Share News

రూపాయి ఖర్చుచేస్తే ఒట్టు!

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:31 PM

సునాముది గెడ్డపై రాజుల కాలంలో నిర్మించిన లోగయి ఆనకట్ట వైసీపీ పాలకుల నిర్లక్ష్యానికి గురవుతోంది.

 రూపాయి ఖర్చుచేస్తే ఒట్టు!
అభివృద్ధికి నోచుకోని లోగాయి ప్రధాన ఆనకట్ట

-లోగయి ఆనకట్టపై సర్కారు నిర్లక్ష్యం

-పిచ్చిమొక్కలతో నిండిన కాలువలు

- దెబ్బతిన్న షటర్లు.. రైతులంటే అలుసా?

-సాగునీరు అందక ప్రతి ఏటా నష్టాలే

- కన్నెత్తిచూడని మంత్రి అప్పలరాజు

(హరిపురం)

మండలం: మందస

సాగునీటి వనరు: లోగయి ఆనకట్ట

నిర్మాణం: సునాముది గెడ్డపై గోవిందపురం వద్ద

ఆయకట్టు: సుమారు 4,500 ఎకరాలు

సునాముది గెడ్డపై రాజుల కాలంలో నిర్మించిన లోగయి ఆనకట్ట వైసీపీ పాలకుల నిర్లక్ష్యానికి గురవుతోంది. సుమారు పన్నెండు గ్రామాల పరిధిలో 4,500 ఎకరాలకు సాగునీరం దించే ఆనకట్ట కనీస మరమ్మతులకు నోచుకోవడం లేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏడేళ్ల కిందట నీరు-చెట్టు కింద రూ.20 లక్షలతో లోగయి ఆనకట్టకు మరమ్మతులు చేశారు. 2019లో తితలీ తుఫాన్‌తో ఆనకట్ట షట్టర్లు విరిగిపోవడంతో పాటు కాలువలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రస్తుతం ఈ కాలువల ద్వారా చుక్కనీరు ప్రవహించని దుస్థితి నెలకొంది. శివారు భూములు కరవు కోరల్లో చిక్కుకుంటున్నాయి. రైతు ప్రభుత్వంగా చెప్పుకున్న వైసీపీ ప్రభుత్వం కాలువల అభివృద్ధికి ఐదేళ్లుగా కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు.

ఇదీ ఆనకట్ట పరిస్థితి..

గోవిందపురం వద్ద సునాముది గెడ్డపై 500 మీటర్ల పొడవుతో, నాలుగు భాగాలుగా విభజించి లోగయి ఆనకట్టను రాజుల కాలంలో నిర్మించారు. దీనిద్వారా మందస మండలంలోని గోవిందపురం, కొత్తపల్లి, వీవీఆర్‌పురం, టి.శాసనాం, ముకుందపురం, సోంపేట మండలంలోని అనంతపురం, మూలూరు, గొల్లూరు తదితర 15 గ్రామాల్లో 4,500 ఎకరాల ఆయకట్టుకు గతంలో రెండు పంటలకు పుష్కలంగా నీరందేది. తితలీ తుఫాన్‌ తర్వాత ఐదేళ్లుగా ఎటువంటి మరమ్మతులకు నోచుకోకపోవ డంతో ఆనకట్ట శిథిలావస్థకు చేరింది. దీంతో నీరు నిల్వ ఉండడం లేదు. షట్టర్లు సైతం తుప్పు పట్టిపోయాయి. ఫలితంగా సునాముది గెడనీరు వృథాగా సముద్రంలో కలిసిపోతోంది. దీంతో వేలాది ఎకరాల శివారు ఆయకట్టుకు నీరందక ఏళ్లగా కరవు కోరల్లో చిక్కుకుంటున్నాయి. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి చివరి తడులకు నీరందక రైతన్నలు ధైన్యపరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

మరమ్మతులకు నోచుకోని షట్టర్లు

లోగయి ఆనకట్టను మంత్రి సీదిరి అప్పలరాజు కనీసం ఐదేళ్లలో ఒక్కసారి కూడా పరిశీలించలేదు. కొత్తపల్లిలో ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించేందుకు మంత్రి వచ్చిన సమయంలో ఆనకట్ట సమస్యను స్థానిక రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయలేదు. నాలుగు భాగాలుగా ఉన్న ఆనకట్టు ఒక్క భాగం మాత్రమే ఏడేళ్లు కిందట మరమ్మతులకు నోచుకుంది. అప్పట్లో నీరు-చెట్టు కింద సుమారు రూ.20లక్షలతో పనులు జరిపి తాత్కాలిక ఉపశమనం కలిగించారు. రెండో విడత నీరు-చెట్టు పథకం కింద రూ.రెండు కోట్లు మంజూరుకు ప్రతిపాదనలు చేశాయి, అయితే ప్రభుత్వం మారడంతో నిధులు మంజూరు కాలేదు. దీంతో షట్టర్లు మరమ్మతులకు నోచుకోలేదు.

తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం

ఆనకట్ట షట్టర్లు విరిగిపోవడంతో నీరు వృథాగా పోతోంది. దీంతో మదుములు, తూముల వద్ద ఇసుక బస్తాలు నింపి అడ్డగా వేస్తున్నాం. నీటి ప్రవాహం ఎక్కువైతే ఆనకట్టలో దిగేందుకు సాహసం చేయాల్సి వస్తుంది. తూములు సైతం మధ్యలో ఉన్నాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

- కుమార్‌, ఆయకట్టు రైతు, బిన్నల

షట్టర్లు ఏర్పాటు చేయాలి

వైసీపీ ప్రభుత్వం రైతుల సమస్యలను కనీసం పట్టించుకోలేదు. లోగయి ఆనకట్ట మదుములకు పూర్తిస్థాయిలో షట్టర్లు ఏర్పాటు చేయాలి. దెబ్బతిన్న షట్టర్లను బాగు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి. ఇప్పటికైనా శివారు భూములకు నీరందించాలి.

- కొర్ల హేమారావుచౌదరి, రైతు సంఘప్రతినిధి, మందస

Updated Date - Apr 26 , 2024 | 11:31 PM