Share News

నేటి నుంచి ఇసుక ఉచితం

ABN , Publish Date - Jul 08 , 2024 | 12:17 AM

ప్రజలకు ఇసుక కష్టాలు తీరనున్నాయి. సోమవారం నుంచి ఉచితంగా పంపిణీ చేసేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

నేటి నుంచి ఇసుక ఉచితం

- టన్ను రూ.340 మాత్రమే

- పేదలకు తీరనున్న కష్టాలు

- నిర్మాణ రంగానికి ఊతం

- అక్రమాలపై ఫిర్యాదుకు టోల్‌ఫ్రీ నెంబర్లు ఏర్పాటు

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

ప్రజలకు ఇసుక కష్టాలు తీరనున్నాయి. సోమవారం నుంచి ఉచితంగా పంపిణీ చేసేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే జిల్లాలో ఉన్న ఆరు రీచ్‌ల్లో తవ్వకాలు చేపట్టనున్నారు. కొత్తగా మరో ఆరు రీచ్‌లను అధికారులు గుర్తించారు. త్వరలో ఇక్కడ కూడా ఇసుక తవ్వకాలు చేపట్టి ప్రజలకు అందించనున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో నిర్మాణ రంగం తీవ్రంగా కుదేలైంది. జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రెండేళ్ల పాటు కనీసం ఇసుకను కూడా అందుబాటులో లేకుండా చేసేశారు. ఆ తర్వాత వైసీపీ నాయకులే బకాసురుల మాదిరిగా ఇసుక రీచ్‌లను పంచేసుకుని ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టి దోచుకున్నారు. పేరుకే ఓ సంస్థ నిర్వహణ బాధ్యతలు చూసినప్పటికీ వైసీపీ నాయకులే ఇసుక దందాకు పాల్పడేవారు. దీంతో సామాన్యులకు ఇసుక అందని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో ప్రజలకు ఇసుక కష్టాలు తొలుగుతున్నాయి. ఉచిత ఇసుక విధానం సోమవారం నుంచే అమల్లోకి రానుంది. ఈ మేరకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను జారీచేసింది.

టన్ను రూ.340

గత ప్రభుత్వ హయాంలో ఒక్కో డిపో నుంచి ఒక్కో విధంగా ఇసుక తరలింపునకు సంబంధించి రేట్లు ఉండేవి. ఉదాహరణకు టెక్కలి డిపో నుంచి టన్ను రూ.808 వసూలు చేసేవారు. ఇది పేరుకే అయినా.. వేల రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు కొత్త విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. జిల్లాలో ఎక్కడ నుంచైనా.. ఎంతవరకైనా ఒక మెట్రిక్‌ టన్నుకు కేవలం నిర్దిష్ట ధర రూ.340 మాత్రమే చెల్లించాలి. అంతకుమించి ఎటువంటి అదనపు రుసుం చెల్లించవసరంలేదు. ప్రస్తుతం జిల్లాలో రెండు డిపోల్లో మాత్రమే ఇసుక నిల్వ ఉంది. టెక్కలి డిపోలో 10వేల టన్నులు, అంగూరు డిపోలో 52 వేల టన్నులు మొత్తం 62వేల టన్నులు ఇసుక అందుబాటులో ఉంది. ఈ ఇసుకను మాత్రమే సోమవారం నుంచి అవసరమున్న వారికి పంపిణీ చేస్తారు. ఇదివరకు జేపీ సంస్థ అని, ఆతర్వాత మరో సంస్థకు వైసీపీ ప్రభుత్వం అప్పగించేసింది. అవన్నీ స్వాధీనం చేసుకుంటున్నారు అధికారులు.

రెవెన్యూ, పోలీసుశాఖలదే పర్యవేక్షణ

ఇసుక డిపోలు, రీచ్‌ల వద్ద అక్రమాలు జరగకుండా పర్యవేక్షించాల్సిన బాధ్యతను రెవెన్యూ, పోలీసు అధికారులకే ప్రభుత్వం అప్పగించింది వీఆర్వో, భూగర్భ గనుల శాఖ టెక్నికల్‌ అసిస్టెంట్‌, పోలీసు కానిస్టేబుల్‌ విధులు నిర్వహించాలి. తహసీల్దార్లు పర్యవేక్షించాలి. ఇసుక తరలింపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే చేపట్టాలి. తరువాత తవ్వకాలు చేపట్టరాదు. దీనివల్ల రాత్రిళ్లు అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వీలుంటుంది. ఇసుక తరలింపు పాయింట్ల వద్ద విద్యుత్‌ సదుపాయం, సీసీ కెమెరాలు, ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తారు. అలాగే నగదు చెల్లింపులు కూడా కేవలం క్యూఆర్‌ కోడ్‌ లేదా యూపీఐ యాప్‌ల ద్వారా చేపట్టాల్సిందే. ఇసుక తీసుకున్న వినియోగదారులకు తప్పనిసరిగా రశీదు ఇవ్వాల్సిందే. తొలి ప్రాధాన్యం ట్రాక్టర్లకు ఉంటుంది. తరువాతే ఆరు టైర్ల లారీలకు లోడింగ్‌కు అనుమతి ఇస్తారు. ముందుగా గృహ నిర్మాణాలకు, తర్వాత బిల్డర్లకు ఇసుక సరఫరా చేస్తారు.

కొత్తగా మరో ఆరు రీచ్‌లు..

జిల్లాలో వంశధార, నాగావళి నదుల పరిధిలోని అంబళ్ల వలస, నివగాం, బూరవెల్లి, గోపాలపెంట, హయతీనగరం, బట్టేరు వద్ద ఇదివరకే రీచ్‌లను గుర్తించారు. అలాగే కొత్తగా మరో ఆరు రీచ్‌లను అధికారులను గుర్తించారు. వీటికి కాలుష్య నియంత్రణా మండలి నుంచి కూడా అనుమతి లభించింది. త్వరలో కొత్తరీచ్‌ల్లో కూడా తవ్వకాలు జరగనున్నాయి. ఏమైనా అక్రమాలు జరిగితే ప్రజలు టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1800-425-6012కు, ల్యాండ్‌లైన్‌ నెంబర్‌ 08942-293229కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చు. అలాగే వాట్సాప్‌ (9701691657) ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.

Updated Date - Jul 08 , 2024 | 12:17 AM