Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

గంజాయి స్మగ్లర్ల బరితెగింపు!

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:23 AM

గంజాయి స్మగ్లర్లు బరితెగించారు. గంజాయితో ఉన్న కంటైనర్‌ లారీ పలాస వైపు వెళ్తుందని శ్రీకాకుళం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఆదివారం వేకుమజామున 3 గంటల సమయంలో.. పలాస జాతీయరహదారి నెమలినారాయణపురం బైపాస్‌ రోడ్డు వద్ద అనుమానిత కంటైనర్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆపే ప్రయత్నం చేయగా.. వాహనాన్ని వారిపైకి పోనిచ్చేలా దూసుకెళ్లారు.

గంజాయి స్మగ్లర్ల బరితెగింపు!
గాయాలకు గురైన పోలీసులను 108 వాహనంలో తరలిస్తున్న సిబ్బంది

- ‘పలాస’లో పోలీసులపైకి కంటైనర్‌తో దూసుకెళ్లిన వైనం

- ఎస్‌ఐతో సహా ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలు

- విశాఖపట్నం జిల్లాలో పట్టుబడిన వాహనం

- 380 కిలోల నిల్వలు లభ్యం

- డ్రైవర్‌, క్లీనర్‌ పరారీ

పలాస/ శ్రీకాకుళం క్రైం, మార్చి 3: గంజాయి స్మగ్లర్లు బరితెగించారు. గంజాయితో ఉన్న కంటైనర్‌ లారీ పలాస వైపు వెళ్తుందని శ్రీకాకుళం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఆదివారం వేకుమజామున 3 గంటల సమయంలో.. పలాస జాతీయరహదారి నెమలినారాయణపురం బైపాస్‌ రోడ్డు వద్ద అనుమానిత కంటైనర్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆపే ప్రయత్నం చేయగా.. వాహనాన్ని వారిపైకి పోనిచ్చేలా దూసుకెళ్లారు. దీంతో ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. కంటైనర్‌ యూ టర్న్‌ తీసుకొని మళ్లీ శ్రీకాకుళం వైపు వెళ్లిపోయింది. ఈ సమాచారం తెలుసుకుని.. విశాఖపట్నం పరదేశీపాలెం రోడ్డులో ఆ కంటైనర్‌ను ఆనందపురం పోలీసులు పట్టుకున్నారు. అందులో 380 కిలోల గంజాయి ప్యాకెట్లు లభించినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాలివీ.

ఒడిశా రాష్ట్రం గారబంద వద్ద గంజాయిని కంటైనర్‌లో నింపి పలాస మీదుగా చెన్నై తరలిస్తున్నారని ఎస్‌ఈబీ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత నాతవలస, మడపాం, లక్ష్మిపురం టోల్‌గేట్లు వద్ద పహారా కాశారు. ఎస్‌ఐ గోరు ప్రభాకర్‌, కానిస్టేబుళ్లు బొడ్డేపల్లి సురేష్‌, బలగాన సంతోష్‌కుమార్‌ బృందం పలాస జాతీయరహదారి నెమలినారాయణపురం వద్ద మాటు కాసింది. ఆదివారం వేకువజామున 3గంటల ప్రాంతంలో అనుమానిస్తున్న కంటైనర్‌ లారీ(ఆర్‌జే32 జీసీ6433) రానే వచ్చింది. దానిని ఆపి తనిఖీ చేసేందుకు ఎస్‌ఐ ప్రభాకర్‌ తన ద్విచక్ర వాహనాన్ని కంటైనర్‌కు అడ్డంగా పెట్టారు. తాము పోలీసులమని వాహనాన్ని పక్కన పెట్టాలని ఆదేశించారు. దీంతో కంటైనర్‌లోని డ్రైవర్‌.. కొంతదూరం వాహనాన్ని వెనక్కి తీసి.. అతివేగంగా మళ్లీ ముందుకొచ్చి ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. తప్పించుకునేందుకు వారిని దాటుకుని కంటైనర్‌ను పోనిచ్చారు. దీంతో ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు గాయాలకు గురయ్యారు. అయినా కంటైనర్‌ ఆపకుండా కోసంగిపురం వద్ద యూ టర్న్‌ తీసుకొని తిరిగి శ్రీకాకుళం వైపు వెళ్లిపోయింది. సీసీ పుటేజీల ఆధారంగా ఆ కంటైనర్‌ను పట్టుకోవడానికి జిల్లా పోలీసులు ప్రయత్నించారు. మడపాం టోల్‌గేట్‌ వద్ద కూడా కంటైనర్‌ను ఆపకపోవడంతో విశాఖ పోలీసులను సైతం అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం జిల్లా పరదేశీపాలేం వద్ద ఆనందపురం పోలీసులు ఆ కంటైనర్‌ను గుర్తించి పట్టుకున్నారు. అప్పటికే డ్రైవర్‌, క్లీనరు పరారీ అయ్యారు. కంటైనర్‌ను తనిఖీ చేయగా.. 380 కిలోల గంజాయి నిల్వలు లభ్యమయ్యాయని పోలీసులు వెల్లడించారు.

చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

ఘటనలో ఎస్‌ఐ ప్రభాకర్‌ కుడికాలుకి, కుడిచేతికి బలమైన గాయాలయ్యాయి. కానిస్టేబుళ్లు సంతోష్‌ కుడిచేతికి, సురేష్‌ ఎడమ కాలుకి గాయాలయ్యాయి. ఈ ముగ్గురినీ 108 వాహనంలో శ్రీకాకుళంలో జీజీహెచ్‌(రిమ్స్‌)కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మెడీకవర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ముగ్గురూ తలకు హెల్మెట్లు ధరించడం వలనే ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని వైద్యులు స్పష్టం చేశారు.క్షతగాత్రులను ఎస్పీ జీఆర్‌ రాధిక, ఏఎస్పీ ప్రేమ్‌కాజల్‌ పరామర్శించారు. అలాగే కాశీబుగ్గ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పారినాయుడు తెలిపారు.

పలాస టు చెన్నై

- ఒడిశా రాష్ట్రం ఆర్‌.ఉదయగిరిలో పండించే గంజాయిని గారబంద, గొప్పిలి మీదుగా మన రాష్ట్రంతోపాటు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రం చెన్నై, ముంబాయి, కోల్‌కతా వంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. పలాస జాతీయరహదారి, రైల్వేస్టేషన్‌ కేంద్రంగా రవాణా చేస్తున్నారు. గంజాయి రవాణాను పోలీసులు సీరియస్‌గా తీసుకొని విస్తృత దాడులు కొనసాగిస్తున్నారు. దీంతో నెల రోజులుగా పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు రైల్వేస్టేషన్లలో బ్యాగుల్లో తరలిస్తున్న గంజాయి నిల్వలు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో రైల్వే రక్షణ దళం పోలీసులు కూడా ఉండడం చర్చనీయాంశమవుతోంది.

- గిరిజన ప్రాంతాలు, మారుమూల కొండల్లో గంజాయిని ఎక్కువగా పండిస్తారు. అక్కడకు వెళ్లడానికి మన పోలీసులు, ఒడిసా పోలీసులు సైతం సాహసించలేకపోతున్నారు. ఆ ప్రాంతాలన్నీ మావోయిస్టు ప్రభావితంగా గుర్తింపు పొందాయి. దీంతో అక్కడివారి సహాయం లేనిదే వెళ్లడం వీలుకాదు. బంతిపూల సాగుమాటున గంజాయిని ఎక్కువగా పండిస్తారు. గంజాయి కూడా బంతిపూల చెట్లు మాదిరిగానే ఉండడంతో అవి పెద్దవయితేగాని ఏది బంతో, ఏది గంజాయో చెప్పడం కష్టం. ఇదే గంజాయి స్మగ్లర్ల పాలిట వరమైంది. ముఠా సభ్యులు గిరిజనులకు ఎకరాలకు రూ.లక్ష వరకు నగదు ఇచ్చి పంటనంతా సేకరించి ఎకరా పంట రూ.కోటి వరకూ అమ్ముకుంటారు. 20ఏళ్ల కిందట పలాస మండల గిరిజన ప్రాంతాల్లో కూడా గంజాయి సాగయ్యేది. అప్పటి ఎక్సైజ్‌, స్థానిక పోలీసులు సంయుక్తంగా తరచూ దాడులు చేయడం, గిరిజనుల్లో అవగాహన కల్పించడంతో గంజాయిని పండించడం మానేశారు. వరి, రాగి, సజ్జలు పండించి.. జీవనోపాధి పొందుతున్నారు.

- ఒడిశా మారుమూల ప్రాంతాల్లో దాడులు, అవగాహన కార్యక్రమాలు లేకపోవడంతో బ్రోకర్ల మాటే గంజాయి వ్యాపారం సాగుతోంది. రాష్ట్రంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా వాటి మూలాలు ఆర్‌.ఉదయగిరి, మోహన్‌బ్లాక్‌లతోనే ముడిపడి ఉండడం విశేషం. ఆంరఽధా, ఒడిశా పోలీసులు సంయుక్తంగా ఆయా బ్లాక్‌ల పరిధిలో గంజాయి పండించే రైతులకు అవగాహన కల్పించడం, నిరంతరం దాడులు చేస్తే గంజాయి రవాణా అరికట్టడం సాధ్యమవుతందనేది నగ్నసత్యం.

Updated Date - Mar 04 , 2024 | 12:23 AM