Share News

చోరీ సొత్తు రికవరీ

ABN , Publish Date - Oct 21 , 2024 | 12:06 AM

సోంపేట, మందస పోలీస్‌ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు సంబంధించి రూ.2.05 లక్షలు విలువైన సుమారు 122 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు సోంపేట సీఐ బి.మంగరాజు తెలిపారు.

చోరీ సొత్తు రికవరీ
మాట్లాడుతున్న సీఐ మంగరాజు

సోంపేట, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): సోంపేట, మందస పోలీస్‌ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు సంబంధించి రూ.2.05 లక్షలు విలువైన సుమారు 122 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు సోంపేట సీఐ బి.మంగరాజు తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ బి.హైమావతితో కలిసి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. పట్టణంలోని చిన్నకోమటి వీధికి చెందిన కోల కిరణ్‌ అనే వ్యక్తి జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు అలవాటు పడ్డాడన్నారు. ఈ క్రమంలో తాళాలు ఎలా పగలగొట్టాలో యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నట్టు విచారణలో తేలింద న్నారు. ఈనెల 5న మందస మండలం కొత్తపల్లి రోడ్డుపై ఉన్న ఒక దాబా ఇంటి తాళాలు విరగొట్టి లోపల వస్తువులు ఏమీ లేకపోవడంతో సోంపేటలో తాను నివాసం ఉంటున్న చిన్నకోమటి వీధిలో కొంచాడ అర్చన ఇంట్లో చోరీకి పాల్పడినట్టు తెలిపారు. అలాగే 10వ తేదీన మందస మండలం సొండిపూడిలో ఎదురెదురుగా తాళాలు వేసి ఉన్న రెండిళ్ల తాళాలు విరగ్గొట్టి దొంగతనానికి పాల్పడినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు నిందితుడు కోల కిరణ్‌ నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు. దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ కనబరచిన ఎస్‌ఐ హైమావతి, హెచ్‌సీ గవరయ్య, సిబ్బంది నీలకంఠం, ప్రసాద్‌, షన్ముఖను ఎస్పీ మహేశ్వరరెడ్డి, ఏఎస్పీ శ్రీనివాసరావు అభినందించారన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 12:06 AM