భర్త వేధిస్తున్నాడని కులపెద్ద ఇంటి ఎదుట నిరసన
ABN , Publish Date - Feb 06 , 2024 | 11:27 PM
తన భర్త ఇంట్లో ఉన్న బంగారం ఇవ్వాలని నిత్యం వేధిస్తున్నాడ ని మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత కులపెద్ద ఇంటి ఎదుట మంగళ వారం నిరసనకు దిగింది.
కోటబొమ్మాళి: తన భర్త ఇంట్లో ఉన్న బంగారం ఇవ్వాలని నిత్యం వేధిస్తున్నాడ ని మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత కులపెద్ద ఇంటి ఎదుట మంగళ వారం నిరసనకు దిగింది. బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. తనకు వివాహం అయినప్పటి నుంచి మామ వేధిస్తున్నాడని, భరిస్తూ వచ్చినా ఇటీవల తన కుమార్తె పట్ల అసభ్యంగా వ్యవహరించారని ఆరోపించింది. సదరు నిందితుడు జిల్లా సబ్ జైల్‌లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడని, అతనికి బెయిల్‌పై బయటకు తీసుకు వచ్చేందుకు తన భర్త డబ్బులు అవసరమని, బంగారం ఇవ్వాలని చితకబాదుతున్నా డని వాపోయింది. అయితే ఏ విషయమైనా కులపెద్దకు చెప్పకుండా ఏ పనిచేయడని, ఇప్పుడు కూడా తనపై వేధింపులకు బాధ్యత కూడా కుల పెద్దదేనని ఆమె ఆరోపించింది. చుట్టూ చేరిన గ్రామస్థులు, పెద్దల ఎదుట తన కుటుంబ పరిస్థితులను తెలిపి కన్నీరుమున్నీరైంది. ఇంట్లో 40 తులాల బంగారు పోయినట్లు భర్త అందరికీ చెబుతున్నాడని, అయితే బంగారం పోలేదని, అది బయట ఉంటే తన భర్త ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాడని, ఈ బంగారం భద్రపరిచానని ఆమె తెలిపింది. తమ బతుకులను ఛిద్రం చేసిన వ్యక్తి బెయిల్ కోసం బంగారం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో స్థానిక టీడీపీ నాయకుడు బోయిన గోవిందరాజులు బయట జరుగుతున్న హడావుడిని గుర్తించి బయటకు వచ్చి పరిస్థితిని అడిగి తెలుసుకుని సర్ది చెప్పడంతో సద్దు మణిగింది.