Share News

ఎత్తిపోతలు.. ఎదురుచూపులు

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:38 PM

సాంకేతికత అభివృద్ధి చెందని ఆ రోజుల్లోనే రైతులు సమష్టిగా ముందుకు సాగారు. సాగునీటి కష్టాల పరిష్కారానికి నడుం బిగించి ఎచ్చెర్ల మండలం పొన్నాడ వద్ద ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఫలితంగా పంటల సమృ ద్ధి సాధించారు. కొన్నేళ్లపాటు ఆ పథకాన్ని సమ ర్థవంతంగానే నిర్వహించారు.

ఎత్తిపోతలు.. ఎదురుచూపులు
పొన్నాడ వద్ద నాగావళి నది ఒడ్డున గతంలో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల ప్రదేశం ఇదే

- ‘పొన్నాడ’ పథకాన్ని పునరుద్ధరించాలని రైతుల విజ్ఞప్తి

(ఎచ్చెర్ల)

సాంకేతికత అభివృద్ధి చెందని ఆ రోజుల్లోనే రైతులు సమష్టిగా ముందుకు సాగారు. సాగునీటి కష్టాల పరిష్కారానికి నడుం బిగించి ఎచ్చెర్ల మండలం పొన్నాడ వద్ద ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఫలితంగా పంటల సమృ ద్ధి సాధించారు. కొన్నేళ్లపాటు ఆ పథకాన్ని సమ ర్థవంతంగానే నిర్వహించారు. నారాయణపురం కాలువ అందుబాటులోకి రావడంతో ఈ ఎత్తిపోతలపై నిర్లక్ష్యపు నీడలు అలముకున్నాయి. దీంతో కొన్నాళ్లుగా ఈ ప్రాంత రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ పథకాన్ని పునరుద్ధరిం చాలని కోరుతున్నారు.

ఏడు దశాబ్దాల కిందటే..

నాగావళి నది ఒడ్డున పొన్నాడ వద్ద ఏడు దశాబ్దాల కిందటే ఎత్తిపోతల పథకం రూపం దాల్చుకుంది. 1954-55లో స్థానిక గ్రామపెద్ద పంచిరెడ్డి నీలయ్య అధ్యక్షతన పొన్నాడ డేనియల్‌ పర్య వేక్షణలో రైతుల సహకారంతో ఎత్తిపోతలను ఏర్పాటు చేసి ఆయిల్‌ ఇంజన్ల ద్వారా నడిపించారు. ఈ ఎత్తిపోతల ద్వారా పొన్నాడ, వెం కన్నగారిపేట, తెప్పరేవు గ్రామాలకు చెందిన సుమారు 700 ఎకరా లకు సాగునీటిని అందించారు. ఆరేడు సంవత్సరాల పాటు ఈ పథ కం బాగానే నడిచింది. ఆ తర్వాత నారాయణపురం ఆనకట్ట నిర్మిం చడంతో ఈ ప్రాంతానికి సాగునీరు అందింది. దీంతో పొన్నాడ ఎత్తిపోతలను నిర్లక్ష్యం చేశారు.

కుడి కాలువ కింద ఉన్నా..

నారాయణపురం ఆనకట్ట కుడి కాలువ కింద శివారున ఉన్న ఎచ్చెర్ల మండలంలోని తోటపాలెం, పొన్నాడ, బొంతల కోడూరు, ధర్మవరం, కొంగరాం, ముద్దాడ, కొత్తపేట, భగీరఽథ పురం తదితర గ్రామాలకు ఏటా సాగునీటి కష్టాలు తప్పడం లేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కాలువ ద్వారా సకాలంలో సాగునీరు అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పంటలు ఆశించిన స్థాయిలో పండడంలేదు. నారాయణపురం ఆధునికీకరణ పనులకు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జైకా నిధులు మంజూరైనా... పనులు మాత్రం పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో పొన్నాడ వద్ద ఎత్తిపోతల పునరుద్ధరణతో ఎంతో ప్రయోజనమని రైతులు అభిప్రాయ పడుతున్నారు. పొన్నాడ కొండపై మోటారు షెడ్‌ను నిర్మించి అక్కడి నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో నారాయణపురం 24/2 బ్రాంచ్‌ చానల్‌ హెడ్‌ వద్ద (తోటపాలెం సమీపంలో) నీరు విడిచిపెడితే శివారు గ్రామాలకు సాగునీటి సమస్య పరిష్కారమవుతుంది. ఎత్తిపోతల ద్వారా బ్రాంచ్‌ చానల్‌ లోకి పంపిన నీటి ద్వారా తమకు ఇబ్బందులు తొలగే అవకాశం ఉం దని రైతులు పేర్కొంటున్నారు. పాలకులు, అధికారులు స్పందించి పొన్నాడ ఎత్తిపోతల పథకాన్ని పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

పునరుద్ధరించాలి

సుమారు ఏడు దశాబ్దాల కిందట పొన్నాడలో నాగావళి నది ఒడ్డున ఎత్తిపోతలను ఏర్పాటు చేశారు. ఈ పథకం కొన్నాళ్ల తర్వాత మరుగున పడిపోయింది. తాజాగా ఈ ఎత్తిపోతల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించి నిధుల మంజూరు చేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.

- పంచిరెడ్డి కృష్ణారావు, స్పందన స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు, పొన్నాడ

Updated Date - Jun 08 , 2024 | 11:38 PM