Share News

ఇంత నిర్దయా?

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:33 AM

పింఛన్‌ లబ్ధిదారుల పట్ల ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోంది. వృద్ధులు, వికలాంగులు అని కూడా చూడకుండా డబ్బుల పంపిణీలో ఇబ్బంది పెడుతోంది. రెండోరోజు గురువారం కూడా చాలాచోట్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

ఇంత నిర్దయా?
శ్రీకాకుళం : దమ్మలవీధి సచివాలయంలో పింఛన్‌దారుల రద్దీ

- పింఛన్‌దారుల పట్ల కక్షగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం

- ఆ నెపం విపక్షాలపై నెట్టివేసేందుకు పన్నాగం

- చాలాచోట్ల ఆలస్యంగా సిబ్బంది హాజరు

- పడిగాపులు కాసిన లబ్ధిదారులు

పింఛన్‌ లబ్ధిదారుల పట్ల ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోంది. వృద్ధులు, వికలాంగులు అని కూడా చూడకుండా డబ్బుల పంపిణీలో ఇబ్బంది పెడుతోంది. రెండోరోజు గురువారం కూడా చాలాచోట్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. కొన్నిచోట్ల నగదు సకాలంలో సచివాలయాలకు చేరుకోలేదు. మరికొన్నిచోట్ల సిబ్బంది విధులకు ఆలస్యంగా వచ్చారు. దీంతో లబ్ధిదారు మండుటెండలో పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో.. దాన్ని విపక్షంపై నెట్టేసేందుకు ప్రభుత్వమే ఇలా చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఆమదాలవలస: ఆమదాలవలసలోని సచివాలయ ఉద్యోగులు పింఛన్ల పంపిణీలో ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతరు చేశారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఈ నెల మూడు నుంచి ఆరోతేదీ వరకూ సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దివ్యాంగులు, దీర్ఘకాలిక రోగులు, నడవలేని స్థితిలో ఉన్న లబ్ధిదారులకు.. ఇంటివద్దకు వెళ్లి పింఛన్లు అందజేయాలని స్పష్టం చేసింది. కాగా.. గురువారం ఆమదాలవలస మునిసిపాలిటీలోని పలు సచివాలయాల్లో కొందరు ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సరుబుజ్జిలి, ఆమదాలవలస మండలాల సచివాలయ ఉద్యోగులు ఉదయం 11 గంటల వరకు హాజరుకాలేదు. దీంతో వృద్ధులు, వితంతవులు, దివ్యాంగులు గంటల తరబడి నిరీక్షించారు. అలాగే ఆమదాలవలస మునిసిపాలిటీ మోనింగివారివీధిలోని సచివాలయం- 1, 2 కేంద్రాల్లో కొంతమంది పింఛన్‌దారులు కుటుంబ సభ్యుల సాయంతో ఆటోలు, ద్విచక్రవాహనాలపై వచ్చి పింఛన్‌ తీసుకున్నారు. సచివాలయ ఉద్యోగులెవరూ పింఛన్‌దారుల ఇంటికి వెళ్లే దాఖలాలు కనిపించలేదు.

సంతబొమ్మాళి: సంతబొమ్మాళి మండలంలోనూ నిబంధనలు పాటించలేదు. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం 7 గంటల నుంచే సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించి.. చాలాచోట్ల నిర్ణీత సమయానికి కార్యాలయాలు తెరవలేదు. లక్కివలస సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటల వరకు పింఛన్లు పంపిణీ చేయకపోవడంతో మండుటెండలో పింఛన్‌దారులు ఇబ్బందులు పడ్డారు.

ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయ ఉద్యోగులు బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసి రావడానికి ఆలస్యమవడంతో పింఛన్‌దారులు పడిగాపులు కాశారు. బెల్లుపడ సచివాలయానికి ఉదయం 7 గంటలకే పింఛన్‌దారులు చేరుకున్నారు. సచివాలయ ఉద్యోగులు మధ్యాహ్నం 2వరకు డబ్బులు డ్రా చేసి రాకపోవడంతో నిరీక్షించారు.

అభయహస్తం ఏదీ?

టెక్కలి: అభయహస్తం పింఛన్‌దారులకు సాంకేతిక సమస్య కారణంగా ఈ నెల పింఛన్‌ డబ్బులు పంపిణీ చేయలేదు. స్వయంశక్తి సంఘాల్లో సభ్యత్వం ఉండి పొదుపు చేసిన మహిళకు 60ఏళ్లు దాటితే.. నెలకు సామాజిక భద్రతా పింఛన్‌ రూ.3వేలుతో పాటు అభయహస్తం పింఛన్‌ రూ.500 అందించేవారు. ఈసారి సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ లాగిన్‌లో గురువారం సాయంత్రం వరకు అభయహస్తం పింఛన్‌ పంపిణీకి సంబంధించిన డిస్‌ప్లే కనిపించలేదు. దీంతో అభయహస్తం పింఛన్లు నిలిచిపోయాయి. జిల్లాలో 13,705 మంది అభయహస్తం పింఛన్‌దారులు ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికీ సామాజిక పింఛన్లు రూ.3వేలు చొప్పున అందజేశారు. కానీ, అభయహస్తం కింద 500 చొప్పున చెల్లించాల్సిన పింఛన్‌ను మాత్రం అందజేయకపోవడంతో వారంతా నిరాశ చెందారు. ఈ విషయమై ఎంపీడీవో విజయకుమారి వద్ద ప్రస్తావించగా అభయహస్తం పింఛన్లకు సంబంధించిన యాప్‌ డిస్‌ప్లే కాకపోవడంతో చెల్లింపులు నిలిచిపోయావని తెలిపారు. డబ్బులు సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ ఖాతాల్లో జమయ్యాయని, యాప్‌ డిస్‌ప్లే అయిన వెంటనే పంపిణీ ప్రక్రియ చేపడతామన్నారు.

టెక్కలిలో తోపులాట

టెక్కలి మేజర్‌పంచాయతీ ఐదవ సచివాలయం పరిధి గ్రామపంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో గురువారం పింఛన్ల పంపిణీ ప్రక్రియలో తోపులాట చోటుచేసుకుంది. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు, ఒంటరిమహిళలు ఇలా అనేకరకాల విభాగాల పింఛన్‌దారులు అక్కడకు చేరుకున్నారు. సచివాలయ సిబ్బంది కనీసం క్యూలైన్‌ కూడా ఏర్పాటు చేయలేదు. పింఛన్‌కు వచ్చేవారికి, వెళ్లేవారికి ఒకటే మార్గం కావడంతో పెద్దఎత్తున తోపులాట చోటుచేసుకోవడంతో పింఛన్‌దారులు అవస్థలు పడ్డారు.

Updated Date - Apr 05 , 2024 | 12:33 AM