Share News

దువ్వాడపై ఆరు కేసులు..

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:11 AM

టెక్కలి వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై ఆరు కేసులు ఉన్నాయి. శుక్రవారం నామినేషన్‌ సందర్భంగా టెక్కలిలో రిటర్నింగ్‌ అధికారి నూరుల్‌ కమర్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో తనపై ఆంధ్రాలో నాలుగు కేసులు, ఒడిశాలో రెండు కేసులు ఉన్నట్లు దువ్వాడ వెల్లడించారు.

దువ్వాడపై ఆరు కేసులు..
టెక్కలిలో దువ్వాడ నామినేషన్‌ సందరర్భంగా వైన్‌షాప్‌ వద్ద మందుబాబుల సందడి

- ఆంధ్రాలో నాలుగు, ఒడిశాలో రెండు

- వీటితోపాటు ఒడిశా ఐటీ, కమర్షియల్‌ ట్యాక్స్‌కు సంబంధించి మరో రెండు..

- ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించిన శ్రీనివాస్‌

టెక్కలి, ఏప్రిల్‌ 19: టెక్కలి వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై ఆరు కేసులు ఉన్నాయి. శుక్రవారం నామినేషన్‌ సందర్భంగా టెక్కలిలో రిటర్నింగ్‌ అధికారి నూరుల్‌ కమర్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో తనపై ఆంధ్రాలో నాలుగు కేసులు, ఒడిశాలో రెండు కేసులు ఉన్నట్లు దువ్వాడ వెల్లడించారు. ఈ కేసులన్నీ విచారణలో ఉన్నాయి. 2011 నౌపడా పోలీస్‌స్టేషన్‌లో ప్రభుత్వ అధికారులపై దురుసుగా ప్రవర్తించినందుకు కేసు నమోదు కాగా, 2018లో పోలీసులు చార్జ్‌షీట్‌ ఫైల్‌ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను అవమానించడం, బెదిరించడం వంటి సంఘటనలకు సంబంధించి 2011లో సంతబొమ్మాళి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మరో కేసు నమోదు కాగా 2019లో చార్జ్‌షీట్‌ నమోదు చేశారు. 2011 నౌపడా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ప్రభుత్వ అధికారులపై దురుసుగా ప్రవర్తించినందుకు మరో కేసు నమోదుకాగా, 2020లో చార్జ్‌షీట్‌ వేశారు. నౌపడా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 2011లో ప్రభుత్వ ఉద్యోగులను గాయపరిచినందుకు మరో కేసు నమోదుకాగా ఇది కోటబొమ్మాళి ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ పరిధిలో 2017లో చార్జ్‌షీట్‌ వేశారు.

- ఇక ఒడిశాలోని గజపతి జిల్లా పర్లాఖిమిడిలో 2010లో గనులు, భూగర్భశాఖకు పన్నులు ఎగవేయడంతో ఈ కేసు పర్లాఖిమిడి కోర్టులో నడుస్తోంది. విజిలెన్స్‌ జడ్జి, బరంపురం కోర్టు నందు 2012లో ప్రోపర్టీస్‌ చీటింగ్‌పై మరోకేసు నమోదైంది. ఈ ఆరు కేసులు విచారణలో ఉన్నట్లు వెల్లడించారు. ఒడిశాలో ఐటీకి సంబంధించి రూ.18లక్షల బకాయిపై ఓ కేసు ఉందని, అలాగే కమర్షియల్‌ ట్యాక్స్‌కు సంబంధించి రూ.16.86లక్షల చెల్లింపులకు సంబంధించి మరో కేసు ఉందని తెలిపారు.

- తన చేతిలో నగదు రూ.15లక్షలు ఉందని, నరసన్నపేట యాక్సిక్‌ బ్యాంక్‌లో రూ.1.22 లక్షలు, టెక్కలి బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.76.47 లక్షలు, టెక్కలి ఎస్‌బీఐలో రూ.64లక్షల వరకు ఉందని తదితర ఆస్తుల వివరాలను దువ్వాడ వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా దైడిగాం వద్ద 45సెంట్ల ప్లాటు, 72సెంట్ల ప్లాటు ఉన్నాయని తెలిపారు. వెంకటేశ్వర కాలనీలో రూ.29లక్షలు విలువైన ఇల్లు, శ్యామసుందరాపురంలో రూ.25లక్షలు విలువచేసే రెండు ఇళ్లు ఉన్నాయని, ప్రస్తుతం తాను టెక్కలి సమీపంలో రూ.2కోట్లతో ఇల్లు నిర్మిస్తున్నానని తెలిపారు. అలాగే అప్పులను కూడా అఫిడవిట్‌లో వివరించారు.

ర్యాలీలో మందుబాబుల హల్‌చల్‌

దువ్వాడ శ్రీనివాస్‌ నామినేషన్‌ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో మందుబాబులు సందడి చేశారు. వైసీపీ కార్యకర్తలు మద్యం దుకాణాల వద్ద కిక్కిరిసి కనిపించారు. ఓ వైపు నామినేషన్‌కు సంబంధించిన సభ అంబేడ్కర్‌ జంక్షన్‌ వద్ద జరుగుతుండగానే.. కొంతమంది మద్యం దుకాణాలకు తరలిపోయారు. అలాగే టెక్కలి మేజర్‌ పంచాయతీలో మహిళలు కూడా నామినేషన్‌ ర్యాలీకి తరలివచ్చేలా వైసీపీ నేతలు డబ్బులు పంపిణీ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

Updated Date - Apr 20 , 2024 | 12:11 AM