Share News

ప్రజాగళం... ప్రభం‘జనం’

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:32 AM

పలాస.. పసుపుమయమైంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సోమవారం రాత్రి పలాసలో నిర్వహించిన ప్రజాగళం సభ.. ప్రభంజనంగా మారింది. భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు.

ప్రజాగళం... ప్రభం‘జనం’
చంద్రబాబు సభకు హాజరైన పార్టీ శ్రేణులు, అభిమానులు

- పలాసలో చంద్రబాబుకు ఘన స్వాగతం

- రోడ్‌షోకు పోటెత్తిన అభిమానులు, ప్రజలు

(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి/పలాస)

పలాస.. పసుపుమయమైంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సోమవారం రాత్రి పలాసలో నిర్వహించిన ప్రజాగళం సభ.. ప్రభంజనంగా మారింది. భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. చంద్రబాబుకు నీరాజనం పలికారు. ‘జై తెలుగుదేశం.. జై.జై తెలుగుదేశం’.. ‘సీఎం.. సీఎం..’ అంటూ నినాదాలు చేశారు. ఆ ఉత్సాహంతో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, సీఎం జగన్‌, మంత్రి సీదిరి అప్పలరాజు, ఆ పార్టీ నేతల రాజకీయ డ్రామాలను తూర్పారబడుతూ.. చంద్రబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు గంటన్నరపాటు ఉషారుగా ప్రసంగించగా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. చప్పట్లతో హోరెత్తించారు. తాను ఎన్నోమార్లు ఈ ప్రాంతానికి వచ్చినా.. ఎన్నికల ముందు ఇంత జనాన్ని తాను చూడలేదని.. జనాన్ని చూసి.. వారి స్పందన చూసి చంద్రబాబు ఉబ్బితబ్బిబ్బి అయిపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీని వీడిన వారు.. మళ్లీ చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిపోయారు. ఇదిలా ఉండగా ముందస్తు చర్యగా డ్రోన్‌ కెమెరాలు, ప్రత్యేక పోలీసులను అడుగడుగునా పహారా పెట్టారు. వాహన రద్దీలను అడ్డుకోవడానికి పోలీసులు సైకిళ్లను బారికేడ్లుగా పెట్టడంపై చర్చించుకున్నారు.

- చంద్రబాబు సభకు పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాల నుంచి వేలాది మంది ప్రజలు, మహిళలు సైతం తరలివచ్చారు. కాగా నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల్లో ఎలుగుబంట్లు సంచారం భయంతో కొంతమంది మహిళలు ముందుగానే ఇళ్లకు వెళ్లిపోయారు. ఏది ఏమైనప్పటికీ పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో మంత్రి సీదిరి అప్పలరాజుపై ఎంతటి వ్యతిరేకత ఉందో సభ ద్వారా మరోసారి స్పష్టమైంది. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థులు గౌతు శిరీష, గొండు శంకర్‌, మామిడి గోవిందరావు, బగ్గు రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:32 AM