Share News

తహసీల్దార్‌ చెబితే ఆపాలా?

ABN , Publish Date - Oct 21 , 2024 | 11:55 PM

సోంపేట సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయం.. అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డాగా మారుతోంది. ఇప్పటికే పలు రిజిస్ట్రేషన్లపై కొంతమంది మండిపడుతున్నారు. కార్యాలయంలో డబ్బులిస్తే చాలు.. అక్రమ రిజిస్రేషన్లు సాగిపోతాయని ఆరోపిస్తున్నారు. కంచిలి మండలంలోని వివాదస్పద మహల్పాడు భూముల రిజిస్ర్టేషన్ల వ్యవహారంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తహసీల్దార్‌ చెబితే ఆపాలా?
మహల్పాడులో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి.. వేసిన అక్రమ లే అవుట్‌

- వివాదాస్పద మహల్పాడు భూముల రిజిస్ర్టేషన్‌

- ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ర్టార్‌ ప్రమేయంపై ఆరోపణలు

- ప్రభుత్వ, డీ-పట్టా భూములు సైతం విక్రయం

నాలుగేళ్ల క్రితం గిరిజనులకు ఇచ్చిన భూములు అవి. సాగుకు అనుకూలంగా లేకపోవడంతో.. ఉపాధి కరువై వారంతా వలస వెళ్లారు. దీంతో గ్రామం ఖాళీ అయింది. అంతే కొంతమంది భూబకాసురుల కన్ను ఈ భూములపై పడింది. 20 ఎకరాల్లో భూమి చదునుచేసి వెంచర్లు వేశారు. పైగా రూ.లక్ష స్థలం కొంటే స్కూటీ ఫ్రీ అంటూ ప్రకటనలిచ్చారు. అనుమతులు కూడా లేవు. ఈ విషయం రెవెన్యూ అధికారుల దృష్టికి వెళ్లడంతో అక్కడ బోర్డులు పాతారు. అప్పటి తహసీల్దార్‌ సైతం ఈ భూములను రిజిస్ట్రేషన్‌ చేయొద్దని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. అయినా ఓ అధికారి ఇవేమీ పట్టించుకోలేదు. ఏకంగా రిజిస్ట్రేషన్లు చేసిపెట్టారు. రూ.కోట్ల విలువైన ఈ భూబాగోతంపై ఆంధ్రజ్యోతి కథనం..

కంచిలి/ సోంపేట, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): సోంపేట సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయం.. అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డాగా మారుతోంది. ఇప్పటికే పలు రిజిస్ట్రేషన్లపై కొంతమంది మండిపడుతున్నారు. కార్యాలయంలో డబ్బులిస్తే చాలు.. అక్రమ రిజిస్రేషన్లు సాగిపోతాయని ఆరోపిస్తున్నారు. సర్వే నెంబర్లు అడంగళ్‌లో లేనప్పటికీ రిజిస్ట్రేషన్‌ చేసిన సంఘటన సోంపేట మండలం బెంకిలిలో కొన్నాళ్ల కిందట చోటుచేసుకుంది. ఈ విషయంపై సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోని పరిస్థితి. దీంతో సదరు వ్యక్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో రిజిస్ట్రేషన్‌ రద్దయింది. తాజాగా.. సాక్షాత్తు తహసీల్దార్‌ ఇచ్చిన ఆదేశాలు బేఖాతర్‌ చేస్తూ.. కంచిలి మండలంలోని వివాదస్పద మహల్పాడు భూముల రిజిస్ర్టేషన్ల వ్యవహారంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ లేఅవుట్‌లో వేసిన ఈ స్థలాలకు రిజిస్ర్టేషన్లు చేయొద్దని తహసీల్దార్‌ ఆదేశించినా.. పట్టించుకోక పోవడం చర్చనీయాంశమవుతోంది.

.....................

కంచిలి మండలం భొగాబెణి పంచాయతీ మహల్పాడు గ్రామంలో నివసిస్తున్న గిరిజనులకు గత వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల కిందట డీ-పట్టా భూములను మంజూరు చేసింది. అయితే స్థానికంగా వ్యవసాయానికి అనుకూలత లేకపోవడం, ఉపాధి దొరక్క గ్రామంలోని వారంతా సుదూర ప్రాంతాలకు వలస వెళ్లారు. దీంతో గ్రామం ఖాళీ అయింది. పూరి గుడిసెలు, గ్రామకంఠ భూమి, స్మశానం ఇతర ప్రభుత్వ స్థలాలు మాత్రం మిగిలాయి. పరిసర గ్రామాలకు చెందిన కొంతమంది భూ బకాసురుల కళ్లు ఈ భూములపై పడ్డాయి. గ్రామ సమీపంలో కొంత జిరాయితీ భూమి కొనుగోలు చేసి, పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని సైతం ఆక్రమించారు. వారు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి.. రైతుల పేరిట సుమారు 20ఎకరాల్లో భూమి చదును చేసి రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేసి విక్రయించారు. ఈ భూముల విక్రయాలకు ప్రభుత్వం నుంచి అనుమతులు లేవు. అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ భూమిని సైతం కబ్జా చేసి.. 996 ఇళ్ల స్థలాలకు వెంచర్లు వేసిన రియల్‌ దందాపై పలువురు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతానికి ఈ వెంచర్‌లో 200 పైగా స్థలాలను పలువురు కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రభుత్వ భూమిని విక్రయించి.. ప్రజలకు నష్టం కలిగిస్తున్న రియల్‌ ఎస్టేట్‌ సంస్థపై విచారణ చేసి.. చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

రూ.లక్ష స్థలం కొంటే.. స్కూటీ ఫ్రీ

అత్త సొమ్ము.. అల్లుడు దానం చేసిన చందంగా.. ప్రభుత్వ భూమిని అప్పనంగా ఆక్రమించి.. రూ.లక్ష స్థలం కొంటే .. రూ.70వేల స్కూటీని ఫ్రీగా ఇస్తామంటూ రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు ప్రకటనలు గుప్పించారు. 15 అడుగుల వెడల్పు, 40 అడుగుల పొడువు గల స్థలాన్ని తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చని.. దళారీల సాయంతో స్కీమ్‌ల పేరిట ఆశలు కల్పించారు. దీంతో చాలామంది ఈ స్థలాలను కొనుగోలు చేశారు. అలాగే మరికొంతమందికి ఈఎంఐల పేరిట ప్రతినెలా కొంత నగదు తీసుకుని.. వాయిదాలు పూర్తయిన తర్వాత రిజిస్ర్టేషన్‌ కాగిస్తాలు అందిస్తామని చెబుతున్నారు. కాగా.. ఇటువంటి స్కీములకు ఎటువంటి చట్టబద్ధత కానీ, రక్షణ గానీ ఉండవని తెలియక చాలామంది మోసపోతున్నారు. అసలే ఎటువంటి అనుమతులు లేవు. భూమి వారిది కాదు. ఈ నేపథ్యంలో వాయిదాల సొమ్ము అంతా చెల్లించిన తరువాత సంస్థ ఉంటుందో, లేదో తెలియదు. దళారీలు సైతం ఎంతవరకు బాధ్యత తీసుకుంటారో నన్నది సందేహమే.

ఆ స్థలాలు కొనొద్దు

అనుమతులు లేకుండా మహల్పాడులో వేసిన వెంచర్‌లో ఎవరూ స్థలాలు కొనుగోలు చేయవద్దంటూ కంచిలి తహసీల్దార్‌ వై.జయలక్ష్మి పరిసర గ్రామాల్లో దండోరా సైతం వేయించారు. సంబంధిత స్థలాల వద్ద సర్వే నెంబర్లు చూపిస్తూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో పలాస ఆర్డీవో సైతం కొన్నాళ్ల కిందట ఇక్కడకు వచ్చి పరిశీలించారు. అయితే వివాదస్పద భూముల్లో వెంచర్‌ను పరిశీలించి చర్యలు తీసుకున్న కంచిలి రెవెన్యూ అధికారి ఇటీవల బదిలీపై వెళ్లారు. కొత్త తహసీల్దార్‌ రావడంతో మళ్లీ వెంచర్‌ నిర్వాహకులు తమ క్రయవిక్రయాలు మొదలు పెట్టారు. గతంలో అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డుకు రంగులు వేసి.. వాటిపై ఉన్న సర్వే నెంబర్లు తొలగించారు.

సబ్‌రిజిస్ర్టార్‌ తీరుపై అనుమానాలు

మహల్పాడు భూములకు సంబంధించి ఎటువంటి రిజిస్ర్టేషన్లు చేయొద్దని.. సోంపేట సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయానికి సైతం అప్పటి తహసీల్దార్‌ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కాగా.. ప్రస్తుతం సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో ఇన్‌చార్జిగా వ్యహరిస్తున్న వ్యక్తి.. ఇటువంటి వివాదస్పద భూముల రిజిస్ర్టేషన్లపైనే ఎక్కువగా దృష్టిసారిస్తూ.. చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.సోంపేట మండలం బెంకిలిలో కొన్నాళ్ల కిందట.. సర్వే నెంబర్లు అడంగళ్‌లో లేనప్పటికీ రిజిస్ట్రేషన్‌ చేసేశారు. ఈ విషయంపై సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. దీంతో రిజిస్ట్రేషన్‌ రద్దయింది. తాజాగా.. కంచిలి మండలంలోని వివాదస్పద మహల్పాడు భూముల రిజిస్ర్టేషన్ల వ్యవహారంపైనా అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిజిస్ట్రార్‌లకు ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక విచక్షణాధికారం ఎనీవేర్‌(ఎక్కడైనా) అనే ఆప్షన్‌ను తమకు అనుకూలంగా మలచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వివాదస్పద భూముల రిజిస్ర్టేషన్‌పై సంబంధిత అధికారికి వివరణ కోరగా.. ‘తహసీల్దార్‌ చెప్పారు.. ఇతర అధికారులు చెప్పారని రిజిస్ర్టేషన్‌ను నిలుపుదల చేయం. కేవలం కోర్టులు ఆదేశిస్తేనే ఆపుతా’మంటూ చెప్పడం కొసమెరుపు. ఇటువంటి చర్యలపై ఉన్నతాధికారులు విచారణ చేసి, ప్రభుత్వ భూములను సంరక్షించడమే కాకుండా పేద ప్రజలు మోసపోకుండా చూడాలని సర్వత్రా కోరుతున్నారు.

ఇటీవల రిజిస్ర్టేషన్‌ చేసిన భూములివే

మహల్పాడు వద్ద ఉన్న జిరాయితీ భూములను సెంట్లుగా విభజించి రిజిస్ర్టేషన్లు చేయాలని తహసీల్దార్‌ సూచించారు. కానీ అలా చేయకుండా ఇళ్ల స్థలాలుగా రిజిస్ర్టేషన్లు చేస్తున్నారు. ఎల్‌పీ నెంబర్లు యథాతథంగా ఉంచి, వేరే సర్వే నెంబర్లతో రిజిస్ర్టేషన్లు చేస్తూ కొనుగోలుదారులను మోసగిస్తున్నారు. మహల్పాడులో వెంచర్‌కు సంబంధించి సర్వే నెంబరు 469/12బి. ఎల్‌పీ నెంబరు 182లో తే8.10.2024దీన డాక్యుమెంట్‌ నెంబరు 5996 నుంచి 9 డాక్యుమెంట్లు రిజిస్ర్టేషన్‌ చేసినట్లు సమాచారం.తప్పుడు సర్వే నెంబర్లతో ఎల్‌పీ నంబర్లు ఉపయోగిస్తూ రిజిస్ర్టేషన్లు చేస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం

బోగాబెణి పంచాయతీ మహల్పాడులో వెలసిన లే అవుట్‌ విషయంలో ఇప్పటికే పలు ఫిర్యాదులు అందాయి. లే అవుట్‌ను పరిశీలించి.. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం. గతంలో ఈ లే అవుట్‌లో అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు తొలగించిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాం.

ఎన్‌.రమేష్‌కుమార్‌, తహసీల్దార్‌, కంచిలి

Updated Date - Oct 21 , 2024 | 11:56 PM