Share News

ఆ హామీలు.. హుష్‌ కాకి!

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:12 AM

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గత ఎన్నికల ముందు జిల్లాలోనే పాదయాత్ర ముగించారు. ప్రతి నియోజకవర్గంలోనూ సభలు నిర్వహించి.. జిల్లావాసులకు ఎన్నో హామీలిచ్చారు. ‘ఒక్క చాన్స్‌’ ఇస్తే ఏళ్ల తరబడిగా ఉన్న సమస్యలను కూడా పరిష్కరించి.. అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రకటించారు.

ఆ హామీలు.. హుష్‌ కాకి!
తితలీ తుఫాన్‌కు ధ్వంసమైన కొబ్బరి తోట (ఫైల్‌)

- ముఖ్యమంత్రి ఇచ్చిన వాటికే దిక్కులేదు

- పలాసలో నెరవేరని జగన్‌ వాగ్దానాలు

- తితలీ బాధితులకు రెట్టింపు పరిహారమేదీ?

- కిడ్నీ రోగులకూ అరకొర సేవలే

- ఐదేళ్లు పూర్తవుతున్నా.. కానరాని ప్రగతి

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గత ఎన్నికల ముందు జిల్లాలోనే పాదయాత్ర ముగించారు. ప్రతి నియోజకవర్గంలోనూ సభలు నిర్వహించి.. జిల్లావాసులకు ఎన్నో హామీలిచ్చారు. ‘ఒక్క చాన్స్‌’ ఇస్తే ఏళ్ల తరబడిగా ఉన్న సమస్యలను కూడా పరిష్కరించి.. అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రకటించారు. ఆయన ప్రకటనలను నమ్మిన జిల్లావాసులు పోనీలే అని వైసీపీకి ఒక్క అవకాశం ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం హోదాలో జగన్‌ జిల్లావాసులకు మరిన్ని హామీలు ఇచ్చేశారు. అవన్నీ నెరవేరుతాయని ఐదేళ్లు ప్రజలు ఎదురుచూశారు. మళ్లీ ఎన్నికల సమయం వచ్చేసింది. కానీ జగన్‌ ఇచ్చిన హామీలు బారెడు కాగా.. అమలు చేసింది గుప్పెడు కూడా లేవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా పలాస నియోజకవర్గంలో సీఎం జగన్‌ రెండుసార్లు పర్యటించి పలు హామీలు గుప్పించగా.. వాటిల్లో సగం కూడా నెరవేర్చలేదనే ఆరోపణలున్నాయి. సీఎం హామీలకు కూడా దిక్కులేదని నియోజకవర్గ ప్రజలు విస్తుపోతున్నారు. హామీల సంగతి అటుంచితే.. సమస్యల పరిష్కారంపై అధికారపార్టీ నేతలు కనీసస్థాయిలో శ్రద్ధ చూపడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో వైసీపీకి ఓట్ల రూపంలో బుద్ధి చెప్పేందుకు సన్నద్ధమవుతున్నారు.

పలాసలో సీఎం ఇచ్చిన హామీలు.. వాస్తవ పరిస్థితి

- సోంపేటలోని బీల ప్రాంతంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో జిల్లావాసులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మందిపై కేసులు నమోదయ్యాయి. 2019 సెప్టెంబర్‌ 6న పలాసలో జగన్మోహన్‌రెడ్డి పర్యటించారు. ‘థర్మల్‌’ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేస్తామని, బీలప్రాంతానికి సంబంధించి గతంలో విడుదల చేసిన జీవో 329ను రద్దు చేస్తామని జగన్‌ ప్రకటించారు. కొన్ని కేసులు మాత్రమే విచారణలో కొట్టివేశారు. వేయి మందికిపైగా ఉద్యమకారులపై ఓ కేసు ఇప్పటికీ అలానే ఉంది. ఈ విషయాన్ని జగన్‌కు గుర్తు చేసేందుకు కూడా అధికారపార్టీ నేతల ప్రయత్నించకపోవడం శోచనీయం.

- ఉద్దానంలో కిడ్నీ బాధితులు కోకొల్లలు. ఇక్కడ కిడ్నీ బాధితులకు, సీరం క్రియేటిన్‌ 5 పాయింట్లు దాటిన వారికి రూ. 5వేలు పింఛన్‌, కిడ్నీ రోగులతోపాటు సహాయకులకు ఉచిత బస్సు పాస్‌ ఇస్తామని జగన్‌ ప్రకటించారు. ప్రతి 500 మంది సీకేడీ రోగులకు ఒక హెల్త్‌వర్కర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కానీ ఉచిత బస్సు పాస్‌, హెల్త్‌వర్కర్‌ హామీ ఇంతవరకు నెరవేర్చలేదు. సీరం క్రియేటిన్‌ 5 పాయింట్లు దాటినవారిలో కొంతమందికే పింఛన్‌ అమలవుతోంది.

- జిల్లాలో 2018లో తితలీ తుపాను ప్రళయం సృష్టించింది. ఈ తుఫాన్‌ ధాటికి ఉద్దానం ప్రాంతమంతా అతలాకుతలమైంది. కొబ్బరి, జీడిపంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తుఫాన్‌ సమయంలో విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్మోహన్‌రెడ్డి.. బాధితులను పరామర్శించేందుకు కూడా రాలేదు. అయినప్పటికీ వైసీపీని ప్రజలు ఆదరించారు. పలాస వచ్చిన సీఎం... తితలీ తుఫాన్‌ సమయంలో తీవ్రంగా నష్టపోయిన కొబ్బరి రైతులకు రెట్టింపు పరిహారం ఇస్తామని ప్రకటించారు. సుమారు 7వేల మంది రైతులకు పరిహారం అందక.. ఇప్పటికీ నిరీక్షణ తప్పడంలేదు.

- వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు-మంచినీళ్లపేట వద్ద జెట్టీ ఏర్పాటు చేస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. ఫిష్‌ లాండింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు రూ.11.95 కోట్లు మంజూరైనా ఇప్పటికీ పనులు పూర్తిచేయలేదు. ఆ ప్రాంతంలో ఇసుక దిబ్బలను చదునుచేసి ఆపై సిమెంట్‌ పలకలు వేసి వదిలేశారు. మళ్లీ కంకర వేసి భూ మట్టం ఎత్తు చేసి పనులు చేపడుతున్నా.. ఆశించిన స్థాయిలో ప్రగతి లేదు.

గతేడాది ఇచ్చిన హామీలు ఇలా..

- పలాసలో గతేడాది డిసెంబరు 14న సీఎం జగన్మోహన్‌రెడ్డి భారీ సభ నిర్వహించారు. పలాస-కాశీబుగ్గ మునిసిపాల్టీ అభివృద్ధికి రూ.5కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికీ ఈ నిధులు మంజూరు కాలేదు.

- నౌపడ-కోసంగిపురం రెండు వరుసల రోడ్డు విస్తరణకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. కానీ ఈ రోడ్డు విస్తరణకు సంబంధించి ఎటువంటి ప్రగతి కూడా లేదు.

- వంశధార నీరు సముద్రంలో కలసి వృథాగా పోతుందని.. ఎత్తిపోతల పథకం మంజూరుచేయాలని మంత్రి సీదిరి అప్పలరాజు సభలో సీఎంను కోరారు. ఇందుకు స్పందించిన సీఎం.. వంశధార నీరు సముద్రంలో కలవకుండా బెండిగేటు వద్ద ఎత్తిపోతల పథకం నిర్మాణానికి అవసరమైన రూ. 7 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఇందుకు సంబంధించి కనీస కదలిక కూడా లేదు.

.......................

కేసు నడుస్తూనే ఉంది

2010 జులై 14న సోంపేట థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌కు సంబంధించి జరిగిన కాల్పుల్లో ఈ ప్రాంతానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. వేలాది మందిపై పోలీసులు కేసులు పెట్టారు. నాపై పవర్‌ప్లాంట్‌ ఉద్యమానికి సంబంధించి 57 కేసులు నమోదు చేశారు. ఇందులో ఒక కేసు ఇప్పటికీ నడుస్తూనే ఉంది. బారువ పోలీసులు 723మంది ఉద్యమకారులపై కేసు పెట్టారు. మా ఇంట్లో ఐదు మందిపై కేసులు నమోదు చేశారు. కాల్పుల అనంతరం ఈ ప్రాంతానికి పరామర్శకు వచ్చిన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. మా ఇంటికొచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే కేసులన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ కేసులు రద్దు చేయలేదు.

- బీన ఢిల్లీరావు, పర్యావరణ పరిరక్షణ సంఘ ప్రధాన కార్యదర్శి

.................

అదనపు పరిహారం అంతే..

తితలీ తుపాను సమయంలో కొబ్బరితోట ధ్వంసమైంది. కేవలం రూ.40వేలు మాత్రమే పరిహారం అందింది. రెట్టింపు పరిహారం ఇప్పటికీ ఇవ్వలేదు.

- పి.సత్యనారాయణ, ప్రగడపుట్టుగ, కవిటి మండలం

..................

మాటిచ్చారు.. కానీ..

తితలీ తుఫాన్‌లో దెబ్బతిన్న పంటలకు అదనపు పరిహారం ఇస్తామని మాట ఇచ్చారు. కానీ నేటికీ అమలుచేయలేదు. కొబ్బరి చెట్లు నాశనమై పంటలేక ఇబ్బంది పడుతున్నాం. రెట్టింపు పరిహారం మాటే.. మరిచిపోయినట్లున్నారు.

- బి.చక్రధరరావు, కవిటి

...................

పింఛన్‌ అందలేదు

ఉద్దానంలో కిడ్నీ రోగులకు, రక్తపరీక్షలో సీరం క్రియేటిన్‌ స్థాయి అధికంగా ఉన్నవారి పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. నాకు సీరం క్రియేటిన్‌ స్థాయి అధికంగా ఉన్నా.. ఇంతవరకూ పింఛన్‌ మంజూరు చేయలేదు. వైద్యఖర్చులకు ఇబ్బంది పడుతున్నాం.

- కిరోమని బిసాయి, బల్లిపుట్టుగ, కవిటి మండలం

Updated Date - Apr 19 , 2024 | 12:12 AM