Share News

బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ అనుమానాస్పద మృతి

ABN , Publish Date - Feb 07 , 2024 | 11:36 PM

మండలంలోని గూడెం గ్రామానికి చెందిన బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ పిట్ట రాము (35) బుధవారం పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం మాల్డా రైల్వే ట్రాక్‌పై అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.

బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ అనుమానాస్పద మృతి
రాము (ఫైల్‌)

- మాల్డా రైలు పట్టాలపై మృతదేహం

టెక్కలి రూరల్‌, ఫిబ్రవరి 7: మండలంలోని గూడెం గ్రామానికి చెందిన బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ పిట్ట రాము (35) బుధవారం పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం మాల్డా రైల్వే ట్రాక్‌పై అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. గ్రామస్థుల వివరాల మేరకు.. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రాము ఈ నెల 6వ తేదీన సెలవుపై ఇంటికి వచ్చేందుకు బయలుదేరాడు. ఈ క్రమంలో బుధవారం మాల్డా సమీపంలోని రైల్వే ట్రాక్‌పై మృతిచెంది కనిపించాడు. ఈ మేరకు రైల్వే సిబ్బంది బీఎస్‌ఎఫ్‌ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వద్ద మాల్డా ప్రాంతం నుంచి పలాసకు వచ్చే రైల్వే టికెట్‌, బీఎస్‌ఎఫ్‌ గుర్తింపు కార్డు, ఆధార్‌, ఓటరు, తదితర గుర్తింపు కార్డులు లభ్యమయ్యాయి. దీంతో మృతి చెందింది రాముగా గుర్తించి గూడెంలోని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే, రైలుపట్టాలపై రాము మృతదేహం రెండు భాగాలుగా విడిపోయి ఉండడంతో బీఎస్‌ఎఫ్‌ కమాండో ఉన్నతాధికారులు అనుమానాస్పద మృతిగా పేర్కొన్నారు. రాము ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే అనుమానాలు గ్రామంలో వ్యక్తం అవుతున్నాయి. మృతదేహాన్ని గురువారం నాటికి గ్రామానికి తీసుకువచ్చేందుకు బీఎస్‌ఎఫ్‌ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. రాముకు భార్య సుజాత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. జవాన్‌ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Updated Date - Feb 07 , 2024 | 11:36 PM