Share News

కిరణ్‌పై తిరుగుబాటు

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:18 AM

ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌పై సొంత పార్టీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు.

 కిరణ్‌పై తిరుగుబాటు
ఎమ్మెల్యే కిరణ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వైసీపీ నాయకులు

- ఆయనకు టికెట్‌ ఇస్తే మూకుమ్మడి రాజీనామాలు చేస్తాం

- సమావేశమైన వైసీపీ నేతలు

లావేరు, జనవరి 11: ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌పై సొంత పార్టీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. ఆయనకు టికెట్‌ ఇస్తే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని అధిష్ఠానాన్ని హెచ్చరించారు. లావేరు మండలం తాళ్లవలస వద్ద గురువారం కిరణ్‌ వ్యతిరేక వర్గానికి చెందిన సీనియర్‌ నాయకులు లుకలాపు అప్పలనాయుడు, జరుగుళ్ల శంకరరావు, పైడి భాస్కరరావు, బూరాడ వెంకటరమణ, అల్లు భాస్కరరావు, సాకేటి నాగరాజు, గొర్లె రామినాయుడు, తేనెల సురేష్‌, పెరిమల్ల రమణ తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘2019 ఎన్నికల్లో కిరణ్‌కుమార్‌ గెలుపునకు మేము ఎంతో శ్రమించాం. ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత మాలాంటి సీనియర్లను పక్కన పెట్టేశారు. ఆయనకు ఆదాయాన్ని సమకూర్చే కొంతమందిని అక్కున చేర్చుకున్నారు. మమ్మల్ని అవమానాలకు గురిచేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రెండేసి గ్రూపులు పెట్టి పార్టీని భ్రష్టుపట్టించారు. ఈసారి ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వొద్దు. వేరే ఎవరికి ఇచ్చినా మేమంతా కలిసి పని చేస్తాం.’ అని తెలిపారు. ఈ సందర్భంగా కిరణ్‌ వద్దు.. సీఎం జగన్‌ ముద్దు అని నినాదాలు చేశారు.

Updated Date - Jan 12 , 2024 | 12:18 AM