Share News

సెక్టార్‌ అధికారులు బాధ్యతతో పనిచేయాలి

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:06 AM

ఎన్నికల విధుల్లో సెక్టార్‌ అధికారులు బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ ఆదేశించారు. గురువారం జలుమూరు, సారవకోట మండలాల్లోని రెవెన్యూ కార్యాలయాల్లో సెక్టార్‌ అధికారులతో సమీక్షించారు.

సెక్టార్‌ అధికారులు బాధ్యతతో పనిచేయాలి
జలుమూరులో ఎన్నికల సెక్టార్‌ అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌

- కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌

- ఎంసీసీ కృష్ణారావు పనితీరుపై అసంతృప్తి

జలుమూరు, మార్చి 28: ఎన్నికల విధుల్లో సెక్టార్‌ అధికారులు బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ ఆదేశించారు. గురువారం జలుమూరు, సారవకోట మండలాల్లోని రెవెన్యూ కార్యాలయాల్లో సెక్టార్‌ అధికారులతో సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ‘పోలింగ్‌ సిబ్బంది.. మండల కేంద్రం నుంచి పోలింగ్‌ కేంద్రాలకు సకాలంలో చేరుకుని తిరిగి వెళ్లే వరకూ సెక్టార్‌ అధికారులదే బాధ్యత. పోలింగ్‌ కేంద్రాల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలి. 85 ఏళ్లు దాటి.. దివ్యాంగ ధ్రువీకరణ పత్రం ఉన్న దివ్యాంగులు ఇంటివద్దనే ఓటు వేసేలా అవకాశం కల్పించాలి. జలుమూరు మండలంలో 80శాతం కన్నా తక్కువ పోలింగ్‌ అయ్యే గ్రామాలు 26 ఉన్నాయి. పోలింగ్‌ శాతం పెంచేలా ఓటర్లకు అవగాహన కల్పించాలి’ అని ఆదేశించారు. సమావేశానికి గైర్హాజరైన ఎంసీసీ కృష్ణారావుపై అసంతృప్తి వ్యక్తం చేసారు. జిల్లా కార్యాలయానికి వచ్చి కృష్ణారావు సంజాయిషీ ఇవ్వాలని తహసీల్దారు నాగమ్మకు సూచించారు.

- చల్లవానిపేట గుంజుమెట్ట వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌తో కలెక్టర్‌ మాట్లాడారు. అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని సూచించారు. కాగా.. రోజుకు రెండు షిఫ్ట్‌ల విధులు కష్టంగా ఉందని ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై ఎస్పీతో మాట్లాడి.. చర్యలు చేపడతామన్నారు. అలాగే సారవకోట ఉన్నత పాఠశాలలో పోలింగ్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో నరసన్నపేట ఆర్వో జీవీఎస్‌ రామ్మోహనరావు, తహసీల్దార్లు సీహెచ్‌ నాగమ్మ, భాగ్యమతి, డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీనివాసరావు, ఎంపీడీవోలు ఏ.దామోధరరావు, రాంబాబు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2024 | 12:06 AM