‘సూపర్ సిక్స్’.. అదుర్స్
ABN , Publish Date - May 12 , 2024 | 12:16 AM
‘సూపర్ సిక్స్’.. ఇప్పుడు ప్రతిఒక్కరి నోట ఇదే మాట. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం చేసేలా.. ఆరు ప్రత్యేక హామీలను ప్రకటించారు. తాము అధికారంలోకి రాగానే.. ఈ ప్రత్యేక పథకాలు అమలు చేయనున్నట్టు విస్తృత ప్రచారం చేశారు.

- గ్రామగ్రామాన చేరిన ఎన్టీయే కూటమి ప్రచారం
- టీడీపీ-జనసేన-బీజేపీ మేనిఫెస్టో అద్భుతమంటున్న జనం
- పథకాలపై మహిళల ఆసక్తి
- మెగా డీఎస్సీ కోసం యువత ఆశలు
(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)
‘సూపర్ సిక్స్’.. ఇప్పుడు ప్రతిఒక్కరి నోట ఇదే మాట. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం చేసేలా.. ఆరు ప్రత్యేక హామీలను ప్రకటించారు. తాము అధికారంలోకి రాగానే.. ఈ ప్రత్యేక పథకాలు అమలు చేయనున్నట్టు విస్తృత ప్రచారం చేశారు. అలాగే జనసేనాని ప్రతిపాదించిన ‘షణ్ముఖ వ్యూహం’ అంశాలు కూడా ఇందులో చేర్చారు. మరోవైపు టీడీపీ, జనసేనకు బీజేపీ కూడా మద్దతు ఇవ్వడంతో.. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేలా సమగ్ర మేనిఫెస్టోలో పొందుపరిచారు. చిన్నారులను, మహిళలను, వృద్ధులను, నిరుద్యోగులను, ఉద్యోగులను సైతం లబ్ధి కలిగేలా మేనిఫెస్టో ఉండడంతో ప్రజలంతా ‘సూపర్ సిక్స్’.. అదుర్స్ అని కితాబునిస్తున్నారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే తమకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు.
- యువతకు 20లక్షలు ఉద్యోగాలు.. నిరుద్యోగ భృతి..
యువత ఉపాధి కోసం వలసబాట పడుతున్నారు. ఈ ఐదేళ్లు ఒక్క డీఎస్సీ కూడా భర్తీచేయలేదు. సూపర్‌సిక్స్‌లో భాగంగా యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు ప్రకటించారు. నిరుద్యోగులకు రూ.3వేలు భృతి ఇస్తామన్నారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపైనే తొలిసంతకం చేస్తామని ప్రకటించారు. దీంతో యువత భారీ ఆశలు పెంచుకుంది.
- ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15వేలు..
వైసీపీ ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకంలో కేవలం ఇంటిలో ఒకరికి మాత్రలే లబ్ధి కలిగేది. రూ.15వేలు అనిచెప్పి రూ.13వేలు మాత్రమే ఇచ్చేవారు. ఈ ఏడాది అమ్మఒడి డబ్బులను ఎగనామం పెట్టేశారు. కూటమి అధికారంలోకి వస్తే ‘తల్లికి వందనం’ పథకం కింద ఇంట్లో ఎంతమంది చిన్నారులున్నా.. పాఠశాలకు ప్రతి ఒక్కరికీ రూ.15వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- ప్రతిరైతుకు రూ.20వేలు..
జిల్లాలో చాలామంది రైతులు ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్నారు. అప్పులపాలై ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కో రైతుకు ఆర్థికసాయంగా ఏటా రూ.20వేలు అందజేస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో వారంతా ఊరట చెందుతున్నారు.
- 19 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1,500
19 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు మహిళలకు నెలకు రూ.1500చొప్పున ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీనివల్ల ప్రతి ఇంట్లోనూ మహిళలకు భారీ ప్రయోజనం కలుగుతుంది.
- ఉచితంగా మూడు సిలెండర్లు..
ఒక్కో కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. దీనివల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు భారీ ఊరట లభించనుంది.
- ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం...
తెలంగాణ మాదిరి ఆంధ్రాలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. దీనిపై యువతులు, విద్యార్థినులు, గృహిణులు, ఉద్యోగినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- సూపర్ సిక్స్ 2.0తోపాటు షణ్ముఖవ్యూహం...
ఇంటింటికీ రక్షిత తాగునీరు, పూర్ టు రిచ్, యాభై ఏళ్లకే బీసీలకు పెన్షన్, బ్రాహ్మణుల సంక్షేమం, మైనార్టీలు, న్యాయవాదులు, క్రైస్తవులు, ఇలా అన్నివర్గాల ప్రజలకోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు. పరిశ్రమలు ఏర్పాటు.. స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించడం. మహిళా సంఘాలకు వడ్డీ లేకుండా రూ.10లక్షల వరకు రుణాలు.. ఉద్యోగస్తులు, పెన్షనర్స్‌కు కూడా పలు ప్రయోజనాలు కల్పించేలా మేనిఫెస్టోలో పొందుపరిచారు. నేతకార్మికులు, మత్స్యకారులు, యాదవులు ఇలా.. ఇతరత్రా వర్గాలకు వేర్వేరుగా అమలుచేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్నివర్గాల ప్రజలు కూటమికి జై అంటున్నారు.
- ఇంతకంటే ఇంకేం కావాలి
కొలువు కోసం ఎదురుచూస్తున్నాం. ఐదేళ్ల నుంచి డీఎస్సీ లేదు. కోచింగ్ తీసుకుంటున్నా ప్రయోజనం లేదు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపైనే సంతకం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇంతకంటే ఇంకేం కావాలి మాకు.
- లండ హేమంత్‌రామ్, నిరుద్యోగి
.........................
ఆసక్తి పెరిగింది
సూపర్ సిక్స్ పథకాలపై అందరికీ ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ప్రతి కుటుంబానికి ఆర్థికంగా భరోసా కల్పించేలా టీడీపీ ఆలోచించింది. ఈ పథకాల వల్లనే ఎన్డీఏ కూటమికే జై అంటున్నాం.
- పెంకి నాగేశ్వరరావు, శ్రీకాకుళం
.........................
ఎంతో భారం తగ్గుతోంది
ఐదేళ్లలో నిత్యావసరాల ధరలు బాగా పెరిగిపోయాయి. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తే.. మాలాంటి కుటుంబాలకు ఎంతో ఆర్థిక భారం తగ్గుతుంది.
- కొమ్మనాపల్లి మాలతి, గృహిణి. శ్రీకాకుళం
.........................
హర్షణీయం
టీడీపీ అధికారంలోకి వస్తే ఒక్కో మహిళకు రూ.1500 ఇస్తామని చెప్పడం హర్షణీయం. ఇంటి నిర్వహణకు.. ఇతరత్రా ఖర్చులకు మాకు ఆ డబ్బులు వినియోగపడతాయి. కుటుంబ భారంను మహిళలు పంచుకునేందుకు వీలుంటుంది.
- దవళ పద్మావతి, నందికొంగ కాలనీ, సరబుజ్జిలి
.........................
ఎంతో సంతోషం :
ఏటా రైతుకు రూ.20వేలు ఆర్థికసాయం ఇస్తామని చంద్రబాబు ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉంది. అలాగే బీసీలకు యాభై ఏళ్లకే పెన్షన్ అంటున్నారు. వెనుకబడిన తరగతికి చెందిన ప్రతిఒక్కరికి మేలు కలుగుతుంది. టీడీపీకే మేమంతా ఓటు వేయాలన్న నిర్ణయించుకున్నాం.
మీసాల ధనంజయరావు, తురకపేట గ్రామం