Share News

సీతారామా... ఓటమి ఖాయమా!

ABN , Publish Date - May 21 , 2024 | 11:54 PM

రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నా.. ఆమదాలవలస నియోజకవర్గాన్ని కనీసస్థాయిలో పట్టించుకోకపోవడం, ఇచ్చిన హామీలేవీ నెరవేర్చకపోవడంతో స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ తీరుపై ప్రజలు గుర్రుగా ఉన్నారు. ఆ కోపాన్ని ఈ సారి ఎన్నికల్లో చూపి.. వైసీపీకి వ్యతిరేకంగా ఓటేశారని.. సీతారామ్‌ ఓటమి ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. సొంతపార్టీలోనే అసమ్మతి.. స్పీకర్‌ తీరుకు నిదర్శనమని.. ఈసారి ఎన్నికల్లో తమ విజయానికి ఢోకా లేదని ఎన్డీయే కూటమి నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సీతారామా... ఓటమి ఖాయమా!

- స్పీకర్‌ పదవి వరించినా.. ఆమదాలవలసలో అభివృద్ధి శూన్యం

- నెరవేర్చని ఎన్నికలకు ముందు, తర్వాత ఇచ్చిన హామీలు

- తమ్మినేని గెలుపుపై వైసీపీ నాయకుల్లోనే సందేహాలు

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం/ ఆమదాలవలస)

రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నా.. ఆమదాలవలస నియోజకవర్గాన్ని కనీసస్థాయిలో పట్టించుకోకపోవడం, ఇచ్చిన హామీలేవీ నెరవేర్చకపోవడంతో స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ తీరుపై ప్రజలు గుర్రుగా ఉన్నారు. ఆ కోపాన్ని ఈ సారి ఎన్నికల్లో చూపి.. వైసీపీకి వ్యతిరేకంగా ఓటేశారని.. సీతారామ్‌ ఓటమి ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. సొంతపార్టీలోనే అసమ్మతి.. స్పీకర్‌ తీరుకు నిదర్శనమని.. ఈసారి ఎన్నికల్లో తమ విజయానికి ఢోకా లేదని ఎన్డీయే కూటమి నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

- తమ్మినేని సీతారాం ఆమదాలవలస నియోజకవర్గం నుంచి 1983లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి.. తర్వాత టీడీపీలో చేరారు. 1985లో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. 1994, 1999లో టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. కీలకమైన మంత్రి పదవులు నిర్వర్తించారు. రాజకీయంగా ఉన్నతస్థాయికి చేరుకున్నారు. 2004లో ఓటమి తర్వాత.. 2009లో టీడీపీని వీడి ప్రజారాజ్యంలో చేరారు. పీఆర్పీ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లకే పీఆర్పీని వీడి మళ్లీ టీడీపీలో చేరారు. ఆతర్వాత టీడీపీని వీడి వైసీపీలో చేరి.. 2014లో పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2019లో ఆమదాలవలస వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. వైఎస్‌ జగన్‌కు ప్రజలు ఇచ్చిన ఒక్కచాన్స్‌తో తమ్మినేని సీతారాం కూడా గెలుపొందారు. ఆయనకు జగన్‌ స్పీకర్‌ పదవి కట్టబెట్టగా.. నియోజకవర్గం అన్నివిధాలా అభివృద్ధి చెందుతుందని ప్రజలంతా భావించారు. కానీ ఐదేళ్లలో కనీస స్థాయిలో అభివృద్ధి చేపట్టలేదు. ఇచ్చిన హామీలు కూడా సక్రమంగా నెరవేర్చలేదు. దీంతో స్పీకర్‌ తీరుపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

- ప్రధానంగా గతుకులమయంగా.. నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారిన ఆమదాలవలస- శ్రీకాకుళం రోడ్డును బాగుచేయలేకపోయారని స్థానికులు ఆవేదనం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డుపై ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరూ.. మనకు బుద్ధి ఉంటే.. ఈ సారి ఎన్నికల్లో తమ్మినేనికి మళ్లీ ఓటు వేయరాదని నిర్ణయించుకున్నారు.

- ఆమదాలవలసలో చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని.. తమ్మినేనితో పాటు గత ఎన్నికల ముందు వైఎస్‌ జగన్‌ కూడా హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకూ దానిని తెరిపించే ప్రయత్నం చేయలేదని.. హామీ ఉత్తిమాటేనని ప్రజలు అసంతృప్తి చెందారు.

- నియోజకవర్గంలో ‘వి-ట్యాక్స్‌’తో ప్రజలు మరింత విసిగిపోయి.. టీడీపీ వైపు ఆదరణ చూపారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీకి వలసలు బాగా పెరిగాయి.

- ఆమదాలవలస, పొందూరు, బూర్జ మండలాల్లో భారీస్థాయిలో వైసీపీని వీడి కూన రవికుమార్‌ సమక్షంలో పలువురు టీడీపీలో చేరారు. దీంతో సీతారామా.. ఓటమి ఖాయమన్న మాటలు.. ఎన్నికల ముందునుంచే వినిస్తున్నాయి. ఇప్పుడు మరింత జోరందుకున్నాయి. స్పీకర్‌ గెలుపుపై వైసీపీ నాయకుల్లోనూ సందేహాలు నెలకొన్నాయి.

- రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉంటూ విమర్శలు..

స్పీకర్‌ అంటేనే రాజ్యాంగబద్ధమైన పదవి. ఆచితూచి మాట్లాడి పదవి గౌరవాన్ని కాపాడాలి. కానీ తమ్మినేని ఈ విషయంలో స్పీకర్‌ కంటే.. తాను ఆమదాలవలస ఎమ్మెల్యేని అని చెప్పుకుంటూ తన స్థాయిని తగ్గించుకునేవారు. వైసీపీ నాయకులు కొడాలి నాని, జోగి రమేష్‌, అంబటి రాంబాబు, రోజా మాదిరిగా ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేసేవారు. గౌరవప్రదమైన స్థానంలో ఉన్నా.. చంద్రబాబును తిట్టేందుకు వెనకడుగు వేయలేదు. గతంలో టీడీపీలో కీలక పదవులు పొందినా.. అవన్నీ మరిచి.. రాజకీయ విమర్శలు చేస్తూ.. మరింత చులకనయ్యారని పలువురు పేర్కొంటున్నారు.

- సొంతపార్టీ నేతల నుంచే అసమ్మతి

స్పీకర్‌ సీతారాం.. సొంత పార్టీ నేతల నుంచే అసంతృప్తిని మూటకట్టుకున్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో ఏకంగా నాలుగు వర్గాలుగా వైసీపీ నాయకులు విడిపోయారు. ఇందులో కళింగ సామాజికవర్గానికి చెందిన సువ్వారి గాంధీ.. వైసీపీలో పదవులకు రాజీనామా చేసి.. తన వర్గంతో వేరుకుంపటి పెట్టారు. ఇండిపెండెంట్‌ గా ఎన్నికల్లో పోటీచేశారు. ఈ క్రమంలో వైసీపీ ఓట్లు కొంతమేర చీలి.. తమ్మినేని ఓటమికి సువ్వారి గట్టిగా శ్రమించారని విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీ చేపట్టిన సర్వేలో కూడా ఆమదాలవలస నియోజకవర్గంలో అవినీతి, అసంతృప్తి అధికమైందని వెల్లడైనట్లు సమాచారం. కానీ సరైన అభ్యర్థి లేక మళ్లీ సీతారామ్‌కే జగన్‌ టికెట్‌ కేటాయించి.. బరిలో దింపారు. కాగా.. వైసీపీలో వర్గవిభేదాలు ఓ వైపు ఉండగా. మరోవైపు టీడీపీతోపాటు జనసేనకు కూడా ఓటు బ్యాంకు పెరిగింది. ఈ క్రమంలో గత ఎన్నికల్లో 9.33 శాతం ఓట్లతో ఓటమి పాలైన.. టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్‌కు.. ఇప్పుడు భారీమెజార్టీ లభిస్తుందని పలువురు పందెం కాస్తున్నారు. ఈసారి కూన రవికి మంత్రి పదవి ఖాయమని.. మరికొందరు బెట్టింగ్‌లు వేస్తున్నారు. ఫలితాల కోసం మరో 13రోజులు వేచిచూడాల్సిందే.

సభాపతులకు పరాజయమే!

రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో సభాపతిగా విధులు నిర్వహించి.. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన చాలా మంది అభ్యర్థులకు పరాజయమే ఎదురైంది. ఈ నేపథ్యంలో ఈ సారీ ఆ సెంటిమెంట్‌ కొనసాగుంతుందో.. లేదోనన్న చర్చ సాగుతోంది. ఆమదాలవలస నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి.. స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌కు ఓటమి తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 1956 సంవత్సరం నుంచి 2014 వరకు అసెంబ్లీ స్పీకర్లుగా వ్యవహరించిన రాజకీయ నేతలంతా.. పదవి అనంతరం జరిగిన ఎన్నికల్లో ఓటమి చవిచూసిన దాఖలాలు ఎక్కువగా ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తొలి శాసనసభాపతి అయ్యదేవర కాలేశ్వరరావు 1956 నుంచి 1962 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. 1962లో శాసనసభకు మళ్లీ ఎన్నికయ్యారు. కానీ ఫలితాలకు ముందే ప్రాణాలు కోల్పోయారు. రెండో స్పీకర్‌గా బీవీ సుబ్బారెడ్డి 1962 నుంచి 1970 వరకు కొనసాగారు. వారి తర్వాత శాసనసభాపతులుగా కొనసాగిన కె.వి.వేమారెడ్డి, పి.రంగారెడ్డి, ఆర్‌.దశరథరామిరెడ్డి, డి.కొండయ్య చౌదరి, కె.ప్రభాకరరావు, ఏ.ఈశ్వర్‌రెడ్డి, తంగి సత్యనారాయణ, ఎన్‌.వెంకటరత్నం, పి.రామచంద్రారెడ్డి.. తక్కువ కాలం స్పీకర్‌ పదవి చేపట్టారు. జి.నారాయణరావు, డి.శ్రీపాదరావు, యనమల రామకృష్ణుడు, కె.ప్రతిభాభారతి, కె.ఆర్‌.సురేష్‌రెడ్డి ఐదేళ్లపాటు పూర్తిస్థాయి స్పీకర్లుగా వ్యవహరించారు. 2009 ఎన్నికల్లో నల్లూరి కిరణ్‌కుమార్‌రెడ్డి రెండేళ్లుగా స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన అనంతరం నాదెండ్ల మనోహర్‌ స్పీకర్‌గా వ్యవహరించారు. 2014 నుంచి 2019 వరకు కోడెల శివ ప్రసాద్‌ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. వీరంతా స్పీకర్లు బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎన్నికల్లో పోటీ చేయగా.. చాలా మంది ఓటమి చెందారు. 2019 ఎన్నికల్లో కోడెల శివప్రసాద్‌ కూడా ఓడిపోయారు. 2019 నుంచి స్పీకర్‌గా వ్యవహరిస్తున్న తమ్మినేని సీతారాం.. ఈసారి ఎన్నికల్లో మళ్లీ అదే నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఈ ఐదేళ్లు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి ఆయన ఓటమి తప్పదని.. ‘స్పీకర్ల ఓటమి’ సెంటిమెంట్‌ కొనసాగడం ఖాయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

-------------------------------------------------------------------------

2019లో పార్టీల వారీగా పోలైన ఓట్లు..

-------------------------------------------------------------------------

అభ్యర్థి పార్టీ లభించిన ఓట్లు

-------------------------------------------------------------------------

తమ్మినేని సీతారాం వైసీపీ 77,897 (51.91ు)

కూన రవికుమార్‌ టీడీపీ 63,906 (42.58ు)

పి. రామ్మోహన్‌రావు జనసేన 3,280 (2.19ు)

నోటా నోటా 2656 (1.77ు)

బొడ్డేపల్లి సత్యవతి కాంగ్రెస్‌ 993 (0.66ు)

పాతిని గడ్డయ్య బీజేపీ 956 (0.64ు)

టి సతీష్‌కుమార్‌ స్వతంత్ర 383 (0.26ు)

-------------------------------------------------------------------------

మొత్తం 1,50,071 (79.12ు)

-------------------------------------------------------------------------

Updated Date - May 21 , 2024 | 11:54 PM