపడుతున్న రెవెన్యూ అధికారులు

- నిర్ధారించిన రెవెన్యూ అధికారులు

- ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

సంతబొమ్మాళి, ఆగస్టు 24: సంతబొమ్మాళిలో ఓ రియల్‌ఎస్టేట్‌ లే-అవుట్‌ రహదారి కోసం వంశధార కాలువపై కట్టిన వంతెన అక్రమమేనని రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. సంతబొమ్మాళి పంచాయతీ రెయ్యపేట వద్ద సాగునీటి కాలువపై అనధికార వంతెన నిర్మాణంపై ఈ నెల 6న ‘రియల్‌ దందా’ పేరిట ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురించిన కథనంపై అధికారులు స్పందించారు. ఇప్పటికే నరసన్నపే ట వంశధార జేఈలు సింహాచలం, శోభనబాబులు వంతెన నిర్మాణాన్ని పరిశీలించారు. ప్రభుత్వ భూముల్లో ఆ వంతెన నిర్మాణం ఉందో.. లేదో సర్వే చేసి నిర్ధారించాలని తహసీల్దార్‌కు వంశధార ఏఈ సింహాచలం లేఖ రాశారు. ఈ మేరకు తాజాగా శనివారం మండల రెవెన్యూ ఇన్‌స్పెక ్టర్‌ ప్రసన్న, వీఆర్వో రమేష్‌, సర్వేయర్‌ రవి, వంశధార ఏఈ సింహాచలం అక్కడకు వెళ్లి పరిశీలించారు. 191-1 సర్వే నెంబర్‌ వేసిన లే-అవుట్‌కు పక్కనే వంశధార కాలువపైనే అనధికార వంతెన నిర్మించినట్టు రెవెన్యూ అధికారులు తేల్చారు. కాగా.. అనుమతులు లేకుండా రియల్‌ దందా సాగిస్తూ.. సాగునీటి కాలువ మీద అనధికార వంతెన నిర్మించడంతో పంట పొలాలు ముంపునకు గురవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం, కోటబొమ్మాళి, పాతపట్నం, మెళియాపుట్టి మండలాలకు చెందిన వరదనీరు దేశీయగెడ్డ ద్వారా ఈ కాలువ గుండా కాకరాపల్లి తంపరకు చేరి సముద్రంలో కలుస్తుంది. అటువంటి కాలువపై అనధికార వంతెన నిర్మించడం వల్ల ముంపు ముప్పు తప్పదని రైతులు వాపోతున్నారు. చిన్నపాటి వర్షానికి ఆ కాలువ పొంగి రెయ్యపేట నుంచి సంతబొమ్మాళి పాలేశ్వర స్వామి ఆలయం వరకు డీపీఎన్‌ రోడ్డుపై నీరు చేరి రాకపోకలకు అంతరాయం కలుగుతోందని పేర్కొంటున్నారు. తక్షణమే ఈ వంతెన తొలగించాలని కోరుతున్నారు. దీనిపై వంశధార ఏఈ సింహాచలం వద్ద ప్రస్తావించగా.. అనధికార వంతెన తొలగించాలని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు నోటీసులు జారీచేస్తామన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 11:59 PM