Share News

అంగన్‌వాడీలకు అద్దె కష్టాలు

ABN , Publish Date - Jul 08 , 2024 | 11:45 PM

అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులకు అద్దె కష్టాలు వెంటాడుతున్నాయి. జిల్లాలోని చాలా కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలకు అద్దె పెంచుతున్నట్టు ఆదేశాలు జారీచేసినా.. అమలుకాలేదు.

అంగన్‌వాడీలకు అద్దె కష్టాలు
రట్టిణిలో అద్దె ఇంట్లో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రం

- బిల్లులు చెల్లింపులో వైసీపీ నిర్లక్ష్యం

- పేరుకుపోయిన బకాయిలు

- నిర్వాహకులపైనే భారం

(మెళియాపుట్టి)

మెళియాపుట్టి మండలం పెంగువాడ గిరిజన అంగన్‌వాడీ కేంద్రంలో 12 మంది చిన్నారులు ఉన్నారు. వీరితో పాటు బాలింతలు, గర్భిణులు మరో 15 మంది ఉన్నారు. ఇరుకైన అద్దె ఇంట్లో కేంద్రం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ప్రతినెలా సక్రమంగా అద్దె బిల్లు చెల్లించకపోవటంతో నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. సొంత డబ్బులు వెచ్చించి అద్దె చెల్లిస్తున్నారు.

.....................

మెళియాపుట్టి మండలం రట్టిణి గ్రామంలో కూడా అంగన్‌వాడీ కేంద్రం అద్దె ఇంట్లో నిర్వహిస్తున్నారు. ఇక్కడ 15 మంది చిన్నారులు ఉన్నారు. ఏడాది నుంచి అద్దె బిల్లులు రాకపోవడంతో.. అంగన్‌వాడీ సిబ్బంది సొంత డబ్బులు చెల్లిస్తున్నారు.

....................

అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులకు అద్దె కష్టాలు వెంటాడుతున్నాయి. జిల్లాలోని చాలా కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలకు అద్దె పెంచుతున్నట్టు ఆదేశాలు జారీచేసినా.. అమలుకాలేదు. సక్రమంగా అద్దె బిల్లులు మంజూరు చేయకపోవడంతో.. ఇంటి యాజమానుల ఒత్తిడి భరించలేక నిర్వాహకులు సొంత డబ్బులు చెల్లిస్తున్నారు. ప్రస్తుత ఎన్డీయే కూటమి ప్రభుత్వమైనా సకాలంలో అద్దె బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు.

జిల్లాలో 3,358 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 946 కేంద్రాలు మాత్రమే సొంత భవనాల్లో నిర్వహిస్తున్నారు. 1,335 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మరో 1,077 కేంద్రాలు.. పాఠశాలలు, ప్రభుత్వ భవనాల్లో నిర్వహిస్తున్నారు. గతేడాది డిసెంబరు నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు అద్దె పెంచుతున్నట్టు అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. పట్టణ ప్రాంతాల్లో రూ.4వేల నుంచి రూ.6వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు పెంచుతున్నట్టు వెల్లడించింది. అలాగే గిరిజన గ్రామాల్లో రూ.500 నుంచి రూ.వెయ్యికి పెంచుతున్నట్టు పేర్కొంది. కానీ ఇవి ప్రకటనలకే పరిమితమయ్యాయి. అద్దె నిధులు పెంచకపోగా.. సకాలంలో ప్రతినెలా బిల్లులు కూడా చెల్లించకపోవడంతో నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది నవంబరు వరకు మాత్రమే అద్దె బిల్లులు చెల్లించారు. సుమారు 20 లక్షల మేర అద్దె బకాయిలు పేరుకుపోయాయి. అద్దె బిల్లులు మంజూరు చేయాలని గతంలో అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. అలాగే సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు సమ్మెబాట పట్టినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో నిర్వాహకులు తమ జీతం డబ్బుల నుంచి అద్దెలు, విద్యుత్‌, గ్యాస్‌ బిల్లులు చెలిస్తున్నామని వాపోతున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వమైనా తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరుతున్నారు. సకాలంలో అద్దె బిల్లులు మంజూరు చేయాలని వేడుకుంటున్నారు.

Updated Date - Jul 08 , 2024 | 11:45 PM