Share News

టెక్కలిని జిల్లా కేంద్రంగా మారుస్తా

ABN , Publish Date - Feb 12 , 2024 | 12:44 AM

‘రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది. అందులో లోకేష్‌ కీలకపాత్ర వహిస్తారు. ఆయన సహకారంతో టెక్కలి నియోజకవర్గాన్ని జిల్లాకేంద్రంగా మారుస్తా’నని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

టెక్కలిని జిల్లా కేంద్రంగా మారుస్తా
లోకేశ్‌తో అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు

- 175 స్థానాల్లో టీడీపీ, జనసేన కూటమి విజయం తధ్యం

- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు

టెక్కలి/పలాస, ఫిబ్రవరి 11: ‘రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది. అందులో లోకేష్‌ కీలకపాత్ర వహిస్తారు. ఆయన సహకారంతో టెక్కలి నియోజకవర్గాన్ని జిల్లాకేంద్రంగా మారుస్తా’నని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం రాత్రి టెక్కలిలోని శంఖారావ సభలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వాలని, వంశధార ప్రధాన ఎడవకాలువ హిరమండలం నుంచి వజ్రపుకొత్తూరు వరకు కాలువ ఆధునీకరణకు చేపట్టాలని లోకేశ్‌ను కోరారు. ‘టీడీపీ హయాంలో వంశధార ప్రాజెక్టు పనులు 72 శాతం పూర్తిచేశాం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని పట్టించుకోలేదు. కాలువలన్నీ పూడికపోయి రైతులు సాగునీటి కోసం రోడ్డున పడ్డారు. రాష్ట్రాన్ని సీఎం జగన్‌ సర్వనాశనం చేశారు. రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతో జగన్‌.. పేదవాడినని కొత్తరాగం అందుకుంటున్నార’ని అచ్చెన్న విమర్శించారు. సాక్షి పేపర్‌, టీవీ, బెంగుళూరులో ప్యాలెస్‌, హైదరాబాద్‌లో లోటస్‌పాండ్‌, తాడేపల్లి ప్యాలెస్‌, రూ.500 కోట్లతో రుషికొండలో కట్టిన ప్యాలెస్‌లు ఎవరివని ప్రశ్నించారు. ‘టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టినవారి పేర్లను లోకేశ్‌బాబు రెడ్‌బుక్‌లో రాసుకుంటున్నారు. నేను బుర్రలోనే ఫీడ్‌ చేసుకున్నాను. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో వారికి చక్రవడ్డీతో సహా సెటిల్‌ చేస్తా’నని అచ్చెన్న తెలిపారు. రాష్ట్రంలో 175 స్థానాల్లో టీడీపీ, జనసేన కూటమి గెలుస్తుందని, పులివెందులలో కూడా టీడీపీ జెండా ఎగురవేస్తామని స్పష్టం చేశారు.

సైకో పోవాలి.. సైకిల్‌ రావాలి : ఎంపీ రామ్మోహన్‌నాయుడు

జగన్‌ ఐదేళ్ల పాలనలో మోసపోయినట్లు ప్రజలు గుర్తించారని, అందుకే ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘సైకో పోవాలి.. సైకిల్‌ రావాలి’ అన్న నినాదాలు వినిపిస్తున్నాయని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. లోకేశ్‌ శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ.. జాబ్‌ క్యాలెండర్‌ ఏమైందని ప్రశ్నించారు. కేవలం ఎన్నికలు ఉన్నాయనే డీఎస్సీ ప్రకటించారని ఎద్దేవా చేశారు. ‘పలాసలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఎక్కడా తట్టెడు మట్టి కూడా మంత్రి అప్పలరాజు వేయలేదు. కొండలు కబ్జా చేసిన ప్రాంతంలో ఆయన సెల్ఫీలు తీసుకోవాలి. అడుగడుగునా మంత్రి అవినీతికి పాల్పడి పలాస పరువు తీశారు. స్టీలు కుర్చీల ఎంపీ అని నన్ను తూలనాడారు. వాస్తవానికి ఇక్కడి నుంచి స్టీల్‌ప్లాంట్‌ వరకు నేనే ఎంపీనన్న విషయం మంత్రి గుర్తించాలి. వైసీపీ ఎంపీలు ఎవరో రాష్ట్ర ప్రజలకు ఇప్పటివరకు తెలియదు. బాబాయ్‌ను హత్య చేసిన, భూ కబ్జాలకు పాల్పడిన, అశ్లీల వీడియోలు తీసుకున్న ఎంపీలు అంటేనే ప్రజలకు తెలుసు. వైసీపీ సోషల్‌ మీడియాలో తప్ప పలాస కిడ్నీ ఆసుపత్రి ఎవరికీ వినియోగపడడం లేదు. నెఫ్రాలజిస్ట్‌లు లేని కిడ్నీ ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. మంత్రి కేవలం పబ్లిసిటీ కోసమే బిల్డింగ్‌లు కట్టి బిల్డప్‌ ఇస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎర్రన్నాయుడు ఉద్దానం రక్షితనీటి పథకం అమలు చేస్తే.. నారా లోకేశ్‌కు ఉద్దానం ప్రాంతాలకు శుద్ధ జలాలు అందించిన చరిత్ర ఉంది. ప్రస్తుతం రూ.700 కోట్లతో ప్రారంభించిన నీటి పథకం ద్వారా ఒక్క గ్రామానికైనా పూర్తిస్థాయి నీరు అందించారా?. పలాస అభివృద్ధి చెందాలంటే గౌతు శిరీషను గెలిపించాలి’ అని ఎంపీ కోరారు.

Updated Date - Feb 12 , 2024 | 12:44 AM