Share News

ప్రజలు ధైర్యంగా ఓటు వేయాలి

ABN , Publish Date - Apr 14 , 2024 | 12:03 AM

ప్రజలు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ధైర్యంగా ఓటు వేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ తెలిపారు.

ప్రజలు ధైర్యంగా ఓటు వేయాలి
ప్రమాణం చేయిస్తున్న కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌

- స్వీప్‌ కార్యక్రమంలో కలెక్టర్‌

కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 13: ప్రజలు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ధైర్యంగా ఓటు వేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని ఏడురోడ్ల కూడలిలో శనివారం నిర్వహించిన స్వీప్‌ కార్యక్రమంలో భాగంగా ఓటుహక్కు వినియోగంపై ప్రజలకు కలెక్టర్‌ అవగాహన కల్పించారు. సంతకాల సేకరణ, ఫొటో కియోస్క్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల కన్నా ఈసారి పోలింగ్‌ శాతం మరింత పెరగాలన్నారు. మహిళలు, దివ్యాంగులు ఓటు వేసేందుకు ముందుకు రావాలన్నారు. మారుమూల గ్రామాలు, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ శాతం పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ అందరితో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్‌, గ్రామ, వార్డు సచివాలయాల నోడల్‌ అధికారి వాసుదేవరావు, డ్వామా పీడీ చిట్టిరాజు, శ్రీకాకుళం ఆర్డీవో సీహెచ్‌ రంగయ్య, మెప్మా పీడీ కిరణ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం

ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ పేర్కొన్నారు. శనివారం అంబేడ్కర్‌ ఆడిటోరియంలో మైక్రో అబ్జర్వర్లకు అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్‌ విధానాన్ని పరిశీలిస్తూ ఎలాంటి తప్పిదాలు, ఉల్లంఘనలు జరిగినా రిటర్నింగ్‌, ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. పోలింగ్‌కు గంట ముందు మాక్‌ పోలింగ్‌ నిర్వహించాలని తెలిపారు. అభ్యర్థికి ఒక పోలింగ్‌ ఏజెంట్‌ మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్‌ విధానం, ఈవీఎం, వీవీ ప్యాట్ల వినియోగంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. మైక్రో అబ్జర్వర్లు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫారం-12 దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నోడల్‌ అధికారులు, శిక్షణ కార్యక్రమాల సమన్వయకర్తలు బాలాజీ నాయక్‌, ఎం.కిరణ్‌కుమార్‌, శేషగిరిరావు, బి.శాంతిశ్రీ, ఎం.సూర్యకిరణ్‌, దాదాపు 300 మంది మైక్రో అబ్జర్వర్లు పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2024 | 12:03 AM