Share News

స్పీకర్‌ సార్‌.. ఐదేళ్లు సరిపోలేదా?

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:30 AM

పొందూరులో సమస్యలన్నీ పరిష్కరిస్తామని గత ఎన్నికల ముందు స్పీకర్‌ తమ్మినేని సీతారాం హామీ ఇచ్చారు. అయితే, అధికారం చేపట్టి ఐదేళ్లు పూర్తయినా ఆ హామీలను నెరవేర్చలేదు.

    స్పీకర్‌ సార్‌.. ఐదేళ్లు సరిపోలేదా?
నిలిచిపోయిన మడ్డువలస కాలువ నిర్మాణం

- ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల సంగతేంటి?

-మడ్డువలస రెండోదశ పనులు ఏమయ్యాయి?

- డిగ్రీ కళాశాల భవనాల మాటేంటి?

- చేనేత కార్మికులను మరిచిపోయారా?

- పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యను వదిలేశారు

- పార్క్‌ ఆధునికీకరణ ఊసే లేదు

- స్పీకర్‌ను ప్రశ్నిస్తున్న పొందూరు వాసులు

(పొందూరు)

పొందూరులో సమస్యలన్నీ పరిష్కరిస్తామని గత ఎన్నికల ముందు స్పీకర్‌ తమ్మినేని సీతారాం హామీ ఇచ్చారు. అయితే, అధికారం చేపట్టి ఐదేళ్లు పూర్తయినా ఆ హామీలను నెరవేర్చలేదు. ఇచ్చిన హామీలను మరచిపోయారు. ప్రధానంగా మడ్డువలస రెండోదశ పనులు, డిగ్రీ కళాశాల భవనాలు, చేనేత కార్మికులకు ప్రోత్సాహం, పొందూరు పార్కు ఆధునికీకరణ, తదితర సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి గాలికొదిలేశారు. ఈ ఐదేళ్లు ఏమిచేశారని పలువురు పొందూరు ప్రజలు స్పీకర్‌ను ప్రశ్నిస్తున్నారు.

---------------------

శంకుస్థానతో సరి

మండలంలో 12,500 ఎకరాలకు నీరందించే మడ్డువలస రెండోదశ కాలువ పనులు ముందుకుసాగలేదు. 12 ఏళ్లుగా మడ్డువలస రెండోదశ పనులు సాంకేతిక కారణాలతో నిలిచిపోయాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేస్తామని గత ఎన్నికల ప్రచారంలో తమ్మినేని సీతారాం హామీఇచ్చారు. నాలుగేళ్ల తరువాత గతఏడాది ఏప్రిల్‌ 24న రూ.26 కోట్లతో పనులకు శంకుస్థాపన చేశారు. త్వరగా పూర్తిచేసి ఖరీఫ్‌లో రైతులకు నీరందిస్తామని నీటిపారు దల శాఖమంత్రి అంబటి రాంబాబు, మంత్రి బొత్స సత్యనారాయణ, స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు. అయితే, భూసేకరణ విషయంలో రైతుల సమస్యలు పరిష్కరించకపోవడం, నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాకపోవడంతో ఎక్కడిపనులు అక్కడే నిలిచిపోయాయి.

చిత్తశుద్ధి లేదు

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మడ్డువలస కాలువ నిర్మాణం పూర్తిచేసి నీరందిస్తామని స్పీకర్‌ హామీ ఇచ్చారు. నాలుగేళ్లు కనీసం పట్టించుకోకుండా ఏడాది కిందట పనులకు శంకుస్థాపన చేశారు. భూసేకరణ కోసం రైతులతో మాట్లాడకపోవడంతో సమస్య మొదటికి వచ్చింది. హామీ అమలులో చిత్తశుద్ధి లేదు

- పైడి రామారావు, వావిలపల్లిపేట

------------------------------------

భవనాలు లేక..విద్యార్థుల బేజారు

పొందూరు వాసుల దశాబ్దాల కలను గత టీడీపీ ప్రభుత్వం నెరవేర్చింది. అప్పటి విప్‌ కూన రవికుమార్‌ పట్టుబట్టి పొందూరుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయించారు. కళాశాల భవనాల నిర్మాణానికి రాపాక సమీపంలో 310 సర్వేనంబరులో కొండకు ఆనుకుని సుమారు ఐదెకరాలు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఇంతలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో డిగ్రీ కళాశాల ప్రక్రియ నెమ్మదిగా సాగింది. కొత్త భవనాలను నిర్మిస్తామని చెప్పిన స్పీకర్‌ దాన్ని గాలికొదిలేశారు. దీంతో తాత్కాలికంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనాల్లో డిగ్రీ తరగతులను నిర్వహిస్తు న్నారు. ఈ ఐదేళ్లలో డిగ్రీ కళాశాల భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదు. దీంతో అరకొర ఉన్న భవనాల్లో తరగతులు నిర్వహిస్తుండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందిప డుతున్నారు.

గదులు లేక ఇబ్బంది

డిగ్రీ కళాశాలలో తరగతి గదులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాం. కళాశాలలో మరుగుదొడ్ల సౌకర్యం పూర్తి స్థాయిలో లేదు. ప్రధానంగా విద్యార్థినులు నరకం చూస్తున్నారు. శాశ్వత కళాశాల భవనాలు నిర్మిస్తే తప్ప ఇబ్బందులు తప్పవు.

- శ్రీనివాసరావు, విద్యార్థి

----------------------------------

ట్రాఫిక్‌ సమస్యతో అగచాట్లు

పొందూరు పట్టణంలో జనాభా రోజురోజుకూ పెరుగుతుతోంది. జిల్లా వ్యాపార కూడలిగా మారుతోంది. వేలాదిమంది భూముల రిజిస్ర్టేషన్లకు ఇక్కడి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వస్తుంటారు. దీనికి అనుగుణంగా రోడ్లను విస్తరించడంలేదు. దీంతో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది. ప్రధానంగా మార్కెట్‌ నుంచి కాంప్లెక్స్‌ వెళ్లే ప్రధాన రోడ్డు ఇరుగ్గా ఉండడంతో ప్రతిరోజు ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతుంది. దీంతో విద్యార్థులు, ఉద్యో గులు అగచాట్లకు గురవుతున్నారు. గత ఎన్నికల్లో రోడ్లు వెడల్పుచేస్తామని తమ్మినేని సీతారాం ఇచ్చిన హామీ నేటికీనెరవేర్చలేదని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు.

హామీ నెరవేరలేదు

నిత్యంరద్దీగా ఉండే మార్కెట్‌- కాంప్లెక్స్‌ రోడ్డు కనీసం 10 అడుగులు లేక పోవడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోతుంది. ఆక్రమణలు తొలగించి వెడల్పు చేసి రోడ్డు నిర్మిస్తామని గత ఎన్నికల్లో స్పీకర్‌ ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదు.

-పశుపురెడ్డి శ్రీనివాసరావు, పొందూరు

-----------------------------

క్లస్టర్లతో ఒరిగేదేమీ లేదు

పొందూరు పేరు చెప్పగానే ఖాదీ, చేనేత గుర్తొస్తాయి. గత ఎన్నికల ముందు పాదయాత్రకు ఈ ప్రాంతానికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఖాదీ, చేనేతను ప్రోత్సహిస్తామని ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత, ఖాదీకి ప్రోత్సాహం లేదు కదా నూలు సబ్సిడీ తీసివేయడంతో నేతన్నలు నష్టపోతున్నారు. చేనేత అభివృద్ధి కోసం పొందూరులో రెండు, తోలాపిలో ఒక చేనేత క్లస్టర్‌ ఏర్పాటు చేసినా ఎటువంటి ప్రయోజనం లేకుండాపోయింది. ఇప్పటివరకు నేత, వడుకు కార్మికులకు రూపాయి ప్రయోజనం చేకూరలేదు.

ఒక్క రూపాయి ప్రయోజనం లేదు

చేనేత క్లస్టర్‌ ఏర్పాటు చేసి ఏడాది దాటుతున్నా ఇంతవరకు చేనేత కార్మికులకు రూపాయి ప్రయోజనం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూత సబ్సిడీ తీసివేశారు. దీంతో ఒక్కో చేనేత కార్మిక కుటుంబం ఏడాదికి రూ.50 వేలు వరకు నష్టపోతోంది

- కె.శ్రీనివాసరావు, మాజీ ఉపాధ్యక్షుడు, సాయిబాబా చేనేత సొసైటీ, పొందూరు

------------------------

దిష్టిబొమ్మలా పార్క్‌

పొందూరు మధ్యలో ఉన్న నెహ్రూ పార్క్‌ నిర్వహణలేక దిష్టిబొమ్మగా మారింది. పార్క్‌ను సుందరంగా తీర్చిదిద్దుతామని గత ఎన్నికల్లో స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదు. పర్యవేక్షణ లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. ఈ ఐదేళ్లలో నెహ్రూపార్కు అభివృద్ధికి కనీసం రూపా యి నిధులు కూడా విడుదల చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఆహ్లాదకరం కరువైంది

పొందూరులో వృద్ధులు, చిన్నారులు సేదదీరేందుకు కనీసం ఆహ్లాదకరమైన ఒక్క పార్క్‌ కూడా లేదు. ఎన్ని నిధులు అవసరమైనా విడుదల చేసి పార్కును సుందరంగా తీర్చిదిద్దుతామని గత ఎన్నికల్లో స్పీకర్‌ ఇచ్చిన హామీ అటకెక్కిపోయింది. పార్క్‌లో అభివృద్ధి చేసిందేమీ లేదు గాని నీటిట్యాంకు నిర్మించి పార్క్‌ను కుదిస్తున్నారు.

-కె. భాస్కరరావు, పొందూరు

Updated Date - Apr 25 , 2024 | 12:30 AM