Share News

రాళ్లు వేశారు.. తారు మరిచారు!

ABN , Publish Date - Jan 03 , 2024 | 11:57 PM

వజ్రపుకొత్తూరు నుంచి అక్కుపల్లి మీదుగా రోడ్డు విస్తరణ పనులు మూడున్నరేళ్లుగా కొనసాగుతున్నాయి. రూ.16కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై రాళ్లు వేసి తారు వేయకుండా పనులు నిలిపివేయడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.

రాళ్లు వేశారు.. తారు మరిచారు!
అక్కుపల్లి వద్ద రోడ్డుపై రాళ్లు తేలి..

- మూడేళ్లుగా సాగుతున్న రోడ్డు విస్తరణ

- బిల్లుల చెల్లింపులో జాప్యం

- రాకపోకలకు అంతరాయం

(వజ్రపుకొత్తూరు)

వజ్రపుకొత్తూరు నుంచి అక్కుపల్లి మీదుగా రోడ్డు విస్తరణ పనులు మూడున్నరేళ్లుగా కొనసాగుతున్నాయి. రూ.16కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై రాళ్లు వేసి తారు వేయకుండా పనులు నిలిపివేయడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. మరోవైపు రోడ్డుపై దుమ్ము, ధూళి చెలరేగడంతో శ్వాసకోశ వ్యాధులు సంభవిస్తాయోమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో ప్రధాన రహదారి పనులు నత్తనడకన సాగుతున్నా.. అధికారులు, పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి పనులు పూర్తిచేయాలని కోరుతున్నారు. కాగా కాంట్రాక్టర్‌కు బిల్లులు సకాలంలో చెల్లించక పోవడంతో పనులు ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై ఆర్‌అండ్‌బీ జేఈ విక్రమ్‌ వద్ద ప్రస్తావించగా.. రోడ్డు పనులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా రాళ్లు తేలిన చోట గ్రావెల్‌ వేశామని తెలిపారు.

..................

ఇబ్బందులు పడుతున్నాం

అక్కుపల్లి రోడ్డు పనులు మూడున్నరేళ్లు అయినా పూర్తికాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. రోడ్డుపై రాళ్లు తేలి ఉండడంతో ద్విచక్రవాహనాలు బోల్తా పడి గాయాల పాలవుతున్నాం. ఈ రోడ్డు విషయంలో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోకపోవడం బాధాకరం.

- రెయ్యి గున్నయ్య, పల్లిసారధి

..........................

పనులు పూర్తిచేయాలి

మండలంలో ప్రధాన రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు పూర్తికాక పోవడంతో రోడ్డుపై దుమ్ము, ధూళి కారణంగా ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలి.

- సూరాడ మోహనరావు, టీడీపీ మండల అధ్యక్షుడు, అక్కుపల్లి

Updated Date - Jan 03 , 2024 | 11:57 PM