Share News

అటకెక్కిన.. ఉద్దానం ప్రాజెక్టు

ABN , Publish Date - May 20 , 2024 | 12:11 AM

వేసవి వేళ.. జిల్లాలో పలు ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. వైసీపీ పాలనలో ఉద్దానం ప్రాజెక్టు అటకెక్కింది. ఎక్కడికక్కడ పైపులైన్లు లీకేజీ కాగా.. నీరు వృథాగా పోతోంది.

అటకెక్కిన.. ఉద్దానం ప్రాజెక్టు
సరియాపల్లిలో ఉద్దానం నీటికోసం బిందెల క్యూ

- 290 గ్రామాలకు అందని రక్షిత నీరు

- ఎక్కడికక్కడ పైపులైను లీకేజీలు

- 20 నెలలుగా సిబ్బందికి అందని వేతనాలు

(సోంపేట/హరిపురం)

వేసవి వేళ.. జిల్లాలో పలు ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. వైసీపీ పాలనలో ఉద్దానం ప్రాజెక్టు అటకెక్కింది. ఎక్కడికక్కడ పైపులైన్లు లీకేజీ కాగా.. నీరు వృథాగా పోతోంది. ఈ ఐదేళ్లలో కనీసస్థాయిలో మరమ్మతులు లేవు. ఫలితంగా 8 మండలాల్లో 290 గ్రామాలకు రక్షితనీరు కరువవుతోంది. మరోవైపు 20 నెలలుగా సిబ్బందికి వేతనాలు కూడా అందకపోవడంతో.. ఆయా కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి.

మందస, సోంపేట, కంచిలి, కవిటి, పలాస, నందిగాం, వజ్రపుకొత్తూరు, ఇచ్ఛాపురం మండలాల పరిధిలో ప్రజలకు తాగునీరందించేందుకు 25 ఏళ్ల కిందట దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు కృషితో ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో.. ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రాజెక్టు నిర్వహణపై ఉన్నతాధికారులు దృష్టి సారించడం లేదు. దీంతో ప్రాజెక్టు పరిధిలో చాలాచోట్ల ట్యాంకులకు నీరు సరఫరా అయ్యే ఎయిర్‌వాల్వ్‌లు, గ్రామాల్లోని పైపులైన్లు లీకవుతున్నాయి. నీరు వృథాగా పోతోంది. కొంతమంది రైతులు ఈ వృథా నీటిని జీడితోటలకు, పొలాలకు మళ్లించి వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో శివారు గ్రామాలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. కుళాయిల ద్వారా ఎప్పుడు నీరు వస్తుందో.. ఎప్పుడు రాదో తెలియని దుస్థితి నెలకొంది. మత్స్యకార గ్రామాలతోపాటు, బారువ, సోంపేట, వజ్రపుకొత్తూరు లాంటి మేజర్‌ పంచాయితీల ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైపులైన్లకు మరమ్మతులు చేపట్టి.. నీటి వృథాను అరికట్టేలా అధికారులు చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుళాయిల ద్వారా నీటిని సక్రమంగా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

సిబ్బందికి పస్తులే

ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు పరిధిలో 150మంది సిబ్బంది పని చేస్తున్నారు. వీరికి 20నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో.. కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నారు. పస్తులుండక తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ పరిస్థితి దారుణంగా తయారైందని వాపోతున్నారు. గతంలో 16 నెలలు వేతనాలు అందజేయకపోవడంతో సమ్మె చేయగా.. 8 నెలలు జీతాలు అందించారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి నెలకొందని.. వేతనాలు సక్రమంగా చెల్లించకపోతే తామెలా బతుకుతామని సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి వేతనాలు మంజూరు చేయాలని కోరుతున్నారు.

Updated Date - May 20 , 2024 | 12:11 AM