Share News

సిక్కోలులో సెజ్‌

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:39 AM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపడుతున్న శంఖారావం యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. తొలిరోజు ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాల్లో సభలు విజయవంతమయ్యాయి.

సిక్కోలులో సెజ్‌
శ్రీకాకుళం శంఖారావం సభలో మాట్లాడుతున్న లోకేశ్‌, హాజరైన ప్రజలు, టీడీపీ-జనసేన శ్రేణులు

- అధికారంలోకి రాగానే ఏర్పాటు చేస్తాం

- పరిశ్రమలను ఇక్కడికే తీసుకుని వస్తాం

- యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు

- జిల్లా నుంచి వలసలు నివారిస్తాం

- నధుల అనుసంధానం పూర్తి చేస్తాం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపడుతున్న శంఖారావం యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. తొలిరోజు ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాల్లో సభలు విజయవంతమయ్యాయి. రెండో రోజు సోమవారం నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాలవలస నియోజకవర్గాల్లో శంఖారావం యాత్ర నిర్వహించగా.. ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వైసీపీ అరాచక పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, రానున్నది టీడీపీ-జనసేన ప్రభుత్వమేనంటూ లోకేశ్‌ భరోసా ఇచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి తాను ప్రత్యేక బాధ్యత వహిస్తానంటూ స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టనున్న అభివృద్ధి పనులు, అమలు చేయనున్న పథకాల గురించి వివరిస్తూ ప్రజల భవిష్యత్‌కు గ్యారెంటీ ఇచ్చారు.

.............................

‘ఎన్నెన్నో చెప్పి అధికారంలోకి వచ్చారు. గద్దెనెక్కగానే అవన్నీ మర్చిపోయారు. దోచుకోవడమే పరమావధిగా పెట్టుకున్నారు. జిల్లా ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారు. మోసం చేశారు. మేము అధికారంలోకి రాగానే ఇక్కడ సెజ్‌ ఏర్పాటు చేస్తాం. పరిశ్రమలను ఇక్కడికే తీసుకుని వస్తాం. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. సిక్కోలు నుంచి వలసలు నివారిస్తాం’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. ‘శంఖారావం’ కార్యక్రమంలో భాగంగా సోమవారం నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాలవలస నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. జిల్లాలో నదుల అనుసంధానానికి తట్టెడు మట్టి కూడా మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు వేయలేకపోయారని, టీడీపీ-జనసేన కార్యకర్తలు రాబోయే రెండు నెలలుపాటు ప్రజల్లోకి వెళ్లి వైసీపీ అరాచకాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

‘టీడీపీ ప్రభుత్వ హయాంలో శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట నియోజకవర్గాలను రూ.3600 కోట్లతో అభివృద్ధి చేశాం. జగన్‌ పాదయాత్రలో జిల్లాకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. నాగావళి కరకట్ట పనులకు తట్టెడు మట్టి వేయలేకపోయారు. ఆమదాలవలస చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని హామీ ఇచ్చి.. విస్మరించారు. విశాఖ రైల్వేజోన్‌కు కనీసం 53 ఎకరాలు భూమి కూడా ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రైవేటు వ్యక్తులతో జగన్‌ ఒప్పందం చేసుకుని స్టీల్‌ప్లాంట్‌నే విక్రయించాలని చూస్తున్నారు. టీడీపీ, జనసేన అధికారంలోకి రాగానే నదుల అనుసంధానాన్ని పూర్తిచేస్తాం. నాగావళి నదిపై, వంశధార నదిపై పురుషోత్తపురం వద్ద వంతెనలు ఏర్పాటు చేస్తాం. పరిశ్రమలు తీసుకువచ్చి స్థానికంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం’ అని హామీ ఇచ్చారు. తమ మధ్య చిచ్చు పెట్టేందుకు పేటీఎం బ్యాచ్‌లు ప్రయత్నిస్తున్నాయని, టీడీపీ, జనసేన కలసి సైకో పాలనను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం నియోజకవర్గ ఇన్‌ఛార్జిలతో కార్యకర్తలు, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుఉ కూన రవికుమార్‌, పార్లమెంట్‌ సభ్యులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, మాజీమంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, మాజీఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, శ్రీకాకుళం మాజీఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, టీడీపీ జోన్‌ 1 కో ఆర్డినేటర్‌ దామచర్ల సత్య, మీడియా కో ఆర్డినేటర్‌ బీవీ వెంకటరాముడు, సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు గొండు శంకర్‌, జనసేన జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్‌, శ్రీకాకుళం టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌, వేలాదిగా కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో సభ అనంతరం జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు గొండు శంకర్‌.. గజమాలతో నారా లోకేష్‌ను సత్కరించారు.

Updated Date - Feb 13 , 2024 | 12:39 AM