Share News

‘చౌక’గా మోసం!

ABN , Publish Date - Oct 25 , 2024 | 11:28 PM

జిల్లాలో ఎంఎల్‌ఎస్‌ గోదాముల నుంచి డిపోలకు సరఫరా చేసే బియ్యంలో తరుగు వస్తుండడంతో రేషన్‌ డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఉదాహరణకు.. మెళియాపుట్టి మండలంలో 44 రేషన్‌ డిపోలు ఉండగా.. ఒక్కో డిపోకు ప్రతి నెలా సుమారు 100 కిలోలు తగ్గుతున్నట్టు తెలుస్తోంది.

‘చౌక’గా మోసం!
మెళియాపుట్టి ఎంఎల్‌స్‌ గోదాంలో బియ్యం బస్తాలు

- ఎంఎల్‌ఎస్‌ గోదాముల వద్ద తగ్గుతున్న బియ్యం

- ఆందోళన చెందుతున్న డీలర్లు

మెళియాపుట్టి, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి):

- మెళియాపుట్టి మండలం జలగలింగుపురం రేషన్‌ డిపోకు సంబంధించి 370 రేషన్‌ కార్డులకుగానూ ప్రతి నెల 54 క్వింటాళ్ల బియ్యం రావాలి. కానీ ప్రతి నెలా 60 నుంచి 80 కిలోల బియ్యం తగ్గుతుండడంతో డీలర్‌ ఆందోళన చెందుతున్నాడు. ఆ లోటు బియ్యాన్ని ఇతరుల దగ్గర కొనుగోలు చేసి ఎండీయూ వాహనదారుడికి ఇవ్వాల్సి వస్తోందని వాపోతున్నాడు.

....................

- మెళియాపుట్టి మండలం సుందరాడ రేషన్‌ డిపో పరిధిలో 465 రేషన్‌ కార్డులు ఉన్నాయి. ప్రతి నెల 92 క్వింటాళ్ల బియ్యం రావల్సి ఉండగా.. 70 నుంచి 100 కిలోల వరకూ తగ్గుతున్నాయి. దీంతో తమకు నష్టం తప్పడం లేదని డీలర్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

....................

జిల్లాలో ఎంఎల్‌ఎస్‌ గోదాముల నుంచి డిపోలకు సరఫరా చేసే బియ్యంలో తరుగు వస్తుండడంతో రేషన్‌ డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఉదాహరణకు.. మెళియాపుట్టి మండలంలో 44 రేషన్‌ డిపోలు ఉండగా.. ఒక్కో డిపోకు ప్రతి నెలా సుమారు 100 కిలోలు తగ్గుతున్నట్టు తెలుస్తోంది. ఈ బియ్యం ఎక్కడకి వెళుతున్నాయో అర్థం కావడం లేదు. వైసీపీ పాలనలో ఇంటింటికీ రేషన్‌ సరుకులు అందించాలనే ఉద్దేశంతో రూ.కోట్లు వెచ్చించి ఎండీయూ వాహనాలు ఏర్పాటు చేసినా ప్రయోజనం కనిపించలేదు. ఈ-పాస్‌ యంత్రాలు, ఎలక్ర్టానిక్‌ కాటాలు తెచ్చినా.. బియ్యం తరుగుదల తగ్గడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్‌ బియ్యం దందాపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ పలుచోట్ల గోదాములు తనిఖీ చేసి.. అక్రమాలు గుర్తించారు. కానీ ఇంకా గోదాముల్లో అక్రమ దందాలు తగ్గడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

జిల్లాలో ఇదీ పరిస్థితి

జిల్లాలో 1,603 చౌకధరల డిపోల పరిధిలో 6,71,803 రేషన్‌ కార్డులు ఉన్నాయి. 422 ఎండీయూ వాహనాల ద్వారా రేషన్‌ కార్డుదారులందరికీ బియ్యం సరఫరా చేస్తున్నారు. కాగా.. పౌరసరఫరాల గోదాముల నుంచి మండలాల్లో రేషన్‌ డిపోలకు బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. వాటిని డీలర్లు తూకం వేసి.. ఎండీయూ వాహన ఆపరేటర్లకు అప్పగిస్తారు. కాగా.. గోదాముల వద్ద తూకం వేసి.. రేషన్‌ డిపోలకు తెచ్చిన బియ్యంలో తరుగు కనిపిస్తోందని డీలర్లు ఆవేదన చెందుతున్నారు. ఒక్కో డిపోకు 80 కేజీల నుంచి 100 కేజీల వరకూ తరుగు వస్తోందని.. గోదాముల వద్ద కాటాలో ఏదో మతలబు ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. గోదాముల్లో తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని ఇటీవల ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు చాలా గోదాముల వద్ద తరుగు వస్తున్నట్టు అధికారులు సైతం నివేదికలు అందజేసినట్టు తెలుస్తోంది.

పక్కదారి..

ప్రస్తుతం మార్కెట్‌లో రేషన్‌ బియ్యానికి అధిక ధర ఉంది. కిలో రూ.30 నుంచి రూ.40 వరకు విక్రయిస్తున్నారు. దీంతో రేషన్‌ బియ్యం అక్రమ రవాణా సాగుతోంది. జిల్లాలో కొంతమంది లబ్ధిదారుల వద్ద రేషన్‌ బియ్యాన్ని కిలో రూ.20కు వ్యాపారులు కొనుగోలు వాటిని.. మిల్లర్లకు రూ.25కు విక్రయిస్తున్నారు. గోదాముల్లో మిగిలిన బియ్యాన్ని కూడా.. కొంతమంది వ్యాపారులకు రహస్యంగా విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ఆశ్రమ పాఠశాలల వార్డెన్లు సైతం కొన్ని బియ్యం బస్తాలను మిగిలించి.. గోదాముల్లో పనిచేస్తున్న కొంతమంది ద్వారా విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రేషన్‌ బియ్యం అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. గోదాముల నుంచి తరుగు లేకుండా బియ్యాన్ని అందించాలని డీలర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయమై పాతపట్నం సీఎస్‌ డీటీ బెజ్జి ప్రసాదరావు వద్ద ప్రస్తావించగా.. గోదాముల నుంచి రేషన్‌ బియ్యం తూకం వేసి డిపోలకు అందజేస్తున్నామని తెలిపారు. ఎక్కడ తేడా జరుగుతుందో పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 11:28 PM