Share News

‘ఉచిత ఇసుక’ ప్రారంభం

ABN , Publish Date - Jul 08 , 2024 | 11:48 PM

జిల్లాలో ఉచిత ఇసుక విధానం ప్రారంభమైంది. కాగా.. ఉత్తర్వులు ఆలస్యం కారణంగా తొలిరోజు కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఇసుక కష్టాలు తీవ్రతరం కావడంతో.. వాటన్నింటినీ రద్దుచేసి ఎన్డీయే కూటమి కొత్త పాలసీని ప్రవేశపెట్టింది. అయితే ప్రభుత్వ ఉత్వర్వులు విడుదల కావడం ఆలస్యం వల్ల ఇసుక పంపిణీకి నిర్మాణదారులు తొలిరోజున తీవ్రంగా నిరీక్షించారు.

‘ఉచిత ఇసుక’ ప్రారంభం
అంగూరులో ఇసుకను డంప్‌ చేస్తున్న ఎమ్మెల్యే గోవిందరావు

- తొలిరోజున ఒక ట్రాక్టర్‌తో తరలింపు

- అంగూరులో మాత్రమే అమ్మకం

- టెక్కలిలో నిరీక్షించిన నిర్మాణదారులు

- సాయంత్రం విడుదలైన ఉత్తర్వులు

శ్రీకాకుళం, జూలై 8(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉచిత ఇసుక విధానం ప్రారంభమైంది. కాగా.. ఉత్తర్వులు ఆలస్యం కారణంగా తొలిరోజు కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఇసుక కష్టాలు తీవ్రతరం కావడంతో.. వాటన్నింటినీ రద్దుచేసి ఎన్డీయే కూటమి కొత్త పాలసీని ప్రవేశపెట్టింది. అయితే ప్రభుత్వ ఉత్వర్వులు విడుదల కావడం ఆలస్యం వల్ల ఇసుక పంపిణీకి నిర్మాణదారులు తొలిరోజున తీవ్రంగా నిరీక్షించారు. జిల్లాలో టెక్కలి, అంగూరు లలో ఇసుక డిపోలు ఉన్నాయి. ఈ రెండు డిపోల్లో 62 వేల టన్నుల ఇసుక లభ్యంగా ఉంది. అయితే సోమవారం నుంచి ఇసుక అందుబాటులోకి వస్తుందని.. టన్ను ఇసుక కేవలం రూ.340 మాత్రమే అని అధికార యంత్రాంగం ప్రకటించింది. దీంతో నిర్మాణదారుల్లో సంతోషం నెలకొంది. కొంతమంది ట్రాక్టర్లను బాడుగకు తీసుకుని ఇసుక డిపోల వద్ద మకాం వేశారు. కానీ సోమవారం సాయంత్రం జీవో విడుదలైంది. అప్పటికే భారీస్థాయిలో ట్రాక్టర్లను లైన్లలో ఉంచిన నిర్మాణదారులు ఎదురుచూశారు. కానీ ఇసుక విక్రయాలను పూర్తిస్థాయిలో ప్రారంభించలేక పోయారు. కేవలం కొత్తూరు మండలం అంగూరులో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఇసుక విక్రయాన్ని లాంఛనప్రాయంగా ప్రారంభించారు. కేవలం ఒక ట్రాక్టర్‌ ఇసుకను మాత్రమే విక్రయించారు. ఇక టెక్కలి డిపో నుంచి ఇసుక విక్రయాలు చేపట్టలేక పోయారు. సమయం కుదరకపోవడం... జీఓ విడుదలైనంతవరకు వేచి ఉండాలంటూ ముందుగానే అధికారులు చెప్పడంతో.. ఇక్కడ నిర్మాణదారులు అవస్థలు పడ్డారు. ‘తొలిరోజున ఒక ట్రాక్టర్‌ ఇసుకను మాత్రమే అంగూరులో విక్రయించాం. టెక్కలిలో విక్రయాలు చేపట్టలేదు. మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో విక్రయాలు జరుగుతాయ’ని భూగర్భవనరుల శాఖ ఉపసంచాలకులు సత్యనారాయణ ‘ఆంధ్రజ్యోతి’కి వెల్లడించారు.

ఇసుక కోసం రోజంతా నిరీక్షణ

టెక్కలి: టెక్కలిలో ఇసుక కోసం ట్రాక్టర్‌ డ్రైవర్లు రోజంతా నిరీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీని రూపొందించి.. సోమవారం నుంచి నిర్దిష్ఠ ధరకు ఇసుకను విక్రయించనున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం నుంచే స్థానిక ఆర్టీసీ గ్యారేజ్‌ సమీపంలో ఇసుక నిల్వలు కేంద్రం వద్ద వందల సంఖ్యలో ట్రాక్టర్లు బారులుదీరాయి. కాగా.. సాయంత్రం వరకూ ఇసుక ప్రక్రియ విక్రయాలు ప్రారంభం కాకపోవడంతో ట్రాక్టర్ల డ్రైవర్లు అసహనానికి గురయ్యారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే ఇసుక విక్రయాలు చేపడతామని గనులు, భూగర్భశాఖ సహాయ సంచాలకులు ఫణిభూషన్‌రెడ్డి, ఆర్‌ఐ గణేష్‌, టీఏ నాగేంద్ర తెలిపారు.

ఇక కార్మికులకు ఉపాధే: ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

కొత్తూరు: జిల్లాలో ఉచిత ఇసుక విధానం ప్రారంభమైంది. కొత్తూరు మండలం అంగూరు ర్యాంప్‌లో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు.. ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం గృహ నిర్మాణ రంగాన్ని నిర్వీర్యం చేసింది. ఇకపై భవన నిర్మాణ రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. లక్షలాది మంది కార్మికులకు ఉపాధి దొరకనుంది. పేదలకు సొంతింటి కల నెరవేరనుంది. రాష్ట్రంలో ఇసుక కొరత ఇక ఉండదు. ప్రజావసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయి. ఎన్నికల హామీ మేరకు నెలరోజుల్లోనే ఉచిత ఇసుక పాలసీని ఎన్డీయే ప్రభుత్వం అమలు చేసింది. ఇసుకను నామమాత్రపు ధరకే ఆన్‌లైన్‌లో విక్రయించనున్నాం. స్థానిక పంచాయతీ అభివృద్ధికి మాత్రమే కేటాయిస్తా’మని ఎమ్మెల్యే గోవిందరావు తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ లోతుగెడ్డ తులసీవర ప్రసాదరావు, అగతముడి అరుణ్‌, అగతముడి మాధవరావు, మాతల గాంధీ, గెడ్డవలస కమలాకర్‌, సన్యాసినాయుడు, ఎద్దు దాసునాయుడు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2024 | 11:48 PM