Share News

సీదిరి సార్‌.. ఐదేళ్లు సరిపోలేదా?

ABN , Publish Date - May 03 , 2024 | 12:17 AM

మందస మేజరు పంచాయతీలో రోడ్డు విస్తరణ పనులు ఐదేళ్లు గడిచినా పూర్తి కాలేదు. రోడ్డుకు ఇరువైపులా కాలువల నిర్మాణం, సెంటర్‌ విద్యుత్‌ దీపాల ఏర్పాటు, తదితర పనులు పెండింగ్‌లో ఉన్నాయి.

సీదిరి సార్‌.. ఐదేళ్లు సరిపోలేదా?

- పూర్తికాని మందస రోడ్డు విస్తరణ పనులు

- అరకొరగా విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు

- వాటికి దీపాలు అమర్చని వైనం

- కాలువలూ నిర్మించలేదు..

- ప్రజలకు తప్పని ఇబ్బందులు

(మందస)

మందస మేజరు పంచాయతీలో రోడ్డు విస్తరణ పనులు ఐదేళ్లు గడిచినా పూర్తి కాలేదు. రోడ్డుకు ఇరువైపులా కాలువల నిర్మాణం, సెంటర్‌ విద్యుత్‌ దీపాల ఏర్పాటు, తదితర పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆరు నెలలుగా ఈ పనులు ఆగిపోయాయి. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే మందస రోడ్డు విస్తరణకు అడుగులు పడ్డాయి. పనులకు రూ.4కోట్లు మంజూరయ్యాయి. అప్పటి ఎమ్మెల్యే గౌతు శ్యామసుందరశివాజీ, అచ్చెన్నాయుడు శంకుస్థాపన చేశారు. ఇంతలో ఎన్నికల కోడ్‌ రావడంతో పనులు నిలిచిపోయాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ అదే రోడ్డుకు ఎమ్మెల్యే స్థాయిలో సీదిరి అప్పలరాజు శంకుస్థాపన చేశారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నుంచి జూనియర్‌ కళాశాల వరకూ అన్ని హంగులతో రోడ్డు నిర్మించనున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే ఐదేళ్లవుతున్నా పనులు మాత్రం పూర్తికాలేదు. రోడ్డును నిర్మించినా మిగతా పనులను విడిచిపెట్టారు. రోడ్డుకు ఇరువైపులా మురుగు కాలువలు అస్తవ్యస్తంగా ఉన్నా ఆధునికీకరించలేదు. డివైడర్లు ఏర్పాటు చేసి విద్యుత్‌ స్తంభాలు వేసినా వాటికి దీపాలు అమర్చలేదు. అలాగే, డివైడర్లకు గ్రిల్స్‌ ఏర్పాటు చేసి అందులో మొక్కలు నాటి సుందరంగా తీర్చిదిద్దుతామని చేసిన ప్రకటన సైతం కార్యరూపం దాల్చ లేదు. ప్రస్తుతం రోడ్డుకు ఇరువైపులా కొందరు ఆక్రమంచి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దీంతో దుకాణాలకు వచ్చేవారు వాహనాల పార్కింగ్‌కు అవస్థలు పడుతున్నారు.

అభివృద్ధి కానరావడం లేదు

పేరుకు మేజరు పంచాయతీ. కానీ, ఎక్కడా అభివృద్ధి కానరావడం లేదు. పూర్తిస్థాయిలో తాగునీరందడం లేదు. జూనియర్‌ కళాశాల కూడలి నుంచి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వరకూ డివైడర్లు ఏర్పాటు చేసి విద్యుత్‌ స్తంభాలు వేసినా లైట్లు వేయ లేదు.

-రాజాన మహేష్‌, టీడీపీ నాయకుడు, మందస

పనులు పూర్తికాలేదు

2019 శాసనసభ ఎన్నికల ముందు రూ.4కోట్లు టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసింది. అదే సంవత్సరం ఎన్నికలు రావడంతో పనులు ఆగిపోయాయి. అనంతరం గెలుపొందిన ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు మళ్లీ శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టినా పూర్తి చేయలేకపోయారు.

-డొంకూరు తిరుపతి, మాజీ సర్పంచ్‌, మందస

Updated Date - May 03 , 2024 | 12:17 AM