వీరులకు వందనం
ABN , Publish Date - Oct 21 , 2024 | 12:12 AM
శాంతిభద్రతల పరిరక్షణలో వారి పాత్ర కీలకం.. ప్రజల ధన, ప్రాణ, రక్షణ వారి ప్రధాన విధి.. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఆపద కలిగినా తక్షణం స్పందించాల్సిన విభాగం వారిది.. తమ ప్రాణాలను పణంగా పెట్టి ఇతరులను కాపాడడంలో వారి పాత్ర ప్రధానం.. చోరీలను ఛేదించడమైనా, ప్రమాదా లను నివారించడంలోనైనా.. ప్రజాప్రతినిధులకు భద్రత కల్పించడంలో నైనా, అత్యవసర సమయా ల్లోనైనా వారి సేవలు కావాల్సిందే.. సంఘ విద్రోహ శక్తులను అదుపు చేస్తూ మావోయిస్టుల కదలికలను కనిపెడుతూ.. నిత్యం సవాళ్లను ఎదుర్కొంటున్న పోలీసు విభాగంలో విరోచితంగా పోరాడి చిరస్మ రణీయులైన వారు ఎందరో.. ఎందరెందరో.. వారి త్యాగాలు నాటికి, ఏనాటికీ మరువలేనివే.. చిరస్మరణీయమైనవే..
- మావోయిస్టులతో పోరాడి..
- నక్సల్ తూటాలకు, కూంబింగ్‌లో మృత్యువాత
- నేడు జాతీయ పోలీసు అమరవీరుల దినోత్సవం
శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): శాంతిభద్రతల పరిరక్షణలో వారి పాత్ర కీలకం.. ప్రజల ధన, ప్రాణ, రక్షణ వారి ప్రధాన విధి.. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఆపద కలిగినా తక్షణం స్పందించాల్సిన విభాగం వారిది.. తమ ప్రాణాలను పణంగా పెట్టి ఇతరులను కాపాడడంలో వారి పాత్ర ప్రధానం.. చోరీలను ఛేదించడమైనా, ప్రమాదా లను నివారించడంలోనైనా.. ప్రజాప్రతినిధులకు భద్రత కల్పించడంలో నైనా, అత్యవసర సమయా ల్లోనైనా వారి సేవలు కావాల్సిందే.. సంఘ విద్రోహ శక్తులను అదుపు చేస్తూ మావోయిస్టుల కదలికలను కనిపెడుతూ.. నిత్యం సవాళ్లను ఎదుర్కొంటున్న పోలీసు విభాగంలో విరోచితంగా పోరాడి చిరస్మ రణీయులైన వారు ఎందరో.. ఎందరెందరో.. వారి త్యాగాలు నాటికి, ఏనాటికీ మరువలేనివే.. చిరస్మరణీయమైనవే..
1959 అక్టోబరు 21న భారత్-చైనా మధ్య జరిగిన యుద్ధంలో దేశానికి చెందిన 10 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను శత్రు దేశానికి చెందిన వారు హతమార్చారు. నాటి నుంచి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లను స్మరిస్తూ దేశవ్యాప్తంగా జాతీయ పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. ఇదే కోవలో నక్సల్స్‌తో వీరోచితంగా పోరాడి అమరులైన జిల్లాకు చెందిన పలువురు పోలీసులను ఒకసారి స్మరించుకోవడం.. వారి త్యాగాలను మననం చేసుకోవడం ప్రతి ఒక్కరి విధి.. బాధ్యత.
నక్సల్స్ ఎదురుకాల్పుల్లో బలై..
జిల్లా చరిత్రలో తొలిసారి 1992వ సంవత్సరం నక్సల్స్ దాడిలో బలైన వ్యక్తి ఎస్.బంగారు నాయుడు. విజయనగరం జిల్లా డెంకాడ గ్రామానికి చెందిన ఈయన నాడు కాశీబుగ్గ ఎస్‌ఐగా విధుల్లో ఉన్నారు. మందస మండలం రట్టి- భేతాళపురం గ్రామాల మధ్య ఉన్న కొండల్లో నక్సలైట్లు ఉన్నారనే సమాచారంతో వారిని పట్టుకునేందుకు సిబ్బందితో వెళ్లిన బంగారునాయుడు 1992 మార్చి 24న ఉద్దానం దళానికి చెందిన నక్సలైట్ల కాల్పుల్లో మృతి చెందారు. బంగారునాయుడు పోలీసు శాఖలో 1989 జనవరిలో ఎస్‌ఐగా చేరారు. జిల్లాలోని బారువ, కాశీబుగ్గ స్టేషన్లలో విధులు నిర్వహించి ఉత్తమ అధికారిగా గుర్తింపు పొందారు.
రివాల్వర్‌తో వెనుక నుంచి కాల్చి..
సమాచార సేకరణలో ఆరితేరిన కానిస్టేబుల్ పి.కృష్ణమూర్తి 2000వ సంవత్సరంలో హరిపురంలో నక్సల్స్ రివాల్వర్‌తో వెనుక నుంచి కాల్చి చంపారు. సంతకవిటి మండలం వాల్తేరు గ్రామానికి చెందిన కృష్ణమూర్తి 1998లో కానిస్టేబుల్‌గా చేరారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్న సక్సల్స్ కార్య కలాపాలను అడ్డుకోవడం, వారి సమాచారం సేకరించడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. దీనిని జీర్ణించుకోలేక.. మావోయిస్టుల కదలికలపై కూంబింగ్ నిర్వహిస్తున్న కృష్ణమూర్తిని 2000 జూన్ 5న మందస మండలం హరిపురం కూడలిలో నక్సలైట్లు మాటువేసి కృష్ణమూర్తిని వెనుక నుంచి రివాల్వర్‌తో కాల్చి చంపేశారు. ఆయన భార్యకు జిల్లా పోలీసు కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా నియమించగా ఆమె విధులు నిర్వహిస్తున్నారు.
గుడి వద్ద మాటువేసి..
పీపుల్స్‌వార్ నక్సలైట్ల కదలికలను పసిగట్టి వారి అకృత్యాలను నిరోధించడంలో హెడ్ కానిస్టేబుల్ ఎం.నరేంద్రదాస్ కీలక పాత్ర పోషించారు. టెక్కలికి చెందిన నరేంద్రదాస్ 1976లో పోలీసు శాఖలో రూరల్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా చేరి, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ విభాగాల్లో సమర్ధవంతమైన సేవలందించారు. నక్సలైట్ల సమాచార సేకరణలో నిష్ణాతుడైన నరేంద్రదాస్ వారి ఉద్యమాలను నీరు గార్చారు. దీంతో 1997 మార్చి 17న కాశీబుగ్గలో ఓ గుడి వద్ద ఆరుగురు నక్సల్స్ మాటువేసి జరిపిన కాల్పుల్లో నరేంద్రదాస్‌ను పొట్టన పెట్టుకున్నారు. ఈయన సేవలను గుర్తించి కుమారుడు మనుకొండ శ్రీనివాస్ నాయుడుకి పోలీసు శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇచ్చారు.
బందోబస్తుకు వెళ్లి.. వీరోచితంగా పోరాడి..
కోటబొమ్మాళి మండలం జర్జంగి గ్రామానికి చెందిన అన్నెపు పాపారావు 1971లో పోలీసుశాఖలో కానిస్టేబుల్‌గా చేరి హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు. ప్రజల ధన, ప్రాణ రక్షణ, నక్సలైట్ల ఆగడాలను అడ్డుకోవడంలో విశేష పాత్ర పోషించారు. ధైర్యసాహసాలకు మారుపేరుగా ఈయనకు పోలీసు శాఖలో గుర్తింపు ఉంది. పలాస మండలం నీలిభధ్రలో ఒక వ్యక్తిని చంపేందుకు నక్సలైట్లు ప్రణాళిక సిధ్ధం చేశారు. అతన్ని రక్షించేందుకు ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. అప్పటికి వజ్రపుకొత్తూరులో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పాపారావును పోలీసు పికెటింగ్‌కి ఇన్‌చార్జిగా నియమించారు. 1997 జూలై 17న అర్ధరాత్రి వేళ ఆ వ్యక్తి ఇంటిపై నక్సల్స్ దాడి చేయడంతో పాపా రావు ఎదిరించి వీరోచితంగా పోరాడారు. చివరకు నక్సల్స్ తూటాలకు నెలకొరిగారు. ఆయన సేవలకు గుర్తింపుగా కుమారుడు అన్నెపు రమేష్‌కు సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగం రాగా ఎస్పీ సీసీగా సేవలం దించి ప్రస్తుతం విజిలెన్స్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు.
మందుపాతరకు బలి...
పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన నిరుపేద రైతు కూలీ మజ్జి చిన్నవోడు పెద్ద కుమారుడు మజ్జి వెంకటరమణ 1998లో తన 22 ఏటనే కానిస్టేబుల్‌గా చేరారు. స్పెషల్ పార్టీలో చురుగ్గా విధులు నిర్వహిస్తూ ఉన్నతాధికారుల వద్ద గుర్తింపుపొందారు. భామిని మండలం నులక జోడులో అర్ధరాత్రి సుమారు 200 మంది ఆదివాసీ గిరిజనులతో కలిసి నక్సలైట్లు రైస్ మిల్లులో దోపిడీ చేసి బియ్యం బస్తాలు ఎత్తుకెళ్లిపోయారు. కూంబింగ్‌కు వెళ్లిన వెంకటరమణ 2001 అక్టోబరు 27న నడిమిగూడ వద్ద నక్సల్స్ అమర్చిన మందుపాతర పేలి మృత్యువాత పడ్డారు. ఆయన సేవలను గుర్తించి ఆయన చెల్లి త్రివేణికి అటెండర్‌గా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం ఆమె జిల్లా పోలీసు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.
కొడుకును తోడుగా ఉంచండి
- వెంకటరమణ తండ్రి చిన్నవోడు అభ్యర్థన
మజ్జి వెంకటరమణ తల్లిదండ్రులు నరసమ్మ, చిన్నవోడు. వీరికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారుడు వెంకటరమణ నక్సల్స్ దాడిలో మృతి చెందగా.. రెండో కుమారుడు ఏపీఎస్పీ 16వ బెటాలియన్‌లో ఏజెన్సీ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహాలు జరగ్గా వెంకటరమణ మృతి చెందడంతో ఆయన సోదరి త్రివేణికి ఉద్యోగం ఇచ్చారు. ఆమెతో పాటు చిన్న కొడుకు తల్లిదండ్రుల పోషణ బాధ్యతలను తీసుకున్నారు. అయితే వృత్తిరీత్యా వెంకటరమణ తమ్ముడు విశాఖ జిల్లా ఏజెన్సీలో విధులు నిర్వహించడం, కుమార్తెలు అత్తవారింట్లో ఉన్నారు. 2022 డిసెంబరులో తల్లి నరసమ్మ చనిపోవడంతో తండ్రికి తోడు లేకుండాపోయింది. అయితే తల్లిదండ్రుల ఆలనాపాలన కోసం చిన్న కుమారుడు తనకు తోడుగా ఉండేలా.. ఆయనను శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేయాలని చిన్నవోడు నాటి ఎస్పీ త్రివిక్రమవర్మ నుంచి అందరి అధికారులకు మొర పెట్టుకున్నా నేటికీ ఫలితం కనిపించలేదు. దీనికి నిరసనగా చిన్నవోడు ఏటా జరిగే అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి రావడం మానేశారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి.. ముసలితనంలో తన రెండో కుమారుడిని తనకు తోడుగా ఉంచాలని ఆయన వేడుకుంటున్నారు.