బియ్యం అక్రమ రవాణా
ABN , Publish Date - Mar 06 , 2024 | 11:56 PM
నరసన్నపేటలో బియ్యం అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. 25 కేజీల ప్యాకెట్లను బిల్లుల్లో 26 కేజీలుగా చూపుతూ మిల్లర్లు, వ్యాపారులు విక్రయిస్తున్నారు. అటు పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఎగనామం పెడుతున్నారు.

- అడ్డుకున్న జీఎస్టీ అధికారులు
నరసన్నపేట, మార్చి 6: నరసన్నపేటలో బియ్యం అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. 25 కేజీల ప్యాకెట్లను బిల్లుల్లో 26 కేజీలుగా చూపుతూ మిల్లర్లు, వ్యాపారులు విక్రయిస్తున్నారు. అటు పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఎగనామం పెడుతున్నారు. ఇటు వినియోగదారులను దోచుకుంటున్నారు. జీఎస్టీ అధికారుల తనిఖీల్లో బియ్యం అక్రమ దందా బయటపడింది. బొరిగివలసలో టి.షుణ్ముఖరావుకు చెందిన శ్రీ సాయి శాంతామణి మిల్లు నుంచి సారవకోటకు బోలారోలో 121 బియ్యం ప్యాకెట్లు (25కేజీలు చొప్పున) తరలిస్తున్నారు. బుధవారం కాశీబుగ్గ జీఎస్టీ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి జమ్ము జంక్షన్ వద్ద ఈ వాహనాన్ని తనిఖీ చేశారు. ఎటువంటి బిల్లులు లేకుండా, 25కేజీలు లేబుల్ ఉన్న ప్యాకెట్లతో బియ్యాన్ని తరలిస్తున్నట్టు గుర్తించారు. జీఎస్టీ అధికారులు బిల్లుల కోసం డ్రైవర్‌ను అడగా.. ఓనర్ ఇవ్వలేదని సమాధానమిచ్చారు. అధికారులు మరింత పట్టుబట్టగా.. 26 కేజీలు ప్యాకెట్లు తరలిస్తున్నట్టు అప్పటికప్పుడు బిల్లులను తయారీ చేసి.. వాట్సాప్ ద్వారా చూపించారు. ప్రభుత్వ నిబంధన మేరకు 25 కేజీల దాటిన బియ్యం బస్తాలకు ఎటువంటి పన్ను లేదు. ఇదే అదునుగా బిల్లుల్లో 26 కేజీలు చూపిస్తూ.. 25 కేజీల కంటే తక్కువ బియ్యాన్ని బస్తాల్లో ప్యాకింగ్ వ్యాపారులు అక్రమ దందా సాగిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో రైస్‌మిల్లు యాజమానికి నోటీసులు జారీ చేశామని కాశీబుగ్గ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ వెంకటపద్మ తెలిపారు. పన్నుతో పాటు పదిరెట్లు అపరాధ రుసుం చెల్లిస్తే సరుకు అందజేస్తామన్నారు.
అందరు మిల్లర్లూ.. ఇదేతీరు
నరసన్నపేటలో మిల్లర్లు అంతా ఇంచుమించు ఇదేరీతిలో వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. వివిధ రకాల కంపెనీలకు చెందిన బియ్యంగా కవర్లును తయారుచేసి వాటిమీద మిల్లుపేరు లేకుండా ఎక్కడో అడ్రస్‌ను ముద్రించి.. ప్యాకెట్లు విక్రయిస్తున్నారు. మరికొందరు పేరున్న కంపెనీల బ్యాగ్‌లలో ప్యాకింగ్ చేసి వ్యాపారాలు సాగిస్తున్నారు. కొందరు మిల్లర్లు సన్నబియ్యాన్ని అందమైన సంచులలో ప్యాకింగ్ చేసి.. లోపల ముదుగు రకం బియ్యాన్ని కల్తీ చేసి విక్రయిస్తున్నారు. బొరిగివలస, మడపాం కేంద్రంగా పీడీఎస్ రైస్‌ను కూడా ప్యాకింగ్ చేసి విక్రయాలు చేస్తున్నారు. జీఎస్టీ అధికారులు, విజిలెన్స్ అండ్‌ఎన్‌పోర్స్‌మెంట్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తే బియ్యం వ్యాపారుల అక్రమాలు మరింత బయటపడే అవకాశం ఉంది.