Share News

ఓటర్ల జాబితాలో తొలగని ఆత్మలు

ABN , Publish Date - Jan 28 , 2024 | 11:28 PM

ఓటర్ల జాబితాలో తప్పుల తడకలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓటర్ల జాబితాలో మృతుల పేర్లు తొలగించాలని ఇటీవల కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఓటర్ల జాబితాలో తొలగని ఆత్మలు

సరుబుజ్జిలి, జనవరి 28: ఓటర్ల జాబితాలో తప్పుల తడకలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓటర్ల జాబితాలో మృతుల పేర్లు తొలగించాలని ఇటీవల కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. అయినా.. సరుబుజ్జిలి మండలానికి చెందిన ఓటర్ల జాబితాలో ఇంకా మృతుల పేర్లు ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలకు చెందిన పోలింగ్‌ కేంద్రాల ఏజెంట్లు, కన్వీనర్లు ఇటీవల ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల తుదిజాబితాలో లోపాలు ఉన్నాయనంటూ తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

- సరుబుజ్జిలి మండలం మర్రిపాడుకు చెందిన కందుకూరి రంగనాయకమ్మ కొన్నాళ్ల కిందట మృతి చెందింది. ముసాయిదా జాబితా ప్రకారం 185వ పోలింగ్‌ కేంద్రంలో ఆమె ఓటు ఉంది. దానిని తొలగించాలని కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసినా.. తుది జాబితాలో ఆమె ఓటరుగానే ఉన్నారు.

- చిగురువలసలోని 186వ పోలింగ్‌ కేంద్రం పరిధిలో బురక భూలోకమ్మ, చల్ల రామన్న మరో ఇద్దరు ఓటర్లు కొన్నాళ్ల కిందట మరణించినా.. వారి పేర్లు తుది ఓటర్ల జాబితాలో కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే పోలింగ్‌ కేంద్రం పరిధిలో బూర్జ మండలం అన్నంపేట, సరుబుజ్జిలి మండలం నందికొండకు చెందిన కొంతమంది ఓటర్లు ఉన్నారు. వారు చిగురువలసలోని 186 కేంద్రంలో ఓట్లు తొలగించాలని దరఖాస్తు చేసినా తుదిజాబితాలో కొనసాగడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు.

Updated Date - Jan 28 , 2024 | 11:28 PM