Share News

అభివృద్ధికి రాజకీయాలు పులమొద్దు

ABN , Publish Date - Mar 14 , 2024 | 12:18 AM

మానవ సేవే మాధవ సేవ అన్న లక్ష్యంతో సొంత నిధుల తో అభివృద్ధి పనులు చేపడుతుంటే వైసీపీ నాయకులు రాజకీయ రంగు పులమడం సరికానది టీడీపీ యువ నాయకుడు, ఉమ్మడి జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు గొండు శంకర్‌ అన్నారు.

అభివృద్ధికి రాజకీయాలు పులమొద్దు

- సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు గొండు శంకర్‌

శ్రీకాకుళం రూరల్‌: మానవ సేవే మాధవ సేవ అన్న లక్ష్యంతో సొంత నిధుల తో అభివృద్ధి పనులు చేపడుతుంటే వైసీపీ నాయకులు రాజకీయ రంగు పులమడం సరికానది టీడీపీ యువ నాయకుడు, ఉమ్మడి జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు గొండు శంకర్‌ అన్నారు. సింగుపురం పంచాయతీ పరిధి కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో రూ.2.5 లక్షలు వెచ్చించి నిర్మించిన రెండు తరగతి గదులను బుధవారం గొండు శంకర్‌ ప్రారంభించి మాట్లాడారు. పాఠశాలలో పూర్తిస్థాయిలో గదులు లేకపోవడంతో 9,10 తరగతుల విద్యార్థులు ఆరు బయట చదవుకునే పరిస్థితి నెలకొందని ప్రిన్సిపాల్‌, ఏపీసీ తనను సంప్రదించారన్నారు. దీంతో ఎనిమిది నెలల కిందట రూ.2.5 లక్షలతో రెండు తరగతి గదులు నిర్మించానన్నారు. అయితే వాటిని ప్రారంభించనీయకుండా స్థానిక వైసీపీ నాయకులు అడ్డుగా నిలుస్తూ వచ్చారని ఆరోపించారు. నాడు-నేడు పేరుతో స్కూల్స్‌ అభివృద్ధి చేస్తున్నట్టు సొంత డాబ్బాలు కొట్టుకునే అధికార పార్టీ నేతలు ఇక్కడి పరిస్థితిని గాలికొదిలేశారని విమర్శించారు. తరగతి గదులు నిర్మించాలని అడిగిన వారితోపాటు ఉపాధ్యాయులు కూడా ప్రారంభోత్సవంలో పాల్గొనకుండా చేయడం.. అధికార పార్టీ నాయకుల అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. అలాగే శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్‌ కళాశాలలో కూడా విద్యార్థుల కోసం ఆడిటోరియం నిర్మించమని అడిగితే ఎనిమిది నెలల కిందటే కట్టించానని, దాని ప్రారంభోత్సవానికి కూడా అడ్డు పడుతున్నారని ఆరోపించారు. ఈ నెల 14వ తేదీన ఉదయం 10 గంటలకు ఎవరు అడ్డుకున్నా ఆడిటోరియం ప్రారంభిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు నీచ రాజకీయాలు మానుకోవాలని శంకర్‌ హితవు పలికారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2024 | 12:18 AM